ఆపరేషన్ ఓల్డ్ సిటి ?
x
Central minister Bandi Sanjay

ఆపరేషన్ ఓల్డ్ సిటి ?

ఇప్పటికిప్పుడు సాధ్యంకాదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి ఓల్డ్ సిటి అన్నది దశాబ్దాలుగా కంచుకోటన్న విషయం అందరికీ తెలిసిందే.


కేంద్రమంత్రి బండి సంజయ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఏమినంటే ఓల్డ్ సిటీలో ఎంఐఎంను ఆనవాళ్ళు లేకుండా చేస్తామని. నిజంగా బండి చెప్పినట్లు సాధ్యమేనా ? ఇప్పటికిప్పుడు సాధ్యంకాదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి ఓల్డ్ సిటి అన్నది దశాబ్దాలుగా కంచుకోటన్న విషయం అందరికీ తెలిసిందే. ఓల్డ్ సిటిలోని హైదరాబాద్ పార్లమెంటుసీటులో ఏడుఅసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీదే ఆధిపత్యం. ఆ పార్టీ ఇంకేదైనా పార్టీతో పొత్తుంటే ఏదైనా ఒక సీటును వదిలేస్తుంది. లేకపోతే ఏడు అసెంబ్లీ సీట్లలోను మజ్లిస్ పార్టీనే పోటీచేస్తుంది. పోటీచేయటమే కాకుండా గెలుస్తోంది కూడా.

ఇతర పార్టీలతో పొత్తులో గోషామహల్ ను మాత్రం వదిలేస్తుంటుంది. ఇలాంటి సీటులో 2014లో మొదటిసారి బీజేపీ అభ్యర్ధిగా టీ. రాజాసింగ్ గెలిచారు. అప్పటినుండి వరసుగా మూడుఎన్నికల్లో రాజాసింగ్ గెలుస్తునే ఉన్నారు. అంతకుముందు అంటే 2009లో కాంగ్రెస్ నుండి ముఖేష్ గౌడ్ గెలిచారు. హైదరాబాద్ పార్లమెంటు ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ గడచిన ఐదు ఎన్నికల్లో గెలుస్తునే ఉన్నారు. పార్లమెంటు పరిధిలో మలక్ పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, ఛాంద్రాయణగుట్ట, యాకత్ పుర, బహదూర్ పుర నియోజకవర్గాలున్నాయి. వీటిలో గోషామహల్ మాత్రమే ఎంఐఎం చేతిలో నుండి జారిపోయింది. ఓల్డ్ సిటి నియోజకవర్గాల్లో ఇంతటి బలమైన పునాదులున్న ఎంఐఎంను తరిమేయటం అంటే బండి అనుకున్నంత ఈజీకాదు.

ముందు బీజేపీ తరపున ఆరు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు దొరకాలి. ఆ అభ్యర్ధులు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటైన అభ్యర్ధులు అయ్యుండాలి. అప్పుడు కాని జనాలు ఎంఐఎంకు ప్రత్యామ్నాయాన్ని అంగీకరించరు. సరే టార్గెట్ రీచైనా కాకపోయినా బీజేపీ ప్రయత్నించటంలో తప్పులేదు. దశాబ్దాల పాటు ప్రయత్నాలు చేస్తే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేయగలిగింది. అలాంటి పోరాటాలు, ప్రయత్నాలతోనే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పాగా వేయాలని కమలంపార్టీ ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగానే ఓల్డ్ సిటిలోని భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఎక్కువ దృష్టిపెట్టింది. జనాలను ఎంఐఎం నుండి దూరంచేయటానికి మతం, దేవుళ్ళకన్నా మించిన ఆయుధం లేదని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.

అందుకనే నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యమంత్రులను బీజేపీ వ్యూహాత్మకంగా భాగ్యలక్ష్మి దేవాలయంకు తీసుకొస్తున్నది. ర్యాలీలు, సభలు, కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నది. హిందుత్వవాదాన్ని చాలాబలంగా జనాల్లోకి తీసుకెళుతున్నది. పనిగట్టుకుని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదేపదే ఓల్డ్ సిటిలో పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికలో ఎలాంటి ఫలితం ఉంటుందో చూడాల్సిందే.

Read More
Next Story