
ఆపరేషన్ సిందూర్: అమల్లోకి సిటీ పోలీస్ యాక్ట్
భారత్-పాక్ యుద్ధం(India-Pakistan War) నేపధ్యంలో దేశమంతా ఒక విధమైన టెన్షన్ పెరిగిపోతోంది
పాకిస్తాన్ తో యుద్ధం నేపధ్యంలో కేంద్రప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రధాన నగరాల్లో పోలీసు యాక్ట్ విధించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో సిటీ పోలీస్ యాక్ట్(Hyderabad police act) ను అముల్లోకి తెచ్చినట్లు హైదరాబాద్ సిటి పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(CP CV Anand) ప్రకటించారు. భారత్-పాక్ యుద్ధం(India-Pakistan War) నేపధ్యంలో దేశమంతా ఒక విధమైన టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర హోంశాఖ అన్నీ ప్రధాన నగరాల్లో వెంటనే పోలీసు యాక్ట్ ను పెట్టాలని అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉదయం నుండే పోలీసు యాక్ట్ ను అమల్లో పెట్టేశారు.
ప్రజల భద్రత కోసం సికింద్రాబాదులోని మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలతో పాటు సున్నితమైన ఇతర ప్రాంతాల్లో కూడా సిటి పోలీసు యాక్ట్ అమల్లో ఉందన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా టపాకాయలు పేల్చటం నిషిద్ధమని ఆనంద్ చెప్పారు. ఎవరైనా టపాసులు పేల్చినపుడు అవి బాం పేలుళ్ళుగా భ్రమపడే అవకాశాలున్న కారణంగా టపాసులను పేల్చవద్దని విజ్ఞప్తిచేశారు. టపాసులు పేల్చి పోలీసులు, భద్రతాదళాలపై అనవసరంగా ఒత్తిడి తీసుకురావద్దని కూడా చెప్పారు. నగరంలోని సున్నితమైన ఓల్డ్ సిటి ఏరియాలో పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు మొదలైన సిటీ పోలీసు యాక్ట్ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమల్లో ఉంటాయని చెప్పారు.