
వందేళ్ల చిరంజీవి : 'చదువుల తాతయ్య' ఐఐటి రామయ్య
చైతన్య నవజీవనంతో తొణికొసలాడుతున్న వందేళ్ల చిరంజీవి
మన చదువుల తాత, మన ఐఐటి రామయ్య, చైతన్య నవజీవనంతో తొణికొసలాడుతున్న వందేళ్ల చిరంజీవి. నెహ్రూ జయంతి 14 అని, ఇందిరాగాంధీ జయంతి 19 అని మనకు తెలుసు. కాని మనం తప్పకుండా తెలుసుకోవలసిన మరొక వ్యక్తి 20 నవంబర్ నాడు వందేళ్ల కిందట జన్మించాడు. ఇప్పుడు మన మధ్యే ఉన్నాడు,. నిండుమనస్సుతో పలకరించి, నిలబడి, చక్రాలబండిలో తిరుగుతూ, నమస్కారములు ఇస్తూ తీసుకుంటూ, మీడియా వాళ్లకు చిన్న ఇంటర్వ్యూలు ఇస్తూ స్ఫూర్తినిస్తూ ఉన్నాడు. మన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఆయన్ని కలిసే అదృష్టం ఎవరికి లభిస్తుంది. అది నాకు లభించింది. ఆయనెవరో కాదు, చుక్కా రామయ్య. కొన్ని వేల మంది విద్యార్థులకు చుక్కాని రామయ్య.
విచిత్రమేమంటే విద్యానగర్ లో వందలాదిమంది ఉంటున్నా, చుక్కా రామయ్య ఎవరంటే తెలియని వాళ్లు బాగా తక్కువ. పేరుకు తగినట్టు ‘విద్యానగర్’ ప్రాంతాన్ని ఆయన అక్షరాల విద్యా నగర్ గా మార్చాడు. అది మరొక విధంగా చుక్కా రామయ్య నగర్. వందేళ్ల రామయ్య ఊరు అని జనం చెప్పుకుంటున్నారు. చెబుతారు కూడా. ప్రభుత్వం ఒప్పుకున్నా లేకపోయినా, ఇది చుక్కరామయ్య నగరమే.
ఇది ఐఐటి రామయ్య విద్యానగర్
రామయ్యగారి కుమార్తె ఐఐటికి ఎంపికైంది. ఈ ప్రతిష్టాకరమయిన సంస్థలకు అడ్మిషన్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఎంపికైన వారిలో తెలుగువారు చాలా తక్కువగా ఉంటున్నారని గ్రహించిన రామయ్య తనే తెలుగు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.విద్యానగర్ లో దానికొక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని ఏర్పాటు చేయడం యాదృచ్ఛికంగా జరిగింది. కొంతమంది విద్యార్థులు, పదవీ విరమణ చేసిన పెద్దలు, ఆయన వద్దకు వచ్చి, తీవ్రమైన పోటీ ఉంటున్న IIT-JEE కోసం శిక్షణ ఇవ్వాలని కోరారు. అలా IIT కోచింగ్ కోసం 1985లో చిన్నగా ఆయన శిక్షణ ప్రారంభమైంది. అదే రామయ్య ఇన్‌స్టిట్యూట్ త్వరగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఉదయం 4 గంటల సమయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు నల్లకుంటకు దారి కడతారు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో అత్యధిక సంఖ్యలో విజయవంతమైన IIT ఆశావాదులను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. రామయ్య ఇన్‌స్టిట్యూట్‌కి వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు, అందులో దాదాపు 175 మంది ఇన్‌స్టిట్యూట్ సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికవుతారు!
చుక్కా రామయ్య
గణిత సూత్రాలను బట్టి పట్టి నేర్చుకోవడం కంటే భావన-ఆధారిత శిక్షణ చాలా ముఖ్యమని రామయ్య ఎప్పుడూ విశ్వసించేవారు. ఇదే అతని బోధనను నొక్కిచెప్పే సూత్రం గా క్రమంగా మారింది. త్వరలోనే, అతని విధానం సానుకూల ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. విద్యార్థుల సంఖ్య పూర్తిగా నోటి మాట ద్వారా ఖ్యాతి పెరగడం ప్రారంభమైంది. ఆ విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో రామయ్య చాలా ప్రఖ్యాతి పొందాడు. ఆరకంగా చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ ప్రవేశపరీక్ష పాస్ కావడం అంత సులభం కాదు. అందుకే ఆ ప్రవేశపరీక్షలో కూడా వ్యాపారం ఉందని గ్రహించిన ‘తెలివైన వాళ్లు’ ఆ పరీక్ష కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపించారు. ఐఐటి ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య ‘ఐఐటి రామయ్య’ గా ప్రసిద్ధి చెందారు.
