మెట్రో సెకండ్ లైన్‌కు లైన్ క్లియర్.. రూట్ ఇదే!
x
Source: Twitter

మెట్రో సెకండ్ లైన్‌కు లైన్ క్లియర్.. రూట్ ఇదే!

పాతబస్తీకి మెట్రో లైన్ నిర్మాణానికి లైన్ క్లియర్. ఈ ప్రాజెక్ట్‌కు. మార్చి 8న శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. రూ.2000 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం.


షణ్ముఖ పోచరాజు



ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో రెండో లైన్‌కు లైన్ క్లియర్ అయింది. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ అందులో భాగంగానే కొత్త లైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. మెట్రో విస్తరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత పాతబస్తీకి మెట్రో సౌకర్యాలను చేర్చడానికి నిశ్చయించుకున్నారు. ఈ విస్తరణ పనులకు సీఎం రేవంత్.. మార్చి 8న శంకుస్థాపన చేయనున్నారు. ఈ మార్గాన్ని రూ.2వేల కోట్ల వ్యయంతో ఎంజీబీఎస్ నుంచి ఫల్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఒక్కసారి నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లొచ్చు. ఈ మార్గాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

పెండింగ్‌కు అసలు కారణం

భాగ్యనగరంలో ఎల్బీ‌నగర్-మియాపూర్, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్‌ల మధ్య 69.2 కిలోమీటర్ల పొడవున మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఈ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్‌ను ఎల్ అండ్ టీ మెట్రోరైలు సంస్థ సుమారు రూ.16వేల కోట్లతో చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. అప్పట్లోనే పాతబస్తీకి కూడా మెట్రో సౌకర్యాన్ని చేరువ చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు సర్వే కూడా పూర్తి చేయించింది. కానీ పాతబస్తీకి మెట్రో మార్గం నిర్మించాలంటే వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను కూడా తొలగించాల్సి వస్తుందని అప్పట్లో అంతా అనుకున్నారు. దాంతో ఈ నిర్మాణం ఇన్నాళ్లు లేటయింది. కానీ గత ఏడాది రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాతబస్తీకి మెట్రో నిర్మాణం కోసం అధికారులు రూపొందించిన ప్రణాళికకు కూడా సీఎం ఓకే చెప్పారు.

కొత్త మెట్రో లైన్ రూట్ ఇదే

కొత్త మెట్రో లైన్‌ను పక్కా ప్రణాళికతో నిర్మించనున్నారు. ఈ లైను ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీ హవేలీ, ఏత్‌బార్ నౌక్, అలిజాకోట్ల, మీర్‌మొమిన్ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం నాలుగు మెట్రో స్టేషన్‌లు ఉంటాయి. అవి సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నామా వంటి చారిత్రక కట్టడాలకు 500 కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతాయి. అయితే ఈ మార్గం నిర్మించడానికి సుమారు 1,100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. మెట్రో లైన్ వెళ్లే మార్గంలో 100 అడుగు, మెట్రో స్టేషన్ ఉన్న ప్రాంతంలో 120 అడుగుల వరకు రోడ్లను విస్తరించాల్సి ఉంటుంది.
ఈ రోడ్ల విస్తరణ, కట్టడాల తొలగింపు అన్ని కలుపుకుని ఈ కొత్త లైన్ నిర్మాణానికి రూ.2000 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. కాగా ఈ లైన్ నిర్మాణంలో చారిత్రక కట్టడాలు, ప్రార్థనాలయాలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. కాగా ఈ కొత్త లైన్ ప్రాజెక్ట్‌ను ఏ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంటుందో అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం పలు సంస్థలు పోటీ పడనున్నాయి.


Read More
Next Story