కడుపు నింపే వరిపంట తెస్తున్న తంటా
x
Farmer using Urea in Paddy field

కడుపు నింపే వరిపంట తెస్తున్న తంటా

పంటల మీద మితిమీరి చల్లుతున్న రసాయన ఎరువులు కూడా భూగర్భ కాలుష్యానికి కారణమవుతున్నాయి


తెలంగాణలో సాగువిస్తీర్ణం పెరిగిందని, వరిసాగు పెరిగిందని, దిగుబడులు పెరిగాయని గొప్పలు చెప్పుకోవటమే కాని దానివల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. సాగువిస్తీర్ణం పెరగటం, వరి దిగుబడి పెరగటం వల్ల లాభాలే కాని నష్టాలేమిటి ? దుష్ఫలితాలు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ? దుష్ఫలితాలు పెరుగుతున్నాయనేందుకు శాస్త్రజ్ఞుల అధ్యయనాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అవి ఏమిటంటే వరి, వేరుశెనగ, పత్తి లాంటి పంటలు వేసిన రైతులు అధిక దిగుబడుల కోసమని అవసరానికి మించి యూరియా(Urea), నైట్రేట్(Nitrate) లాంటి ఎరువులను ఉపయోగిస్తున్నారు.


ఒక మోతాదుకుమించి ఎరువులవాడకంవల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసినా రైతులు వాడకానికి అలవాటుపడిపోయారు. దానివల్ల మొక్కలు గ్రహించగా మిగిలిపోయిన యూరియా, నైట్రేట్ లాంటి ఎరువులు భూగర్భంలోకి దిగుతున్నాయి. క్రమంతప్పకుండా వీటిని ఉపయోగిస్తున్నందు వల్ల భూసారం దెబ్బతినటమే కాకుండా భూమిలోకి దిగిన యూరియా, నైట్రేట్ లాంటి ఎరువులు భూగర్భజలాల్లో కలుస్తున్నాయి. పరిమితికి మించిన ఎరువుల వాడకంవల్ల ఇటు భూసారం దెబ్బతినటమే కాకుండా అటు భూగర్భజలాలు కూడా కలుషితమైపోవటం వల్ల జనాల్లో ముఖ్యంగా పిల్లల్లో అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి.


ఈ సీజన్లో సుమారు 69 లక్షల ఎకరాల్లో 1.48 కోట్ల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యధికంగా వరిసాగు జరుగుతోంది. మొన్నటి రబీ సీజన్లో ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరాచేసింది. నిజానికి తెలంగాణకు ప్రతి సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే వివిధ కారణాల వల్ల అవసరమైనంత యూరియాను కేంద్రప్రభుత్వం తెలంగాణకు సరఫరా చేయలేకపోయింది. రైతులుకూడా వేలంవెర్రిగా అవసరానికి మించి యూరియాను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు ఎప్పటినుండో చెబుతున్నా ఎవరూ వినటంలేదు. అవసరానికి మించి యూరియాను వాడటంవల్ల లక్షల టన్నుల యూరియా అంతా భూమిలోకి వెళ్ళి భూసారాన్ని దెబ్బతీయటమే కాకుండా భూగర్భజలాలను కూడా కలుషితం చేస్తున్నాయి.


ఈ నేపధ్యంలోనే మంచినీళ్ళు అనుకుని మనం తాగుతున్నదంతా మంచినీరేనా ? అనేసందేహాలు ఇపుడు పెరిగిపోతున్నాయి. మంచినీళ్ళరూపంలో కొన్నిప్రాంతాల్లోని జనాలు తాము తాగుతున్నది విషం అని తెలిసిన వారిలో ఆందోళన పెరిగిపోతోంది. తెలంగాణ(Telangana)లోని వివిధ ప్రాంతాల్లో భూగర్భజలాల స్వచ్చతపై కేంద్ర భూగర్భ జలమండలి అధ్యయనంచేసింది. తన అధ్యయాన్ని విశ్లేషించిన తర్వాత రిపోర్టును కేంద్ర జలశక్తికి పంపింది. ఆ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలోని 73 ప్రాంతాల్లో మంచినీటి శాంపుళ్ళల్లో పరిమితికి మించిన ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది. అలాగే 2చోట్ల పరిమితికి మించిన క్లోరైడ్ ఉందని, 173 ఏరియాల్లో తీసుకున్న శాంపుల్స్ లో పరిమితికి ఉండాల్సిన మోతాదుకుమించి నైట్రైట్ రశాయన మూలకాలున్నట్లు అధ్యయనంలో బయటపడింది.