ఎందుకంటే, వేలాది మంది విద్యార్థులకు ఐఐటీ పరీక్షను అందుబాటులోకి తెచ్చిన సాధారణ బడిపంతులు రామయ్య. లెక్కలు చెప్పిన సారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పిన రిటైర్ అయిన అసాధారణ వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధుడు, కొన్ని దశాబ్దాలనుంచి హైదరాబాద్ శంకర్ మఠ్ దగ్గరలో ఉన్న విద్యార్థులందరికీ ఐఐటి విద్యా భిక్ష ఇచ్చిన మనిషి. తెల్లవారుఝామున నుంచి సాయంత్రం దాకా వందలాది మందికి పాఠాలు చెబుతూ చెబుతూ, జీవనాన్నిసాగిస్తూ ప్రపంచమంతా ఐఐటి ఇంజనీర్లను వెద్ద జల్లిన వాడు. హైదరాబాద్ లో కొన్ని లక్షల మందికి గురువు. ప్రపంచలో ఆయన ఐఐటి శిష్యులు లేని దేశం ఉండదేమో.
IIT- JEE కి ఉండే తీవ్రమయిన పోటీ ఛేదించడానికి అనేక నేపథ్యాల విద్యార్థులకు సహాయం చేసి ఎంతోమంది విద్యార్థుల, తల్లిదండ్రుల కలలు సాకారం చేసిన చుక్కా రామయ్య గారికి హార్దిక శతాధిక (100) జన్మదిన శుభాకాంక్షలు అంటూ శ్రీమహ్మద్ గౌస్ పై చిత్రం గీశారు..
చుక్కాని రామయ్య
చదువులకు చుక్కాని అయిన చుక్కా రామయ్య 1925, నవంబర్ 20 న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో జన్మించారు. పోతన, పాల్కురికి సోమనాథుడు పుట్టిన తెలంగాణ, నాటి వరంగల్లు జిల్లా , తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంత రామయ్య. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. రామయ్యకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రామయ్య పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి మరణించారు. రామయ్య తనస్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివారు. డిగ్రీ, ఎం.ఎస్.సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసాడు.
బ్రాహ్మణులు వెలివేసినా..
నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు. ఉస్మానియా విద్యార్థి వర్గాల్లో వెల్లువెత్తుతున్న విప్లవాత్మక ఆలోచనలు అతని గ్రామంలో భూస్వామ్యం మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేరేపించాయి. ఇది తన సొంత బ్రాహ్మణ సంఘం నుండి తనను బహిష్కరించిందని రామయ్య తరువాత గుర్తుచేసుకున్నారు. ఆ దశలో జీవనం అంత కష్టంగా ఉంటుందో ఆలోచించవచ్చు. అయినా పట్టించుకోలేదు. ఉద్యమంలో పెరిగి, ఇప్పుడు కూడా ఉద్యమశీలిగానే మాట్లాడుతూ ఉంటారు.
స్వాతంత్య్రం కోసం
“పోరాటం ఎప్పుడూ రాజకీయం కాదు. ఇది సామాజిక స్వాతంత్య్రం తో పాటు ఆర్థిక స్వాతంత్య్రం కోసం పోరాటం. భూమి సాగుదారుకు చెందాలి. నేను ఉద్యమంలో పాల్గొన్నందున. ఆ నీతిని నమ్మినందున నేను ఔరంగాబాద్ సెంట్రల్ జైలులో పాలయ్యాను, ”అని వారు ఒక సందర్భంలో వివరించారు.
తెలంగాణ ఉనికిని నిరూపించిన ఉద్యమశీలుందరికీ గుర్తుంటుందని, ఒకే ఒక్క మాటలో వందేళ్ల రామయ్య చెప్పారు. ప్రొఫెసర్లు హరగోపాల్, శ్రీమతి వనమాల, ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి, మంత్రి పొన్నం ప్రభాకర్, వారి మిత్రులు, రామయ్యగారి కూతురు, కొడుకు లకు తన పోరాటాన్ని వివరించారు.
‘‘హరగోపాల్ మా అల్లుడు’’
‘‘మాకు పెళ్లి చేయించిన వారు రామయ్య గారు’’ అని వనమాల, హరగోపాల్ చెప్పారు. నన్ను గుర్తు బట్టినారా అని వనమాలి అడిగితే రామయ్య గారు ‘నువ్వు బిడ్డవే కద‘ అన్నారు. ‘నా పేరు చెప్పండి’ అంటే, ఎదురు చూడకుండానే, సమయం తీసుకోకుండానే వనమాల అని చెప్పగానే చప్పట్లు మోగింది. అవును హరగోపాల్ మా అల్లుడు అని చాలా సార్లు హరగోపాల్ గారు చెప్పేవారని వివరించారు.
