‘సీఎం కాగానే కేసీఆర్ పాలనపై విచారణ జరిపిస్తా’
x

‘సీఎం కాగానే కేసీఆర్ పాలనపై విచారణ జరిపిస్తా’

పార్టీ నుంచి వెళ్లగొట్టినా ఇంకా కొందరి కళ్ల చల్లబడలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత.


దేవుడు దయ వల్ల తాను సీఎం అయితే.. 2014 నుంచి అంటే కేసీఆర్ పాలనలో జరిగిన పాలనపై దర్యాప్తు జరిపిస్తానంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవత ప్రకటించారు. ఆమె చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కవిత టార్గెట్ రాడార్‌లోకి కేసీఆర్ కూడా చేరారా? అన్న చర్చ మొదలైంది. తనపై, తన భర్తపై కొందరు, ఒక టీవీ ఛానెల్ ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా అవకతవకలు జరిగాయని, అవన్నీ తనకు తెలుస్తున్నాయని అన్నారు. అన్ని విషయాల్లో నిజాలను బయటకు తీస్తానని అన్నారు. తాను ఎవరికీ భయపడే రకాన్ని కాదని వ్యాఖ్యానించారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సీఎం అవుతా..

‘‘బీఆర్ఎస్ పాలనతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీకి, నిజామాబాద్‌కే పరిమితం అయ్యాను. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నా సరే.. నా బాధ్యతలను నిర్వర్తించా. కానీ చాలా దారుణాలు జరిగాయని జనం బాట కార్యక్రమంలో తెలుస్తోంది. బాధితులు చెప్తున్నా అన్నీ అవగతం అవుతున్నాయి. దేవుడి దయ బాగుంటే నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా.. అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని అన్యాయాలను వెలికితీస్తా’’ అని కవిత అన్నారు.

పార్టీ నుంచి వెళ్లగొట్టారుగా..

ఈ సందర్భంగానే ఆమెపై ఇంకా కొందరు తీవ్ర ఆరోపణలు చేస్తుండటాన్ని కవిత ఖండించారు. ఇంకా తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే.. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానని అన్నారు. పార్టీ నుంచి తనను వెళ్లగొట్టారని, అయినా ఇంకా కళ్లు చట్టబడలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు కవిత. హిల్ట్ పాలసీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కిటికీలు తెరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దర్వాజాలు తెరిచిందని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ చేయలేదని కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అవినీతిని ఎత్తిచూపుతూ రేవంత్ రెడ్డి సీటు సంపాదించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి విచారణలు ప్రారంభించకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్ అవినీతిలో కాంగ్రెస్‌కూ సంబంధాలు ఉన్నందునే ప్రభుత్వం మౌనం పాటిస్తోందని కవిత ఆరోపించారు. “ఇలా ఉండగా నన్నేమిటి తొందరపెడుతున్నారు?” అంటూ తనను టార్గెట్ చేస్తున్న వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

Read More
Next Story