రీజనల్ కెమికల్ ల్యాబరేటరీలో నీటి శాంపుల్స్ ను పరీక్షించిన తర్వాత తేలింది ఏమిటంటే చాలా జిల్లాల్లోని భూగర్భజలాల్లో ఆరోగ్యానికి హానికరమైన మూలకాలున్నాయని. భూగర్భజలాల్లో ప్రధానంగా కాల్షియం బైకార్బొనేట్ రసాయనం ఉందని శాస్త్రవేత్తలు కన్నుక్కున్నారు. హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఐనవోలు, వర్ధన్నపేట, ఎల్కతుర్తి గ్రామాలు, వరంగల్ జిల్లాలోని ఆత్యకూరు, చెన్నారావుపేట, నర్సంపేట, శాయంపేట గ్రామాలు, జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, జూలపల్లి, కొడిమ్యాల, కోరుట్ల, జనగామ జిల్లా ఘన్ పూర్, జనగామ, కొడకండ్ల, నర్మెట్ట, రఘునాధపల్లె గ్రామాల్లో నీటి శాంపుల్స్ పరీక్షించారు. అలాటే నాగర్ కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాలు, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నట్లు తేలింది. 73 గ్రామాల్లో నీటి శాంపుల్స్ తీసుకుని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇక్కడ లీటర్ నీటిలో 1.5 గ్రాములకు మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు గమనించారు. మామూలుగా అయితే తాగునీటిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండకూడదు.


అలాగే నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలు మినహా మిగిలిన అన్నీ జిల్లాల్లోను నైట్రేట్ అవశేషాలున్నట్లు తేలింది. లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాముల నైట్రేట్ అవశేషాలను శాస్త్రవేత్తలు గమనించారు. ఇక, గద్వాల జిల్లాలోని 17 ప్రాంతాలు, కామారెడ్డిలో 17, మెదక్ లో 17, ఖమ్మంలో 13, యాదాద్రిభువనగిరి జిల్లాలో 13 ప్రాంతాల్లో భూగర్భజలాలు తాగటానికి ఏమాత్రం పనికిరావని అధ్యయనంలో తేలింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మంచినీటి శాంపుల్స్ ను చూసిన తర్వాత చాలామందిలో ఇదే సందేహం పెరిగిపోతోంది. ఎందుకంటే భూగర్భజలాల విషయంలో కేంద్ర భూగర్భజలమండలి కేంద్ర జలశక్తి శాఖకు ఈమధ్యనే ఒక రిపోర్టు అందించింది.


దాని సారంశం ఏమిటంటే చాలా ప్రాంతాల్లోని భూగర్భజలాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్ ఉన్నట్లు తేలింది. వివిధ జిల్లాల్లోని 73 ప్రాంతాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే 2 చోట్ల పరిమితికి మించి క్లోరైడ్, 137 ఏరియాల్లో పరిమితికి మించి నైట్రేట్ రశాయనమూలాలు ఉన్నట్లు సర్వేలో బయటపడింది. దీంతోనే రాష్ట్రంలోని భూగర్భజలాల స్వచ్చత ఎంతనే విషయంలో జనాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పనిచేయటంలేదు : సుబ్బారావు



ఇదే విషయమై భూగర్భజలాలపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ బలిజేపల్లి సుబ్బారావు మాట్లాడుతు గడచిన 12 ఏళ్ళుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగా పనిచేయటంలేదన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు బోర్డులో సుమారు 30 మంది ఇంజనీర్ల పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ కూడా ఏమంతా సరిగా పనిచేయటంలేదన్నారు. సంస్ధల పనితీరు బలహీనపడిన కారణంగా కాలుష్యకారక పరిశ్రమల యాజమాన్యాలు రెచ్చిపోతున్నట్లు అభిప్రాయపడ్డారు. భూగర్భజలాలు కలుషితం అవటానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణమని ఆరోపించారు.

