అన్నగారి కారణంగా పాపులరైన నియోజకవర్గం
x
NTR

అన్నగారి కారణంగా పాపులరైన నియోజకవర్గం

‘ఎన్టీయార్ ఓడిపోతారని పార్టీలోనే కాదు రాష్ట్రంమొత్తం ఎవరు ఊహించలేద’ని చెప్పారు.


కొన్నినియోజకవర్గాల్లో పోటీచేయటం ద్వారా వ్యక్తులు పాపులరవుతారు. కొందరు పోటీచేయటం ద్వారా నియోజకవర్గాలు పాపులరవుతాయి. రెండోకోవకు చెందిందే కల్వకర్తి నియోజకవర్గం. 1989 ఎన్నికల వరకు కల్వకుర్తి నియోజకవర్గం అంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని చాలామంది జనాలకు తెలీదు. ఎప్పుడైతే అన్నగారు ఎన్టీయార్ పోటీచేయాలని డిసైడ్ అయ్యారో అప్పటినుండే కల్వకర్తి నియోజకవర్గం యావత్ రాష్ట్రం దృష్టిలో పడింది. 1989 ఎన్నికల్లో ఎన్టీయార్ కల్వకుర్తి నియోజకవర్గంలో టీడీపీ అధ్యక్షుడిగా పోటీచేశారు. అన్నగారు పోటీచేయటం అసలు విశేషమే కాదు. ఎందుకంటే ఎన్టీయార్ ఎక్కడపోటీచేసినా నామినేషన్ వేస్తే చాలు గెలిచిపోయినట్లే ఉండేది అప్పట్లో.

తిరుపతి, హిందుపురం, టెక్కలి, గుడివాడ, నల్గొండ నియోజకవర్గాల్లో కూడా పోటీచేశారు. గుడివాడలో రెండుసార్లు పోటీచేసి గెలిచారు. హిందుపురంలో అప్పటికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టున్నారు. కాబట్టి కల్వకుర్తిలో ఎన్టీయార్ పోటీచేయాలని నిర్ణయించుకోగానే రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనమైంది. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకు వలసల జిల్లాగా పేరుంది. అన్నీ విధాలుగా వెనకబడిన జిల్లాలో ఎన్టీయార్ పోటీచేస్తున్నారంటే గెలవటమే ఆలస్యం అన్నీ విధాలుగా డెవలప్ అవుతుందని అందరు అనుకున్నారు. ఎప్పుడైతే ఎన్టీయార్ పోటీచేయబోతున్నారో ప్రత్యర్ధుల్లో గందరగోళం మొదలైంది. అప్పుడు కాంగ్రెస్ తరపున ఎవరు పోటీచేయాలనే విషయంలో సీనియర్లంతా మల్లగుల్లాలు పడ్డారు.

ఎన్టీయార్ కు వ్యతిరేకంగా పోటీచేయటానికి సీనియర్లు ముందుకు రాలేదు. జిల్లా పార్టీతో పాటు రాష్ట్రపార్టీలో కూడా చాలా సమావేశాలు జరిగినా క్యాండిడేట్ ఎవరన్నది తేల్చలేకపోయారు. చివరకు అందరు సీనియర్లు కలిసి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జే. చిత్తరంజన్ దాస్ ను ముందుకు తోశారు. విధిలేక చిత్తరంజన్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ఎన్టీయార్ పెద్దగా ప్రచారంపై దృష్టి కూడా పెట్టలేదు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది పార్టీఅధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించంటం. రెండో కారణం ఏమిటంటే తనకు వ్యతిరేకంగా పోటీచేయటానికి కాంగ్రెస్ కు గట్టి అభ్యర్ధి కూడా లేరుకాబట్టి గెలుపుపై అతివిశ్వాసం. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ నామినేషన్ వేయగానే అందరు ఎన్టీయార్ కు బంపర్ మెజారిటి ఖాయమని ఫిక్సయిపోయారు. పై రెండు కారణాల వల్లే నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే ఎన్టీయార్ ప్రచారంచేశారు.

ఎన్నికలు అయిపోయి అందరు ఫలితాల కోసం ఎందురు చూస్తున్నారు. కౌంటింగ్ రోజున ఫలితాలను చూసి అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎన్టీయార్ ఓడిపోయారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్ చేతిలో తిరుగులేని మనిషి అనిపించుకున్న అన్నగారు ఓడిపోయారు. కొన్ని వందలమందిని ఎంఎల్ఏలుగా గెలిపించిన ఎన్టీయార్ తాను స్వయంగా ఓడిపోవటం అందులోను ఒక యువకుడి చేతిలో అప్పట్లో సంచలనమైంది. ఎన్టీయార్ పై దాస్ గెలిచారంటే చాలామంది నమ్మలేదు. ఎన్టీయార్ ఓడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. దాస్ కు 54,354 ఓట్లొచ్చాయి. ఎన్టీయార్ కు 50,786 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్ధి సంగాపురం సాయికుమార్ కు 556 ఓట్లొచ్చాయి. ఎన్టీయార్ ను ఓడించిన దాస్ ను అందరు జైంట్ కిల్లర్ అని పిలిచేవారు. ఆ ఎన్నికతోనే కల్వకుర్తి నియోజకవర్గం అంటే రాష్ట్రవ్యాప్తంగా పాపులరైపోయింది.

ఇదే విషయమై టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న ఏఎం రాధాకృష్ణ ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘ఎన్టీయార్ ఓటమి అప్పట్లో సంచలనమైంద’న్నారు. ‘ఎన్టీయార్ ఓడిపోతారని పార్టీలోనే కాదు రాష్ట్రంమొత్తం ఎవరు ఊహించలేద’ని చెప్పారు. చంద్రబాబునాయుడు ‘కుప్పం ఎన్నికలో బిజీగా ఉండటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్ధుల అవసరాలు చూసుకోవటంలో బిజీగా ఉన్న కారణంగా కల్వకర్తి వైపు దృష్టిపెట్టలేకపోయి’నట్లు గుర్తుచేసుకున్నారు. ‘ఎన్టీయార్ పార్టీలో అప్పట్లో స్టార్ క్యాంపెయినర్ అంటు ఎవరు లేర’న్నారు. ‘ఎన్టీయార్ ప్రచారంలో రాష్ట్రమంతా తిరుగుతుంటే కల్వకర్తి నియోజకవర్గంలో స్ధానికనేతలు మాత్రమే ఎన్నికల వ్యవహారాలను చూసుకున్న’ట్లు చెప్పారు. ‘అప్పటికే చాపకింద నీరులాగ ఉన్న ఎన్టీయార్ వ్యతిరేకతను తామెవరము గుర్తించలేని కారణంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంపై సీనియర్లు పెద్దగా దృష్టిపెట్టని కారణంగానే ఎన్టీయార్ ఓడిపోయార’ని ఏఎం వివరించారు.

Read More
Next Story