ఆపరేషన్ హరీష్ రావు
x
Kavitha and Harish Rao, KTR

ఆపరేషన్ హరీష్ రావు

బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో హరీష్ రావుపై విరుచుకుపడ్డారు


బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. ఆపరేషన్ హరీష్ రావు(Harish Rao) అన్న పద్దతిలో పార్టీలోని కీలకనేతపై కవిత(Kavitha) డైరెక్టుగా చాలా ఆరోపణలు చేశారు. ముందు తనను పార్టీలో నుండి బయటకు పంపేసిన హరీష్, సంతోష్ ముఠా తర్వాత రామన్న(KTR)ను పంపేసి(పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్), ఆ తర్వాత కేసీఆర్ నుండి పార్టీని హస్తగతంచేసుకునే కుట్రలు చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. ఈరోజు కవిత మీడియా సమావేశం నిర్వహించింది హరీష్ మీద ఆరోపణలు గుప్పించేందుకే అన్నట్లుగా ఉంది. దాదాపు 40 నిముషాలు మీడియాతో మాట్లాడిన కవిత సుమారు అర్ధగంటపాటు హరీష్ కు వ్యతిరేకంగానే మాట్లాడారు. హరీష్ మీద కవితకు ఎప్పటినుండి ఆగ్రహం పేరుకుని పోయిందో తెలీదుకాని ఈరోజు మీడియా సమావేశంలో బయటకు కక్కేశారు. కుటుంబంలో చాలా జరుగుతున్నాయి కాని అవి ప్రజలకు సంబంధంలేదు కాబట్టి చెప్పటంలేదన్నారు.

హరీష్, సంతోష్ నుండి జాగ్రత్త అంటు కేసీఆర్, కేటీఆర్ కు వార్నింగులిచ్చారు. హరీష్ అటు బీజేపీతో పాటు ఇటు రేవంత్ రెడ్డితో కూడా లోపాయికారి సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపించారు. పార్టీకి జరుగుతున్న నష్టం తనవల్ల కాదని స్పష్టంచేశారు. హరీష్, సంతోష్ వల్ల జరుగుతున్న నష్టాన్ని కళ్ళు తెరిచి చూడాలని కేసీఆర్, కేటీఆర్ కు హితవుపలికారు. హరీష్, సంతోష్ మేకవన్నె పులుల్లాంటి వాళ్ళని గుర్తించాలని కేసీఆర్ కు విజ్ఞప్తిచేశారు. కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పిన వాళ్ళే ముఖ్యులుగా చెల్లుబాటు అవుతున్నట్లు ఆవేధన వ్యక్తంచేశారు. కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది, సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రయత్నించింది కూడా హరీషే అని మండిపడ్డారు.

కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ విపరీతంగా డబ్బు సంపాదించినట్లు కవిత ఆరోపించారు. ఆ డబ్బుతోనే 2018 ఎన్నికల్లో 25 మంది ఎంఎల్ఏలకు పార్టీతో సంబంధంలేకుండా హరీష్ ఫండింగ్ చేశారని మండిపడ్డారు. పార్టీ బాగుపడాలంటే హరీష్ ను దూరంగా ఉంచాలని కవిత హెచ్చరించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటానికే హరీష్ కుట్రలు చేసి తనను పార్టీనుండి బయటకు పంపినట్లు మండిపడ్డారు. మొత్తానికి హరీష్ మీద కవిత ఒకటికాదు చాలా బాంబులు పేల్చారు. వీటికి హరీష్ ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాలి. హరీష్ ను ఎక్కువగా టార్గెట్ చేసిన కవిత రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ ను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సంతోష్ గురించి మాట్లాడేంత సీన్ తనకు లేదన్నారు.

తనపైన ఆరోపణలు రాగానే తన వెర్షన్ వినకుండా సస్పెండ్ చేయటమే తనను బాధించిందన్నారు. తన కుటుంబానికి కూడా చాలారోజులుగా దూరంగా ఉంటున్నట్లు ఆవేధన వ్యక్తంచేశారు. తన తల్లితో కూడా మాట్లాడలేకపోతున్నట్లు కవిత బాధతో చెప్పారు. ఇలాంటి పరిస్ధితి ఏ ఆడబిడ్డకు రాకూడదన్నారు. తల్లికి దూరంగా ఉండటం ఎంత బాధాకరమో తనకు తెలుసన్నారు. తన భవిష్యత్ కార్యాచరణను తొందరలోనే ప్రకటిస్తానన్నారు. తాను ఏ పార్టీలో చేరటంలేదని స్పష్టంగా ప్రకటించారు.

Read More
Next Story