జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్దమేనా?
x

జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్దమేనా?

సంఖ్యాబలం ఉంది కాబట్టి NDA ప్రభుత్వం తన ప్రతిపాదనకు చట్టరూపం ఇవ్వటానికి మాజీ రాష్ట్ర పతి అధ్యక్షతన ఓ కమిటీ నియమించి ఓ నివేదిక వండించింది: కొండూరి వీరయ్య


-కొండూరి వీరయ్య


ఐదేళ్ల పాలనలో ఒక్కసారిగా అఖిల పక్షం ఏర్పాటుకు సిద్ధం కాని ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి గద్దెనెక్కి నెలరోజులు తిరక్కుండానే అఖిలపక్షం సమావేశం పిలిచారు. అభివృద్ధిపథంలో అందరినీ కలుపుకుపోవాలని ప్రభుత్వ లక్ష్యానికి కట్టుబడి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కాషాయ కలాలు రాసేసాయి. కానీ ఈ సమావేశంలో పెట్టన ఎజెండాలో ఏ ఒక్కటీ జాతీయాభివృద్ధిని ఉద్దేశించిన ఎజెండా లేదు. మొట్టమొదటి అంశంగా జమిలి ఎన్నికలు ఎజెండాలోకి వచ్చింది. ఇప్పుడున్న ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపటం వల్ల వచ్చే నిర్దిష్ట ప్రయోజనాలేమిటో అటు ప్రభుత్వం కానీ ఇటు ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్న వారు కానీ చెప్పలేకపోతున్నారు. అయినా సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రభుత్వం తన ప్రతిపాదనకు చట్టరూపం ఇవ్వటానికి వీలుగా మాజీ రాష్ట్ర పతి అధ్యక్షతన ఓ కమిటీ నియమించి ఆ కమిటీ ద్వారా ఓ నివేదిక వండించారు.
మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత వంద రోజుల ఉత్సవాలు చేసుకుంటున్న మోడీ కిచెన్ కాబినెట్ రామనాథ కొవిద్ ఇచ్చిన సిఫార్సులను అంగీకరిస్తూ తీర్మానం ఆమోదించింది.
ఇప్పటి వరకు దేశంలో 1967 వరకు జమిలి ఎన్నికలు జరిగాయి. 1952 నుండీ 1967 వరకు చట్టసభల నిర్ణీత గడువు పూర్తి అయ్యాకనే ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 1967 వరకు జరిగిన ఎన్నికల్లో లోక్సభతో పాటు మెజారిటీ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఈ క్రమానికి 1970 దశకం వచ్చే సరికి అంతరాయం కలిగింది. దీనికి ప్రధాన కారణం 1970 దశకంలోనే జాతీయ రాజకీయాలపై కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం బద్దలు కావటం వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు అధికారంలోకి రావటం దీనికి ప్రధాన కారణం. ఆ విధంగా ప్రజామోదంతో అధికారానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా రద్దుచ చేయటంతో శాసనసభల కాలపరిమితి అర్థాంతరంగా ముగియటంతో ఎన్నికలు అనివార్యం అవుతూ వచ్చాయి. 1990 దశకంలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా తెరమీదకు రావటంతో మళ్లీ జమిలి ఎన్నికల గురంచిన చర్చ మొదలైంది.
2014, 2019 ఎన్నికల్లో బిజెపి కేవలం నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని, గుణగణాలను మీడియా హైప్‌తో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. దీంతో ఈ ఎన్నికలు విధానాలపై పోరాటంగా కాక వ్యక్తుల మధ్య పోరాటంగా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఎంతో కొంత విధానపరమైన ప్రత్యామ్నాయాల దిశగా ఎజెండా ముందుకొస్తుంటే భారతదేశంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో విధానపరమైన విషయాలు మరుగున పడ్డాయి. మోడీ ప్రజాకర్షక సామర్ధ్యం ఆధారంగా లోక్సభ ఎన్నికల్లో గెలిచిన బిజెపి సహజంగానే జమిలి ఎన్నికలు జరిగితే అదనపు ప్రయోజనం పొందవచ్చని ఆశిస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఓట్ల శాతం దీనికి తక్షణ స్పూర్తిగా ఉంటే ఉండవచ్చు. ప్రస్తుతానికి ప్రతిపక్షాలు 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఎన్డీయే 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ప్రతిపక్షాల పాలనలో ఉన్న మరో నాలుగు రాష్ట్రాల్లో ` మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, డిల్లీ, కర్ణాటక ` ఈ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సీట్లు సంపాదించింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు జమిలి ఎన్నికలు రాజకీయ పార్టీల అధికార దాహాన్ని తీర్చటానికి ఉపకరిస్తాయే తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం కాదు.
