కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పాతది రద్దు చేసిన గంటల వ్యవధిలోనే..
x

కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పాతది రద్దు చేసిన గంటల వ్యవధిలోనే..

రెండు సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 పరీక్ష కొత్త నోటిఫికేషన్ రావడానికి మార్గం సుగమం అయింది.


తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రాయలనుకుని తపన పడుతున్న నిరుద్యోగుల కల నెరవేరేందుకు మార్గం సుగమం అవుతోంది. 2022 ఏప్రిల్ లో అప్పటి తెలంగాణ ప్రభుత్వ అనుమతితో టీఎస్పీఎస్సీ జారీ చేసిన గ్రూప్ -1 పరీక్షను ప్రస్తుత కమిషన్ రద్దు చేసిన కమిషన్ గంటల వ్యవధిలోనే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ప్రకటన విడుదల చేశారు.

ఎన్నో వివాదాలతో తెలంగాణలోని గ్రూప్ -1 పరీక్ష నలిగింది. రెండు సార్లు కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, ఒకసారి పేపర్ లీక్ తో రద్దు కాగా, మరోసారి నిబంధనలు పాటించకపోవడంతో హైకోర్టు రద్దు చేసింది. దీంతో నిరుద్యోగులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 503 పోస్టులతో రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన నోటిఫికేషన్ పరీక్షలు 2017 లో తెలంగాణలో నిర్వహించిన, అవి మన రాష్ట్ర ఖాతాలో పడలేదు. అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు కావడం, పోస్టులు కూడా భారీగా ఉండడంతో విద్యార్థులు, నిరుద్యోగులు సంబరపడ్డారు.

ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి, ఫలితాలు వెలువడిన రెండు నెలలకు కమిషన్ లో పేపర్ లీక్ అయినట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కలకలం చెలరేగింది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రకటించిన కమిషన్ ప్రాథమిక సమాచారం ఆధారంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తరువాత రెండో సారి పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే రెండో సారి నిర్వహించిన ప్రిలిమ్స్ లో నిబంధనలను పాటించకపోవడం, ఓఎంఆర్ షీట్ల సంఖ్యలో తేడాలు రావడంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని డివిజన్ బెంచ్ కూడా సమర్ధించడంతో కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం దగ్గర ఉన్న కేసును ప్రస్తుత ప్రభుత్వ హయాంలోని నూతన కమిషన్ కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు తెలియజేసింది. దాంతో ప్రస్తుతం పాత నోటిఫికేషన్ రద్దు చేసింది.

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదనపు పోస్టులతో గ్రూప్ 1 ను భర్తీ చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అధికారంలోకి రాగానే ఆర్థిక శాఖ నుంచి పాత ప్రభుత్వం ప్రకటించిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులకు అనుమతిచ్చింది.

తాజాగా పెంచిన పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలంటే పాత దానిని రద్దు చేయాల్సి ఉండడంతో కమిషన్ ఈ చర్య తీసుకుంది. కొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్, ప్రవర్తన నియామవళి అమలులోకి రానుందని ఊహగానాలు వస్తుండటంతో కమిషన్ వేగంగా అడుగులు వేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే పెంచిన పోస్టులతో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ను కమిషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ రద్దు, కొత్త నోటిఫికేషన్ పై కావ్య( పేరు మార్చాం) అనే నిరుద్యోగిని ఫెడరల్ తో మాట్లాడుతూ " ఎన్ని రోజులకు గుడ్ న్యూస్ విన్నాను. ఉద్యోగం సంగతి తరువాత అసలు నేను మెయిన్స్ పరీక్ష రాస్తానా అనే డౌట్ ఉండేది. చదివింది అంతా వృథా నే అనుకున్నా. కానీ మొత్తానికి పాతది రద్దు చేశారు. కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ప్రభుత్వం లేట్ చేయకుండా పరీక్షలు నిర్వహించాలి " అని ఆనందం వ్యక్తం చేసింది.

ఇదే అంశంపై మహబూబ్ నగర్ కు చెందిన రాజ్ కుమార్ మాట్లాడుతూ " నేను చాలా రోజుల క్రితమే చదవడం మానేశా. కోర్టులోకి కేసు వెళ్లాక నాకు నమ్మకం పోయింది. 2011 ఏపీపీఎస్సీ కేసు తరహలో మరో మూడు, నాలుగు సంవత్సరాలకు గానీ కేసు పై తీర్పు రాదనుకున్నా.. కానీ ప్రభుత్వం, కమిషన్ వల్ల ఇప్పుడు ఇది సాధ్యం అయింది. తిరిగి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా" అని చెప్పారు.


Read More
Next Story