
సుందరంగా కూకట్‌పల్లి నల్లచెరువు
నాడు డంపింగ్ యార్డు...నేడు అందాల సరస్సు
కూకట్‌పల్లి నల్లచెరువుకు కొత్త అందాలు
హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రా తాజాగా మరో చెరువును సుందరంగా తీర్చిదిద్దింది. నిర్మాణ వ్యర్థాలు, చెత్త, చెదారంతో పాటు కబ్జాల పాలైన కూకట్ పల్లి నల్లచెరువు హైడ్రా తీసుకున్న చర్యలతో సుందరంగా మారింది.
కబ్జాల తొలగింపుతో పెరిగిన చెరువు విస్తీర్ణం
28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కూకట్ పల్లి నల్ల చెరువు కబ్జాలతో 16 ఎకరాలకు పరిమితమైంది.రెవెన్యూ రికార్డులు, చెరువు సమాచారంతో హైడ్రా నాలుగు నెలల క్రితం ఆక్రమణలను తొలగించింది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలు, పేరుకుపోయిన పూడికను హైడ్రా తొలగించింది. 4 మీటర్ల మేరకు చెరువలో మట్టిని తొలగించింది. దీంతో 16 ఎకరాల చెరువు కాస్తా ఆక్రమణల తొలగింపుతో 28 ఎకరాలకు పెరిగింది.

చినుకు పడితే చాలు...
చినుకు పడితే చాలు కూకట్ పల్లి నల్ల చెరువు చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలు జలమయం అయ్యేవి. వర్షపునీరు వెళ్లే దారి లేక కాలనీ జలమయం అయ్యేది. దీంతో చెరువులోకి వరదనీరు చేరేలా 7ఇన్ లెట్లు, ఔట్ లెట్లను అభివృద్ధి చేశారు. చెరువులో మురుగునీరు కలవకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించారు.కనుమరుగవుతున్న చెరువును పునరుద్ధరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు చేరింది. దీంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది.
బోటుషికారు
కూకట్ పల్లి నల్ల చెరువులో బోటు షికారు ఏర్పాటు చేశారు. భూగర్భ జలాలు పెరిగాయి. చెరువు నలుమూలల ఉన్న బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీటరున్నర పాత్ వే అందుబాటులోకి వచ్చింది. రోజూ 600ల మంది వరకూ వచ్చి వాకింగ్ చేస్తున్నారు. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది.చిన్నపాటి వేడుకలకు కూడా ఇక్కడ కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

చెరువులను పునరుద్ధరిస్తున్నాం: ఏవీ రంగనాథ్
మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల్లో అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట, కూకట్ పల్లి నల్లచెరువు దాదాపు సిద్ధమయ్యాయి.మరి కొన్ని రోజుల్లో మిగతా భమృక్ను ద్దౌలా చెరువు, ఉప్పల్ నల్లచెరువు, తమ్మిడికుంట, సున్నం చెరువులను కూడా పునరుద్ధరించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. చెప్పారు. తర్వాత మరో 13 చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు.వర్షాకాలంలో వరద నివారణకు.. ఎండా కాలం నీటి కష్టాలకు చెక్ పెట్టడానికి చెరువులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చూపిన మార్గంలోనే మనం ప్రయాణిస్తున్నాం. వందేళ్ల క్రితం వరదల నివారణకు రెండు అతి పెద్ద జలాశయాల (ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్)ను నిర్మించి దిశానిర్దేశం చేశారు. ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నాం. ఫ్లడ్ ఫ్రీ సిటీగా దేశంలో ఆదర్శంగా మన నగరం మారనుంది’’ అని రంగనాథ్ వివరించారు.
Next Story