ఈ జమిలి ఎన్నికలు ఎజెండాలో భాగంగా జొప్పించిన మరో ముఖ్యమైన ఎజెండా ఉంది. అది ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎలాగైనా ఐదేళ్లు అధికారంలో కొనసాగేందుకు వీలుగా చట్ట సవరణలు చేయాలంటూ కేంద్ర న్యాయ సంఘం ఇచ్చిన సిఫార్సు. ఏ కారణాల వల్లనైనా ప్రభుత్వం ఐదేళ్లలోపే చట్టసభల్లో సంఖ్యాబలం కోల్పోతే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందాలన్న సూత్రానికి బదులుగా న్యాయ సంఘం అదే లోక్సభలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది.దీనికి గాను అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర న్యాయ సంఘం ప్రతిపాదించింది. 1989 నుండీ సంకీర్ణ ప్రభుత్వాలు అర్థాంతరంగా సంఖ్యాబలం కోల్పోయినప్పడు ప్రజల ముందుకు వచ్చాయి. దీనికి భిన్నంగా న్యాయ సంఘం సిఫార్సు గెలిచిన అభ్యర్థులు, పార్టీలు ఐదేళ్ల పాటూ సీటుకు అతుక్కుని కూర్చోవటాన్ని చట్టబద్ధం చేయటమే కాక ప్రత్యామ్నాయ ప్రభుత్వం పేరుతో పెద్దఎత్తున ఫిరాయింపులకు అవకాశం ఇస్తుంది. ఈ సిఫార్సు ప్రజా ప్రాతినిధ్యాన్ని అపహాస్యం చేస్తోంది.
సమాఖ్య స్వభావం రాజ్యాంగపు మౌలిక లక్షణమని సుప్రీం కోర్టు పదే పదే హెచ్చరించింది. సమాఖ్య స్వభావానికి అద్దం పట్టేదే రాజ్యాంగంలోని ‘భారతదేశం, రాష్ట్రాల సమాఖ్య’ అన్న వాక్యం. చట్టసభలకు ఐదేళ్ల పదవీకాలం అన్నది కూడా రాజ్యాంగంలోని 83(2), 170(1) అధికరణాల్లో స్పష్టంగా ప్రస్తావించబడి ఉంది. కేంద్ర న్యాయ సంఘం ఇచ్చిన సిఫార్సును ఆమోదించాలన్నా మోడీ ముచ్చట తీర్చాలన్నా రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రాతినిధ్య ప్రభుత్వాలు ఎన్నుకోవాలని ఆదేశిస్తోందే తప్ప సదరు ప్రభుత్వాలను ఐదేళ్లల్లో ఒకే సారి ఎన్నుకోవాలని ఆదేశించటం లేదు. అంతేకాదు. రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయ ప్రాధాన్యతలు, ప్రజల ఇష్టాయిష్టాలు చర్చకు వస్తాయి. రాష్ట్రాభివృద్ధికి కావల్సిన ఎజెండాపై పార్టీలు ప్రజల మన్ననలు పొందాల్సి ఉంటుంది. దీని స్థానంలో జమిలి ఎన్నికల వల్ల ఆయా రాష్ట్ర ప్రత్యేక సమస్యలు మరుగునపడే ప్రమాదం ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీల హవా పెరగటానికి ఈ జమిలి ఎన్నికలు ఏ సాధనంగా పనికొస్తాయి. దాంతో అనివార్యంగా జాతీయ సమస్యలు ` బాలకోట్‌, పుల్వామా, రామమందిరం వంటి ` జాతీయ ఎజండాగా ముందుకొస్తాయి. ఈ క్రమం అంతిమంగా మనువాద హిందూత్వవాదాన్ని విస్తరింపచేయటానికి మతోన్మాద శక్తులకు రంగాన్ని సిద్ధం చేసే పనిముట్టుగా మారుతుంది.
పరిపాలన సామర్ధ్యాన్ని, సౌలభ్యాన్ని పెంపొందించవచ్చన్న మరో భ్రాంతిని ఈ సందర్భంగా ముందుకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పరిపాలన పరమైన వైఫల్యాలకు కారకులైన పాలక పార్టీలు ఈ దెబ్బతో తమ బాధ్యతను వదిలించుకునే మార్గమే జమిలి ఎన్నికలు. సామర్ధ్యం పెంపు కోసం జమిలి ఎన్నికలు అన్న నినాదంలోనే ఇప్పటి వరకు ప్రజలు సామర్ధ్యం లేని పార్టీలను, ప్రజా ప్రతినిధులను చట్టసభలకు పంపుతూ వచ్చారన్న అవగాహన ఇమిడి ఉంది. ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించటం దాన్ని బాగుచేసే పేరుతో సంస్కరణల భారాన్ని ప్రజలపై మోపటం పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. అదే తరహాలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వాటిని పునురుజ్జీవింపచేసే ప్రయత్నం పేరుతో ఏకంగా పాతాళానికి తొక్కేసేందుకు కావల్సిన రాజకీయ సంస్కరణలు ముందుకు తేవటం కూడా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ నీడన బతుకుతున్న బూర్జువా పార్టీల లక్షణం, అవసరం.
ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత కాదనుకున్నా ప్రజలకు కొన్ని హక్కులు మిగిల్చింంది. కీలకమైన నిర్ణయాల్లో ప్రజల భాగాస్వామ్యానికి ఎన్ని పరిమితులతోనైనా అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి హక్కులు, అవకాశాలు కాలదన్నటమే బిజెపి ప్రభుత్వం ముందుకు తెచ్చిన జమిలి ఎన్నికల లక్ష్యం. ఈ జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కావాలంటే రాజ్యాంగపు మౌలిక చట్రాన్ని మార్చేయాలి. లౌకిక తత్వం కూడా ` ఎన్ని పరిమితులతో అమలు జరిగినా ` ఈ మౌలిక చట్రంలో మరో కోణం. ఈ ప్రక్రియకు పూనుకునేందుకు బిజెపి దొడ్డిదారిన ముందుకు తెస్తున్న ఎజెండా జమిలి ఎన్నికలు. ఈ కీలకమైన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రజా చైతన్యం పెంపొందించటం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ దిశగా ఉద్యమింపచేయటం ప్రజాతంత్ర శక్తుల కర్తవ్యం.

(కొండూరి వీరయ్య, అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్)



(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of the views of The Federal)





Read More
Next Story