DM&HO | సిద్ధార్థ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లకు వైద్యాధికారి సీలు
x

DM&HO | సిద్ధార్థ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లకు వైద్యాధికారి సీలు

రోగి మరణించినా చికిత్స పేరిట బిల్లు కాజేసి శవాన్ని అప్పగించారనే ఫిర్యాదుపై రంగారెడ్డి వైద్యాధికారి విచారణ జరిపారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లకు సీలు వేశారు.


రోగి మరణించినా చికిత్స పేరిట వైద్యులు హడావుడి చేసిన బాగోతాన్ని ఠాగూర్ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది.అచ్చు సినిమాలో లాగానే ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోని మదీనాగూడలో ఉన్న సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రిలో తాజాగా వెలుగు చూసిందని మృతురాలు సుహాసిని కుటుంబసభ్యులు ఆరోపించారు.


న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన రోగి
కడప జిల్లా నందునూరు గ్రామానికి చెందిన జి సుహాసిని అనే 26 ఏళ్ల మహిళ గత నెల 10వతేదీన కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో సుహాసిని కుటుంబ సభ్యులు ఆమెను మదీనాగూడలోని సిద్ధార్థ్ ఆసుపత్రికి తరలించారు.

రూ.13 లక్షల బిల్లు చెల్లించాం
సుహాసినికి అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈమెకు చేసిన వైద్యానికి రూ.13 లక్షల బిల్లు కూడా సుహాసిని కుటుంబసభ్యులు చెల్లించారు. సుహాసిని పరిస్థితి విషమంగా ఉందని, మరో రూ.5లక్షలు చెల్లించి ఆమెను తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. మహిళను అంబులెన్సులో తీసుకొని నిమ్స్ కు తీసుకువెళుతుండగా ఆసుపత్రి అటెండర్ మధ్యలో వదిలేసి వెళ్లాడు. నిమ్స్ కు సుహాసినిని తీసుకువెళ్లి చూపించగా రోగి మరణించిందని చెప్పారు. దీంతో సుహాసిని మృతదేహాన్ని తీసుకొని సిద్ధార్థ్ ఆసుపత్రికి వచ్చి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు.

మృతదేహానికి చికిత్స...
గత నెల 11వతేదీ నుంచి ఇప్పటి వరకు సుహాసిని కోలుకుంటుందని చెప్పి చికిత్స పేరిట డబ్బులు వసూలు చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. మూడు రోజుల క్రితమే మరణిస్తే తమకు చెప్పకుండా చికిత్స పేరిట బిల్లు వేశారని వారు ఫిర్యాదు చేశారు. ఆందోళన చేస్తున్నవారు వెళ్లిపోవాలని ఆసుపత్రి ఎండీ డాక్టర్ సిద్ధార్థ్ బెదిరించారు.

విచారణకు వైద్యశాఖ మంత్రి ఆదేశం
మరణించి మూడు రోజులైనా చికిత్స పేరిట లక్షలాది రూపాయల బిల్లు కాజేసీ శవాన్ని అప్పగించారంటూ మృతురాలు సుహాసిని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేర తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశంతో రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యాధికారులు సిద్ధార్థ్ ఆసుపత్రిలో సోమవారం విచారణ జరిపారు.



ఆపరేషన్ థియేటర్లకు సీలు వేసిన డీఎంఅండ్ హెచ్ఓ

సిద్ధార్థ్ న్యూరో ఆసుపత్రిలో సుహాసిని మృతదేహానికి చికిత్స పేరిట డబ్బులు వసూలు చేశారని వచ్చిన ఫిర్యాదుపై సోమవారం తాము ప్రాథమిక విచారణ జరిపామని రంగారెడ్డి జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సుహాసినికి సంబంధించిన కేసు షీటును పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు వెలుగుచూశాయని, దీంతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లకు సీలు వేశామని డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రస్థుతం ఆసుపత్రిలో 28 మంది రోగులున్నారని, వారికి చికిత్స చేశాక పంపించి వేయాలని ఆదేశించారు. కొత్తగా రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవద్దని జిల్లా వైద్యాధికారి ఆదేశించారు. సుహాసిని చికిత్సలో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే ఆసుపత్రిని సీజ్ చేసి, లైసెన్సును రద్దు చేస్తామని డాక్టర్ చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని డీఎం అండ్ హెచ్ఓ వివరించారు.


Read More
Next Story