పటాన్ చెరు, సంగారెడ్డి మండలంలోని బొంతపల్లి గ్రామంలో దొరికేనీరు కలుషితమైపోతోందని ఉదాహరణగా చెప్పారు. గ్రౌండ్ వాటర్ క్వాలిటి మ్యాపింగ్ ఒకపుడు జరిగేదన్నారు. ఇపుడు గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ ను ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వదిలేసిందన్నారు. నీటి కాలుష్యంతో పాటు వాతావరణ కాలుష్యంపై ఎంతమంది ఫిర్యాదులు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవటంలేదని ఆవేధన వ్యక్తంచేశారు. ఇళ్ళనిర్మాణాలు నియంత్రణలేకుండా పెరిగిపోతోందని తెలిపారు. వర్షాలు లేకపోయినా కొండాపూర్లోని కొన్ని ప్రాంతాల్లో మురికినీరు రోడ్లపైన పారుతోందని చెప్పారు.

బొంతపల్లిలోని ఒకఇండస్ట్రీలోనుండి వచ్చేనీళ్ళు 12ఏళ్ళుగా దగ్గరలోని చెరువులో కలుషితం అవుతోందని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. దీనివల్ల భూగర్భజలాలు బాగా కలుషితం అవుతున్నాయని చెప్పారు. 45శాతం నగరవాసులు భూగర్భ జలాలమీదనే ఆధారపడక తప్పటంలేదన్నారు. గడచిన 40 ఏళ్ళుగా భూగర్భజలాల శుద్దిని నిర్లక్ష్యం అయ్యందన్నారు. భూగర్భజలాలను శుద్దిచేయాలంటే 40 ఏళ్ళుపడుతుందని చెప్పారు. పటాన్ చెరులో అన్నీ హైరైజ్ నిర్మాణాలే అని, భూగర్భజలాలు పటాన్ చెరులోని 14 చెరువుల్లోని నీరు కలుషితమైనట్లు 14 కేసులు సుప్రింకోర్టులో కేసులు పెండింగులో ఉన్నట్లు చెప్పారు.


సంబంధిత శాఖల్లో చిత్తశుద్ది ఉన్న ఉన్నతాధికారుల నియామకం జరగటంలేదని అందుకనే నియమ, నిబంధనల ఉల్లంఘన జరిగినా ఎవరూ పట్టించుకోవటంలేదన్నారు. నీటిని పరీక్షించేందుకు అవసరమైన సాధన సంపత్తి కూడా లేదన్నారు. కేంద్రప్రభుత్వంలో అయితే 15 ఏళ్ళక్రితమే కేంద్ర పొల్యూషన్ విభాగాన్ని మూసేసినట్లు తెలిపారు. అందుకనే జలశక్తి బోర్డు కూడా పొల్యూషన్ గురించి ఎక్కడా మాట్లడటంలేదని గుర్తుచేశారు.

