Pharma Blast | కాలం చెల్లిన పాత యంత్రాలే ప్రమాదానికి కారణమా?
x
సిగాచీ పరిశ్రమలో ప్రమాద పరిస్థితులను పరిశీలిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ , జయంతి నటరాజన్

Pharma Blast | కాలం చెల్లిన పాత యంత్రాలే ప్రమాదానికి కారణమా?

వారంటీ లేని కాలం చెల్లిన పాత యంత్ర పరికాలను వాడటం వల్లనే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 19,580 కర్మాగారాల్లో 6.94 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల్లో ఎక్కువ మంది ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ కూలీలే ఉన్నారు. ప్రమాదకర ఫార్మా పరిశ్రమలు, కెమికల్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని తెలంగాణ ఫ్యాక్టరీల శాఖ చూడాల్సి ఉండగా, అధికారులు యాజమాన్యాల నుంచి లంచాలు తీసుకొని కార్మికుల భద్రతను ఫణంగా పెడుతున్నారని తెలంగాణ హిందూ మజ్దూర్ సభ కార్మిక సంఘం అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాశమైలారంలో జరిగిన ఘోర పేలుడుకు కారణం పాత యంత్రపరికరాలు వాడటం, కార్మికుల భద్రత చర్యలను పట్టించుకోక పోవడమేనని ఆయన ఆరోపించారు.




సిగాచి కంపెనీని సీజ్ చేయాలి

పాశమైలారం ప్రమాద ఘటనలో సిగాచి కంపెనీని ప్రభుత్వ సీజ్ చేసి, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, తెలంగాణ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950 నిబంధనల ప్రకారం ప్రతీ నెలా సేఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించాలని కానీ, కంచె చేను మేసిన చందంగా అధికారులు లంచాలకు అలవాటు పడి పరిశ్రమల్లో కార్మికుల భద్రతను గాలికి వదిలేశారని, దీనివల్లనే గడచిన అయిదు సంవత్సరాల్లో 706 అగ్నిప్రమాదాలు, పేలుళ్లు జరిగాయని రియాజ్ అహ్మద్ చెప్పారు.

పాత యంత్రపరికరాలే ప్రమాదానికి కారణం
సిగాచి పరిశ్రమలోని ప్లాంటులో యంత్రాలు, సామాగ్రి, ఇతర పరికరాలు పాతవని, అవి కాలం చెల్లినవని ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులే చెబుతున్నారు. వారంటీ ముగిసిన యంత్రపరికరాలను తొలగించి వాటి స్థానంలో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయక పోవడం, పరిశ్రమలో సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల ఈ ఘోర పేలుడు జరిగి 42 మంది కార్మికులు మృత్యువాత పడ్డారని సిగాచీ కార్మికులు చెప్పారు.ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వ, దిగుమతి నియమాలను పలు పరిశ్రమలు పాటించడం లేదు. కెమికల్ పరిశ్రమల్లో రసాయన ప్రమాదాలు జరిగినపుడు సంసిద్ధంగా ఉండి అత్యవసర ప్రణాళిక చేపట్టాల్సిన సిగాచీ యాజమాన్యం ప్రమాదం జరిగి రెండు రోజులు గడచినా వారి జాడలేదు.



పరిశ్రమల్లో సేఫ్టీ మాక్ డ్రిల్స్ ఏవి?

పరిశ్రమలో కార్మికుల రెస్ట్ షెడ్, లంచ్ రూమ్, క్యాంటీన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్,ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్లు,కార్మికుల సంఖ్యను బట్టి మాక్ డ్రిల్స్ కర్మాగారాల్లో నిర్వహించాలి. కానీ అవేవి అధికారులు సజావుగా చేయడం లేదు. కర్మాగారాల్లో కార్మికులకు సంక్షేమ సౌకర్యాలు అమలు చేయడం లేదు.యంత్రాలకు కంచె వేయడం, సురక్షితమైన యాక్సెస్ మార్గాలు, గుంటలు, సంప్‌లు, ఇతర ఓపెనింగ్‌లను కప్పడం, లిఫ్టింగ్ యంత్రాలు, ప్రెషర్ నాళాలను పరీక్షించడం, అగ్నిమాపక చర్యలను కాలానుగుణంగా పరీక్షించాల్సి ఉండగా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు.

మొక్కుబడిగా తనిఖీలు
ప్రమాద రిస్క్ ఉన్న కర్మాగారాలను ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు రెండేళ్లకు ఒక సారి, రిస్క్ తక్కువ ఉన్న పరిశ్రమలను అయిదేళ్లకు ఓ సారి తనిఖీలు చేసి రిపోర్టును సమర్పించాలి. పరిశ్రమల్లో ఏవైనా డిఫెక్టులు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. కానీ ఈ వ్యవహారం మొత్తం మొక్కుబడిగా సాగుతుండటంతో పరిశ్రమల్లో ప్రమాదాలకు తెరపడటం లేదని కార్మికులే చెబుతున్నారు. తనిఖీ నివేదిక ఇచ్చిన ఏడు రోజుల్లోగా పరిశ్రమల యాజమాన్యాలు వాటి సరిచేసుకోవాల్సి ఉంది. కానీ ఆచరణలో ఇది జరగడం లేదు.జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేదా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేదా ఇన్‌స్పెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ రిమార్క్‌లను చూపించి షోకాజ్ నోటీసు జారీ చేస్తే దీనిపై పరిశ్రమలు వెంటనే చర్యలు తీసుకోవాలి. కానీ కార్మికుల భద్రతను ఫణంగా పెడుతూ నిబంధనలు పాటించడం లేదు.



నిబంధనలు పాటించని పరిశ్రమలు

ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, తెలంగాణ ఫ్యాక్టరీస్ రూల్స్ 1950 ల ప్రకారం భద్రతా నిబంధనలు పాటించని క్రషర్ ప్లాంట్ మెషినరీని మూసివేయాలని ఆదేశిస్తూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం ప్రవీణ్ కుమార్ గత ఏడాది నవంబరు 15వతేదీన ఎ 244 నంబరుతో ప్రొహిబిటరీ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది నవంబరు 12వతేదీన క్రషర్ లో భద్రతా చర్యలు పాటించక పోవడంతో జింటూ గౌడ (25) అనే కాంట్రాక్టు కార్మికుడు కన్వెయర్ బెల్టులో చిక్కుకు పోయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్మికుడిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి క్రషర్ లోని కన్వెయర్ బెల్టు, రోలర్ క్రషర్, జా క్రషర్ లు సరిగా లేవని, కార్మికుల రక్షణకు మెష్ గార్డ్స్ లేవని ఇన్ స్పెక్టర్ తనిఖీల్లో తేలింది. తనిఖీల్లో తేలినా చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి.


Read More
Next Story