ఉపాధ్యాయుని వృత్తిని మించినది లేదు
అధ్యాపక వృత్తిని మించిన శ్రేష్ఠమైన వృత్తి మరొకటి ఉండదని నిర్ణయించుకొని, తానూ అధ్యాపకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామయ్య పాఠశాలల్లో గణితం బోధించడం ప్రారంభించాడు. సుదీర్ఘమైన సంతృప్తికరమైన కెరీర్ తరువాత, అతను నాగార్జున సాగర్‌లో ప్రిన్సిపల్ గా పనిచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58 ఏళ్ళకు పదవీ విరమణ చేయవలసి ఉంది. కాని తనకు ఇంకా గడవు ఉండగనే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 1983లో ముందస్తు పదవీ విరమణ చేశాడు. దాంతో అతనికి ప్రభుత్వంచే ఆమోదించబడిన పింఛను, ఇతర ఫలాలు రాలేదు. దీనివలన జీవనభృతికి మార్గాలు చూసుకొనవలసి వచ్చింది.
బాసర సరస్వతీదేవికి అంకితం
నిర్మల్ జిల్లా, బాసర లోని సరస్వతి ఆలయానికి వెళ్ళి భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక వారం పాటు ఉన్నాడు. తిరిగి ప్రయివేటుగా ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాడు. పదవీ విరమణానంతరం సాధించిన తన విజయాలను అతని బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆపాదిస్తారు. భారత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐఐటిని మంజూరు చేసినపుడు చుక్కా రామయ్య దాన్ని బాసరలో స్థాపించాలని కోరి దానికై తీవ్ర ప్రయత్నం చేసాడు. అయితే వివిధ సౌకర్యాల రీత్యా ప్రభుత్వం దాన్ని హైదరాబాదులో నెలకొల్పింది.
శాసన మండలికి ఎన్నిక
రామయ్య 2007లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి తెలంగాణ శాసనమండలికి ఎన్నికై 6 ఏళ్లపాటు ఆ పదవిలో ఉన్నారు. అతను వివిధ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఎనమండుగురు స్వతంత్ర MLCల బృందానికి ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు.
వరంగల్లు పంతులు
మన మాధ్యమాలు, నీతి నియమాలు అనే అంశంమీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఆవరణలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసారు. జాతీయ నిపుణులు హైదరాబాద్ వచ్చి ప్రసంగించారు. (నల్సార్ పక్షాన ఈ రచయిత కూడా పాల్గొన్న సందర్భం). మాజీ వరంగల్ కలెక్టర్, ప్రధానమంత్రి సహాయ కార్యాలయంలో పనిచేసిన కె ఆర్ వేణుగోపాల్ గారు, ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు చుక్కా రామయ్య గారు ప్రధాన ప్రసంగాలు చేసారు. ‘‘చాలామంది మీడియా ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు. కాని వరంగల్లులో ఒకాయన ఉండేవారు. జనధర్మ అని పత్రిక నడిపేవారు యం యస్ ఆచార్య. వారి నడిగితే తెలుస్తుంది ఎథిక్స్ అంటే ఏమిటో..’’ అన్నారు. ప్రసంగం తరువాత సార్ నేను యం యస్ ఆచార్యగారి కుమారుడిని అని చెబితే ‘‘నువ్వు నల్సార్ అథ్యాపకుడివా...’’. అప్పడినుంచి వారిని కలిసి మాట్లాడుకోవడం, ఆయన 100 వ పుట్టిన రోజున (ఉస్మానియా యూనివర్సిటీ సమీపాన విద్యానగర్ లో) వారి ఆశీస్సులు స్వీకరించడం అలవాటు.
యం యస్ ఆచార్య స్మారక ప్రసంగం
ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి ఘాటయిన విమర్శలుచేసిన వారు రామయ్యగారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే విషయంలో మీడియా మౌనం వహించడం చాలా ప్రమాదకరమన్నారు. 16 డిసెంబర్ 2016 న కాకతీయ యూనివర్సిటీలో ఆచార్య స్మారక ప్రసంగంలో ‘‘పత్రికలు మార్కెట్ శక్తుల ఆధీనంలో ఉన్నాయని, ఆ శక్తుల నుంచి విముక్తి చెంది తెలంగాణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని’’ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య స్మారకోపన్యాసంలో ‘రోల్ ఆఫ్ ది ప్రెస్ ఇన్ తెలంగాణ డెవలప్‌మెంట్’ అనే అంశంపై రామయ్యగారు, ‘‘పత్రికలు మౌనంగా ఉన్నాయంటే ప్రజలు నోళ్లునొక్కేయడమేనన్నారు.
