హైదరాబాద్‌లో ఇక ఆపరేషన్ ‘హైడ్రా’, ఎందుకంటే...
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా పేరిట కొత్త కమిషనరేట్ కు శ్రీకారం చుట్టనుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని హైదరాబాద్ రాజధాని నగరంలో సర్కారు భూముల కాపాడేందుకు హైడ్రాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
- హైడ్రా కమిషనరుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ను సీఎం ప్రత్యేకంగా నియమించి చెరువు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక దృష్టి సారించారు.
- హైదరాబాద్ నగరంతోపాటు నగర శివారుప్రాంతాల్లోని వందలాది చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలు, వక్ఫ్, దేవాదాయ, ఇనాం భూములను కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి హైడ్రా అధికారులు పరిరక్షించనున్నారు.
- నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న వందలాది చెరువు శిఖం భూములు కబ్జాల పాలైన నేపథ్యంలో వీటి వివరాలతో చెరువుల వారీగా ప్రత్యేకంగా ఒక్కో ఫైలు రూపొందించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు.దీనిలో భాగంగా హైడ్రా అధికారులు నీటి పారుదల శాఖాధికారులతో ఇప్పటికే సమావేశమయ్యారు.
- రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో గుర్తించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. కబ్జాలను తొలగించే పని ఇప్పటి వరకు సజావుగా సాగలేదని హైడ్రా వస్తే అది జరగవచ్చని సీనియర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇప్పటికే కబ్జాల పాలైన భూములకు కబ్జాదారుల నుంచి డబ్డు వసూలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని దేవేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైడ్రా ఏర్పాటు గురించి అధికారికంగా జీవో వస్తేనే దీని పనితీరు ఎలా ఉంటుంది అనేది చెప్పవచ్చని, అప్పటి దాకా దీనిపై తాను అధ్యయనం చేస్తామని చెరువుల పరిరక్షణ యాక్టివిస్టు డాక్టర్ లూబ్నా సర్వత్ చెప్పారు.
హైడ్రా అంటే ఏమిటంటే...
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ . జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ, చెరువు, వక్ఫ్, దేవాదాయశాఖ, పార్కులు, ఇనాం భూములు కబ్జాదారుల చెరలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా చెరువులు, నాలాల భూముల కబ్జాల పాలవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కబ్జాదారుల బారి నుంచి సర్కారు భూములకు విముక్తి కల్పించడంతోపాటు ఇకముందు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం కోసం హైడ్రాను కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.
హైడ్రా పరిధి ఎంతంటే...
జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల కిలోమీటర్లపరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని సీఎం ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో చెప్పారు. పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు.ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలతో సర్వే
హైదరాబాద్ నగరంలో శాటిలైట్ ఉప గ్రహ ఛాయాచిత్రాలతో ప్రభుత్వ రికార్డులను ఆధారంగా చేసుకొని హైడ్రా అధికారులు నీటిపారుదల, రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారుల తో కలిసి సర్వే చేసి ఆక్రమిత భూముల చిట్టాను వెలికితీయనున్నారు. దీనిలో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా అధికారులు పకడ్బందీ కార్యాచరణను ప్రారంభించారు.
కబ్జాదారుల చెరలోనే పార్కు స్థలాలు
నగరంతోపాటు నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో 4,800 పార్కులున్నాయని అధికారుల అంచనా. కాగా ఇప్పటికే 600 పార్కు స్థలాలు అంతర్ధానం అయ్యాయి. మరికొన్ని పార్కులు ఆనవాళ్లు కనిపించడం లేదు. కొందరు బడా రియల్టర్లు, పెద్దల చెరలో ఉన్న పార్కు స్థలాలకు విముక్తి కల్పించాలని హైడ్రా నిర్ణయించింది.
చెరువుల్లో గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం
కొందరు ఘరానా రియల్టర్లు చెరువు ఎఫ్ టీఎల్ ప్రాంతాలను ఆక్రమించి వాటిలోనే గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించారని హైడ్రా అధికారులకు సమాచారం అందింది. హైడ్రా ఏర్పాటు తుది దశకు రాగానే దీనిలో 2వేల మంది వివిధ శాఖలకు చెందిన అధికారులను నియమించాలని నిర్ణయించారు.
నగర విస్తరణకు అనుగుణంగా సేవలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరం విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా వ్యవస్థాగత నిర్మాణం,విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ప్రభుత్వ శాఖల సమన్వయంతో...
జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని మరింత సమర్థంగా హైడ్రా పని చేసేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.ఇప్పుడున్న ఎన్ ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని అందుకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారు.
హైడ్రా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోలీసుస్టేషన్
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై సత్వర చర్యలు తీసుకునేందుకు వీలుగా హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేకంగా ఓ పోలీసుస్టేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైడ్రాలో టౌన్ ప్లానిం్, రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్ విభాగాల పోలీసులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.
సిటీ కార్పొరేషన్
హైదరాబాద్ నగరంగా పెరుగుతున్న భౌగోళిక విస్తీర్ణంతో విపత్తు నిర్వహణ శాఖ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు పెంచాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సేవలను జీహెచ్‌ఎంసీ, 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలకు విస్తరించేందుకు అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
వర్షపునీరు నిలిచిన ప్రాంతాలపై హైడ్రా దృష్టి
ఆక్రమణలను తొలగించడమే కాకుండా భారీ వర్షాలు కురిసినపుడు వర్షపునీరు నిలిచిన రోడ్లను గుర్తించి , భవిష్యత్ లో అక్కడ నీరు నిలువ కుండా హైడ్రా చర్యలు తీసుకోనుంది. దీనిలో భాగంగా ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీవర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించి వర్షపు నీరు నిలువడానికి కారణాలను జీహెచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆపరేషన్ ఎన్ క్రోచ్ మెంట్ రిమూవల్
హైడ్రాను పూర్తి స్థాయిలో ఏర్పాటు కాగానే నగరంలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక ఆపరేషన్ చేపడతామని హైడ్రా కమిషనర్ ఏ వీ రంగనాథ్ ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో ఉన్న లోటస్ పాండ్ సరస్సు స్థలాన్ని చదును చేసి నిర్మాణాలు చేపట్టేందుకు ఓ బడా రియల్టర్ సమాయత్తం కాగా సమాచారం అందిన వెంటనే హైడ్రా అధికారులు పోలీసుబలగాలతో వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ముందు చెరువు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది.
Next Story