ఫ్లోరైడ్ సమస్య 40 ఏళ్ళుగా ఉంది : మురళీధరన్



తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య 40 ఏళ్ళుగా ఉందని ఎన్జీఆర్ఐ సీనియర్ సైటింస్ట్ దేవనాధ మురళీధరన్ చెప్పారు. పంటలకు అత్యధికస్ధాయిలో భూగర్భజలాలను వాడటం వల్ల కూడా ఫ్లోరైడ్ సమస్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఫ్లోరైడ్ సమస్యకు హట్ స్పాట్ అన్నారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారంగా వరికి బదులు రైతులు డ్రై పంటలు మేజ్, కొర్రల్లాంటివి వేయాలని సూచించారు. పంటలకు అవసరానికి మించి యూరియా, నైట్రోజన్ వాడకం వల్ల కూడా భూగర్భజలాలు కలుషితమైపోతున్నట్లు చెప్పారు. ఫ్లోరైడ్ సమస్యలున్న ప్రాంతాల్లోని చెరువుల మట్టిని పొలాల్లో వాడకూడదన్నారు. చెరువుల మట్టిని ఇటుకలు తయారీలో ఉపయోగించవచ్చని తాను ప్రభుత్వానికి గతంలోనే ఒక రిపోర్టులో చెప్పినట్లు గుర్తుచేశారు. ఓపెనె టాయిలెట్స్, ఓపెన్ సీవరేజి వల్ల భూమిలో నైట్రేట్ మూలకాలు పెరుగుతాయన్నారు.


ఫ్లోరైడ్ సమస్యకు గ్రానైట్ క్వారీయింగ్ కూడా కారణంగా చెప్పారు. పాలిషింగ్ చేసిన గ్రానైట్ పొడి హై ఫ్లోరైడ్ కారణంగానే భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయన్నారు. నల్గొండ+ఖమ్మం జిల్లాల్లోనే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేదుకు కారణం ఈ జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమలే అన్నారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ పైన ప్రభుత్వం నియంత్రణ అన్నది లేకుండా పోయిందని చెప్పారు. మంచినీటిరూపంలో విషం తీసుకున్నట్లే లెక్క అని స్పష్టంగా చెప్పారు. గ్రౌండ్ లెవల్, చెరువుల పొల్యూషన్ పైన 35 ఏళ్ళ ఆందోళనలు జరిగినా ఎలాంటి ఉపయోగం కనబడలేదన్నారు. బాచుపల్లి ఏరియాలోని పరిశ్రమలను షిఫ్ట్ చేయాలని ఆందోళనలు చేస్తున్నా ఉపయోగంలేదని చెప్పారు.

భయపడాల్సిన అవసరం లేదు : పీఎన్ రావు

కేంద్రియ భూగర్భజలాల మీద ఏళ్ళ తరబడి అధ్యయనం చేసిన సీనియర్ సైటింస్ట్ పీఎన్ రావు మాట్లాడుతు భూగర్భజలాల కలుషితంపై అంతగా ఆందోళన పడాల్సిన అవసరంలేదన్నారు. దేశం మొత్తంమీద ప్రతిరాష్ట్రంలో అబ్సర్వేషన్ వెల్స్ ఉంటాయని చెప్పారు. అబ్జర్వేష్న వెల్స్ ప్రతిమండలంలో రెండుంటాయని వాటిల్లోని శాంపుల్స్ తీసుకుని పరీక్షిస్తారని తెలిపారు. తెలంగాణలోని 612 మండలాల్లో 1200 అబ్జర్వేషన్ వెల్సుంటాయన్నారు. వీటిలోని నీటిని సేకరించి పరిశోధనలు చేసి రిపోర్టు తయారుచేస్తారని చెప్పారు. నల్గొండ జిల్లాలో ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుందన్న విషయం ఎప్పటినుండో అందరికీ తెలిసిందే అన్నారు. ఒక ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నంతా మాత్రాన అన్నీ ప్రాంతాల్లో ఉన్నట్లు కాదన్నారు. ఎన్నికల్లో అభిప్రాయసేకరణ చేసినట్లే భూగర్భ జలాలపైన కూడా శాంపుల్ సర్వే చేస్తుంటారని వివరించారు. రిపోర్టు వల్ల భయపడాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ఫ్లోరైడ్ పాండమిక్ ఏరియా అనటంలో సందేహంలేదని, ఫ్లోరైడ్ నీటిని తాగుతున్న వారిలోనే సమస్యలు కనబడుతున్నట్లు చెప్పారు. మిగిలిన ఏరియాల్లో ఫ్లోరైడ్ ప్రభావం తక్కువగానే ఉంటోందని గుర్తుచేశారు. సర్ఫేస్ వాటర్ అంటే నదుల నుండి పైప్ లైన్లు వేసి సరఫరా చేయటమే ప్రత్యామ్నాయమన్నారు. 1970ల నుండి ఫ్లోరైడ్ రహిత నీటికి చర్యలు తీసుకోవాలని చెబుతున్నా ఎవరూ ఆచరించటంలేదని ఆవేధన వ్యక్తంచేశారు. ఆర్వో, మిషన్ భగీరథ నీరే ప్రత్యామ్నాయమని పీఎన్ రావు వివరించారు.

