
‘రాష్ట్ర పాలనలో ఏఐ వినియోగం’
దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
రాష్ట్ర పాలనలో ఏఐ వినియోగంపై తమ సర్కార్ ఫోకస్ పెట్టినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పరిపాలనలో కృత్రిమమేధస్సును పూర్తిస్థాయిలో వినియోగించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని భట్టి ఆకాంక్షించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ(మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగానే ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా నిలపాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సంస్థ స్వయం సమృద్ధిసాధించి ఆర్థికంగా పురోగమించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఇప్పటికే పాలనలో ఏఐ వినియోగం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేసే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అందుకు తగిన విధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అందరికీ సమగ్ర శిక్షణ అందించాలని కూడా ఆయన సూచించారు. దాంతో పాటుగా స్వయం సహాయక సంఘాల నాయకులకు జిల్లా, మండల స్థాయిల్లో రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగడానికి కృషి చేయాలని భట్టి తెలిపారు.