ఎపుడూ ఈ ముగ్గురేనా, బిఆర్ ఎస్ సిలబస్ మారదా?
ఎటుచూసినా కేసీయార్, కేటీయార్, హరీష్ రావు తప్ప నాలుగోనేత కనబడటం లేదు. అసెంబ్లీ ఎదురు దెబ్బతర్వాత కూడా చాప్టర్ మారడం లేదు...
పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు ప్రతిపక్ష బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రేవంత్ కాకుండా మొత్తం 17 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. తొందరలోనే ప్రియాంకగాంధి, రాహుల్, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు రాబోతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత జాతీయ నేతలు తెలంగాణాలో పర్యటించబోతున్నారు. ఇక బీజేపీ విషయం చూస్తే అభ్యర్ధుల నామినేషన్లకు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శలు హాజరవుతున్నారు. నామినేషన్లు అయిపోయిన తర్వాత నరేంద్రమోడి, అమిత్ షా కూడా తెలంగాణాలో పర్యటించబోతున్నారు.
రెండుపార్టీల వ్యవహారం ఇలాగుంటే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్ధితి ఏమిటన్నదే అర్ధంకావటంలేదు. పార్టీలో ఎటుచూసినా కేసీయార్, కేటీయార్, హరీష్ రావు తప్ప నాలుగోనేత కనబడటంలేదు. అధికారంలో ఉన్న పదేళ్ళూ వీళ్ళ ముగ్గురే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురేనా ? వీళ్ళ ముగ్గురు తిరిగితే తిరిగినట్లు లేకపోతే అభ్యర్ధుల సంగతి గోవిందాయేనా ? ఈనెల 23వ తేదీనుండి వచ్చేనెల 10వ తేదీవరకు కేసీయార్ బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగులు పెట్టుకున్నారు. మధ్యమధ్యలో జనాలతో నేరుగా మాట్లాడబోతున్నారు. ప్రజలను కేసీయార్ కలవటం అధికారంలో ఉన్నపుడు చాలా అరుదుగా జరిగేది. ప్రభుత్వంలో అయినా పార్టీలో అయినా కేసీయార్ తరపున మొత్తం వ్యవహారాలను కేటీయార్, హరీషే చక్కబెట్టేవారన్న విషయం అందరికీ తెలిసిందే.
అధికారంలో ఉన్నపుడు కనబడలేదు
అధికారంలో ఉన్నారు కాబట్టి పార్టీలో సమస్యలు బయటపడలేదు. అధికారంలో ఉన్నపుడు లోపాలు ఎన్నున్నా కొట్టుకుపోయాయి. అయితే మొన్నటి అసెంబ్లీఎన్నికల్లో పార్టీ ఓడిపోవటంతో ఒక్కొక్కటిగా లోపాలన్నీ బయటపడుతున్నాయి. పార్టీ ఓడిపోగానే అప్పటివరకు అధికారం అనుభవించిన వారిలో చాలామంది పార్టీని వదిలేసి కాంగ్రెస్ లోకి లేకపోతే బీజేపీలో చేరిపోయారు. దాంతో ఇపుడు పార్టీని నడిపించే భారమంతా వీళ్ళ ముగ్గురిపైనే పడింది. ప్రాంతీయపార్టీలంటేనే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల్లాంటివని అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలతో వారాల తరబడి మాట్లాడేవారు కాదు. వాళ్ళ సమస్యలన్నింటినీ కేటీయార్, హరీష్ తో చెప్పుకునే వాళ్ళు.
అధికారం కోల్పోగానే నేతల్లో చాలామంది పార్టీని వదిలేయటంతో ఇపుడు భారం మొత్తాన్ని వీళ్ళముగ్గురే మోయాల్సొస్తోంది. దీనికి కారణం ఏమిటంటే ప్రైవేటు లిమిటెడ్ లాంటి పార్టీలో నాలుగో నేతను ఎదగనీయకుండా చేయటమే. కుటుంబసభ్యులు కాకుండా బయటవ్యక్తి గనుక ఎదిగితే ఎక్కడ ఏకుమేకై కూర్చుంటారో అన్న భయమే కేసీయార్ ను వెంటాడింది. ఫలితంగా అధికారంలో ఉన్నంతకాలం ఎక్కడచూసినా కేసీయార్, కేటీయార్, కవిత, హరీషే కనబడేవాళ్ళు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత అరెస్టయి జైలులో ఉండటంతో ఇపుడు ఎన్నికల భారమంతా వీళ్ళమేదే పడింది. అధికారంలో ఉన్నపుడైనా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురే రాష్ట్రంలో తిరుగుతున్నారు. అధికారం కోల్పోయిన రెండోరోజే ప్రమాదం జరిగి తుంటిఎముక విరగటం కేసీయార్ కు పెద్ద సమస్యగా మారింది. డాక్టర్లు చెప్పినట్లు రెస్ట్ తీసుకుని ఇపుడిప్పుడే బయట తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో స్పీడుగా తిరగలేకపోవటానికి ఇదికూడా అడ్డకింగా మారింది. అయినా వేరేదారి లేదుకాబట్టి పర్యటనలు పెట్టుకున్నారు.
బయటవాళ్ళని ఎదగనీయలేదా ?
అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాల్సొస్తుందని, సమస్య మొదలైతే ఎదురు తిరుగుతున్నారన్న భయంతోనే బయటనేతలను అధికారానికి దూరంగా ఉంచారు. దాని కారణంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎన్నికలప్రచారంలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఎంతటి నేతైనా కేవలం తన అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోతున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో మంత్రిగా గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి పనిచేశారు. ఇపుడు ఆయన కేవలం తన నియోజకవర్గాన్ని దాటి బయటకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన చెబితే లోకల్ నేతలెవరు మాట వినటంలేదు. అలాగే ఇతర నియోజకవర్గాల్లో జనాలను ప్రభావితం చేసేంత సీన్ లేదు. అందుకనే హైదరాబాద్ మొదలు రాష్ట్రం చివరలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు కూడా కేసీయార్, కేటీయార్, హరీష్ రావే పరిగెత్తుకెళ్ళిల్సొస్తోంది. వీళ్ళులేకపోతే అక్కడ అభ్యర్ధి తరపున ప్రచారం చేసే వాళ్ళే లేరు. ఇపుడు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్ధితి ఇలాగే తయారైంది. అందుకనే ఒకచోట కేసీయార్ ప్రచారం చేస్తుంటే ఇతర ప్రాంతాల్లో కేసీయార్ తరపున కేటీయార్, హరీష్ ప్రచారం చేస్తున్నారు. కేసీయార్ ఒంటెత్తుపోకడల కారణంగా ఇటు ఎన్డీయే అటు ఇండియా కూటమి కూడా దూరంగా ఉండిపోయాయి. కాబట్టి బీఆర్ఎస్ తరపున జాతీయపార్టీల నేతలు కూడా రావటంలేదు. పార్లమెంటు ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్యగా మారటంతో తలకుమించిన భారాన్ని ముగ్గురు మోయాల్సొస్తోంది. చివరకు ఫలితం ఎలాగుంటుందో చూడాలి.