హైడ్రా కోసం తొందరలోనే ఆర్డినెన్స్
x
Hydra Commissioner Ranganadh

హైడ్రా కోసం తొందరలోనే ఆర్డినెన్స్

దీనికి చట్టబద్ధత కల్పించకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకనే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తు ఆర్డినెన్సును జారీచేయబోతున్నట్లు సమాచారం.


తొందరలోనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి చట్టబద్దత రాబోతోంది. హైడ్రా వ్యవస్ధను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏర్పాటుచేసింది. అయితే దీనికి చట్టబద్ధత కల్పించకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకనే ప్రభుత్వం వీలైనంత తొందరలోనే హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తు ఆర్డినెన్సును జారీచేయబోతున్నట్లు సమాచారం. న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీ విషయంలో అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముసాయిదా ఫైనల్ అయిపోయినట్లు సమాచారం. ఆ ముసాయిదాను న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు.

ప్రభుత్వం ఏదైనా వ్యవస్ధను ఏర్పాటుచేయాలంటే దానికి చట్టబద్దత అవసరం. లేకపోతే ఎవరైనా కోర్టుకు వెళితే ఆ వ్యవస్ధ ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఈ విషయం తెలుసుకాబట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా ఏర్పాటుకు వీలైనంత తొందరలోనే ఆర్డినెన్స్ జారీచేయబోతోంది. తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందబోతోంది. ఆబిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపగానే హైడ్రాకు చట్టబద్దత వస్తుంది. ఇందులో భాగంగానే హైడ్రాకు పూర్తిస్ధాయి అధికారాలను కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది.

ఎలాగంటే హైడ్రాను మూడు జోన్లుగా ప్రభుత్వం విభజించబోతోంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధికి మాత్రమే పరిమితమైన హైడ్రాను హెచ్ఎండీఏ మొత్తానికి విస్తరించబోతోంది. ఎప్పుడైతే పరిధి పెరుగుతుందో దానికి తగ్గట్లే సిబ్బందిని కూడా పెంచకతప్పదు. అందుకనే మూడు జోన్లకు ముగ్గురు ఎస్పీస్ధాయి అధికారులను నియమించబోతోంది. ఈ ముగ్గురు అధికారులపైనా చీఫ్ కమీషనర్ గా ప్రస్తుత కమీషనర్ ఏవీ రంగనాధే కంటిన్యు అవుతారు. హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ ను సెంట్రల్ జోన్ గాను, సైబరాబాద్ జోనును నార్త్ జోన్ గాను, రాచకొండ కమీషనరేటును సౌత్ జోనుగా ఏర్పాటు చేయబోతోంది. వీటికి జోనల్ అధికారులతో పాటు క్షేత్రస్ధాయి సిబ్బందికి కూడా నియమించబోతోంది. ఇపుడు హైడ్రాలో ఉన్న 259 మంది సిబ్బందిని మరింతగా పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. హైడ్రా ఏర్పాటైన వెంటనే గ్రేటర్ పరిధిలో ఆక్రమణల్లో ఉన్న చెరువులు, కాల్వలు, కుంటలపైన దృష్టిపెట్టింది. చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూలగొట్టేస్తోంది. ఇప్పటికి సుమారు 60 ఆక్రమణలను తొలగించి నిర్మాణాలను కూలగొట్టేస్తోంది. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేయటం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడ ఫాంహౌస్ ను కూల్చేసే ఉద్దేశ్యంతో సర్వేలు కూడా పూర్తిచేసింది. మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, రాజకీయ, వ్యాపార, పారిశ్రామికవేత్తల ఫాంహౌసులపైన కూడా హైడ్రా సర్వే చేయిస్తోంది.

అలాగే చెరువులను ఆక్రమించి నిర్మించిన చాలా విద్యాసంస్ధలను కూల్చేసేందుకు హైడ్రా నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై ఎంఎల్ఏలు చేమకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి కొందరు కోర్టుకు వెళ్ళారు. అలాగే ఓవైసీ కుటుంబం నిర్వహిస్తున్న ఫాతిమా ట్రస్టులోని విద్యాసంస్ధలను కూల్చేయటానికి హైడ్రా కొంత సమయం ఇచ్చింది. మొత్తానికి హైడ్రా ఏర్పాటే సంచలనం అనుకుంటే దాని యాక్షన్ బడాబాబుల్లో మరింత కలవరం రేపుతోంది. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చేసేందుకు హైడ్రా నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది.

ఇంతటి సంచలనాలు సృష్టిస్తున్న హైడ్రాకు తొందరలోనే చట్టబద్దత రాబోతోంది. అందుకనే రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాకు జనాల మద్దతు పెరిగిపోతోంది. తమ జిల్లాల్లో కూడా హైడ్రాను విస్తరించాలని ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో జనాలు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరి చట్టబద్దత లభించగానే హైడ్రా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story