నైట్రైట్ వల్ల అనేక దుష్ఫలితాలు : బాబూరావు

బోర్ వెల్స్ ఎక్కువైపోతున్నాయని, చాలాపరిశ్రమల యాజమాన్యాలు కాలుష్యాన్ని చెరువులు, వాగుల్లోకి పంపేస్తున్నట్లు ఐఐసీటీ సీనియర్ సైంటిస్ట్ కే బాబురావు తెలిపారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం చేయాల్సిన పనిచేయటంలేదన్నారు. ప్రభుత్వం వాచ్ డాగ్ పనిచేయటంలేదు కాబట్టే జనాలు ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. వాతావరణ, భూగర్భజలాల కాలుష్యంపై ప్రజల్లో సమాచార లోపంవల్ల చైతన్యం కనబడలేదన్నారు. ఇబ్బందులు పడుతున్న జనాలు కూడా మాట్లాడకపోవటమే ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజకీయ నేతలు ప్రజల సమస్యలను పట్టించుకోవటంలేదని. ప్రజల్లో చైతన్యం వచ్చినపుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఎవరైనా ముందుకొచ్చి సమస్యలు-పరిష్కారంగురించి చెప్పినా ప్రభుత్వాలు వినటంలేదన్నారు. సమస్య బాగా పెరిగిపోయి భరించలేని స్ధాయికి చేరుకున్నపుడు మాత్రమే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం గౌరవించటంలేదని, పార్టీలు ఓట్లు, అధికారంగురించే ఆలోచిస్తున్నాయి కాని ప్రజల గురించి ఆలోచించటంలేదన్నారు.


అధికంగా నైట్రేట్ వాడకంవల్ల కూడా భూగర్భజలాలు కలుషితమైపోతున్నట్లు బాబురావు చెప్పారు. భూగర్భజలాల్లో నైట్రేట్ కలవటంవల్ల రక్తంలోని హిమగ్లోబిన్ మెథీమోగ్లోబిన్ గా మారిపోతుందన్నారు. దీనివల్ల ఆక్సిజన్ తీసుకుని సామర్ధ్యం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రక్తంలో ఆక్సిజన్ కొరతవల్ల పిల్లల చర్మం నీలిరంగులోకి మారిపోతుందన్నారు. శ్వాసకోశ సమస్యల వచ్చి శరీరం నీలిరంగులోకి మారటాన్నే బ్లూబేబీ సిడ్రోమ్(మెథీమోగ్లోబినేమియా) అంటారని చెప్పారు. పటాన్ చెరు ప్రాంతంలో బ్లూబేబి పుట్టిందనే ప్రచారం జరిగినా అధికారికంగా నమోదుకాలేదన్నారు. నైట్రైట్ లు శరీరంలో కలవటం వల్ల నైట్రోసమైన్ అనే రశాయనం తయారవుతుందన్నారు. ఈ రశాయనం క్యాన్సర్ కు దారితీస్తుందని తెలిపారు. మలద్వార, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లకు ఈ రశాయనం కారణమవుతోందని అధ్యయనాలు నిర్ధారించినట్లు బాబూరావు చెప్పారు. అధిక నైట్రైట్ కలిసిన నీరు తాగటం వల్ల గర్భిణిలకు గర్భస్రావం, పుట్టే పిల్లలకు అవయవాలు సరిగా ఏర్పడకపోవటం లేదా పుట్టుకతోనే లోపాలతో పుట్టడం వంటి సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలిందని డాక్టర్ బాబూరావు హెచ్చరించారు.

Read More
Next Story