ఎం ఎస్ ఆచార్య జీవనంపై ఎమెస్కో ప్రచురించిన మాడభూషి శ్రీధర్ పుస్తకాన్ని వారి పుట్టిన రోజున రామయ్యగారికి సమర్పించారు
తెలంగాణలో ఇంకా కొన్ని పత్రికలు తెలంగాణ పట్ల పక్షపాతధోరణి చూపిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఆశలకు కార్యరూపం ఇచ్చేందుకు ఏర్పడిన ప్రభుత్వానికి మీడియా సహాయకారిగా వ్యవహరించాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు.
నీటి సమస్య పరిష్కార విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయని, కృష్ణ జలాల విషయంలో ఇప్పటికీ ఆంధ్రా పత్రికలు పక్షపాతంతో ఉన్నాయని అన్నారు. నాగార్జున సాగర్ కుడికాల్వకు నిండుకుండలా నీళ్లు ప్రవహిస్తున్నాయన్నారు. ఇప్పటికీ ఎడమకాలువ ఎండిపోయి ఉంటుందన్నారు. దీనిపై తెలంగాణ మీడియానే గొంతెత్తాలని ఆకాంక్షించారు. ప్రజాచైతన్యానికి దివంగత పాత్రికేయుడు ఎంఎస్ ఆచార్య ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జనధర్మ పత్రికను నడిపారన్నారు. ఆయన స్ఫూర్తితో జర్నలిస్టులు, పత్రికలు పనిచేయాలన్నారు.
... పత్రిక చిన్నదైనా అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాసినందుకు ఆచార్య కష్టాలపాలయ్యాడన్నారు. అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన త్యాగం, పట్టుదలతో వరంగల్ ప్రజల్లో జాతీయ భావాలు రంగరించారన్నారు. ఇవ్వాళ తమలో ఉన్న సామాజిక స్పృహకు కారణం ఆయన నుంచి పొందిన చైతన్యమే అన్నారు. తెలంగాణ పోరాటాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆచార్య వాటినుండి పొందిన నిలువెత్తు స్ఫూర్తికి నిలువుటద్దం అన్నారు. వరంగల్‌కు సంపద లేదు కానీ త్యాగాల నిధి ఉందన్నారు.
చదువుల తాత రచయిత
‘‘చదువుల తాత’’ చుక్కారామయ్య పుస్తకాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు. అక్కడ అప్పటి రాష్ట్ర విద్యాశాఖ, మంత్రి శ్రీమతి నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు, మిత్రుడు జూలూరి గౌరీశంకర్ వున్నారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ లోని సిఎం ఛాంబర్ లో జరిగింది. ఓ చిన్ని పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలనే అనగానే వెంటనే 'పట్టుకురండయ్యా ఆలస్యం ఎందుకు?' అంటూ ఉత్తేజపరచి, సమ్మతి తెలిపారు రాజశేఖర రెడ్డిగారు. రాజ్య లక్ష్మి గారు తొలిప్రతిని అందుకున్నారు. ఈ పుస్తకం కాపీలు లక్షన్నరకు పైగా అమ్ముడయ్యాయని గౌరీశంకర్ చెబితే విని ఆశ్చర్యపోయాననీ, బాలలు చదవి అర్థం చేసుకునే వీలుగా రాయడం జరిగిందనీ వారంతా చదవబట్టే ఈ పుస్తకం అమ్మకాలు ఆ స్థాయిలో జరిగాయనీ, ఈ పుస్తకం హిందీలో, ఇంగ్లీషు లో కూడా అనువదించానని, అప్పట్లో విద్యాశాఖమంత్రి గారి .. ఓ ఎస్ డీ గా వున్నానని ప్రముఖ జర్నలిస్టు ఎ రజాహుస్సేన్ వివరించారు.
రామయ్య తెలుగులో 16కి పైగా పుస్తకాలను రచించారు. 1) చిన్న పాఠం, 2) దేశదేశాల్లో విద్య, 3) బడిపంతుళ్ళకు రాజకీయాలా? 4) చదువుల తోవ, 5) చదువులో సగం 6) చిట్టి చేతులు (వ్యాస సంపుటి), 7) దర్యాప్తు, 8) ఈ మట్టి రుణం తీర్చుకుంటా, 9) నడక, 10) జ్ఞాన లోగిళ్ళు, 11) ఇంటి భాష (వ్యాస సంపుటి), 12) మరో పాఠం, 13) సకల, 14) లెక్కలతో నా ప్రయోగాలు, 15) మన చదువులు, 16) ప్రాథమికం 17) లాఠీ ఛార్జ్, 18) ప్రపంచీకరణ – విద్య 19) రామయ్య జ్ఞాపకాలు 20) సమత్వం ప్రతిభ, 21) సంక్షేమ విద్య 22) సంవాదం, 23) తరగతి. పిల్లలకు చదివించే నైపుణ్యం బడిపంతులకే తెలుస్తుంది అని పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. ఈనాటి వందేళ్ల చిరంజీవి, రామయ్య రచనలు వేయేళ్లు బతుకుతాయి.

