పార్లమెంటుకు అందుకే రావట్లేదు.. కారణం చెప్పిన ఓవైసీ
తాను పార్లమెంటుకు డుమ్మా కొడుతుండటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగాలు వినే ఓపిక లేకే తాను పార్లమెంటుకు రావడం లేదని వెల్లడించారు.
తాను పార్లమెంటుకు డుమ్మా కొడుతుండటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగాలు వినే ఓపిక లేకే తాను పార్లమెంటుకు రావడం లేదని వెల్లడించారు. నిజామాబాద్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రంలో బీజేపీతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ కొనసాగిస్తున్న పాలనపై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్.. పేదల వ్యతిరేక పాలన కొనసాగిస్తోందంటూ మండిపడ్డారు. ఇకనైనా వారు తమ పద్దతులు మార్చుకోవాలని, పేదల కంటనీరు రావడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు భయాందోళనల్లో బతుకుతున్నారని, ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను కనుక్కుంటూ వాటికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తన పనులను ముందుకు కొనసాగించాలని కోరారు.
వాటితో లేని ఇబ్బంది పేదల ఇళ్లతో వస్తుందా..
ఈ సందర్భంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చడంపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల సంక్షేమం కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉందే తప్ప పాలన, చేతల్లో లేదని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చడంతో ఏం లాభం వస్తుంది? అని ప్రశ్నించారు. రాష్ట్ర సెక్రటేరియట్ సహా ఎన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయని గుర్తు చేశారు. అవి ఉంటే రాని ఇబ్బంది పేదల ఇళ్లు ఉంటేనే వస్తుందా? అని నిలదీశారు. ‘‘మేము అభివృద్ధికి మద్దతు ఇస్తాం. కానీ పేదలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోం. పేదలను ఇబ్బంది పెట్టొద్దు. వారికి పునరావాసం, ప్రత్యామ్నాయం చూపిన తర్వాత కూల్చివేతలు చేయాలని కోరుతున్నా. అది కూడా ప్రత్యామ్నాయం, పునరావాసాలు కంటితుడుపు చర్యలుగా కాకుండా సరైన పద్దతిలో కల్పించాలి’’ అని కోరారు. అనంతరం నిజామాబాద్‌లో కూడా పార్టీ బలోపేతం కోసం పాడుపతామని, అందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో మైనార్టీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నియంత్రించడమే తన లక్ష్యమని అన్నారు.
అందుకే పార్లమెంటుకు వెళ్లడం లేదు..
కొంతకాలంగా తాను పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకపోవడంపై కూడా ఓవైసీ స్పందించారు. బలమైన కారణం ఉండటం వల్లే తాను పార్లమెంటుకు వెళ్లడం లేదని చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చే ప్రసంగాలు వినే ఉద్దేశం, ఓపిక లేకపోడమే ఆ కారణం అని వివరించారు. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరని, అది మైనార్టీలపై చూపుతున్న వివక్షే అని విమర్శించారు. మైనార్టీల అభ్యున్నతి కోసం అదే లక్ష్యంతో ఏర్పడిన ఎంఐఎం అన్ని చోట్ల కావాలని, స్థానిక సంస్థల్లో కూడా అది పోటీ చేయాలని కోరారు. ‘‘బీజేపీ సర్కార్.. ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కనుసన్నల్లో నడుస్తోంది. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోంది. గుజరాత్ సోమనాథ్‌లోని దర్గా, కబ్రస్థాన్‌లు అన్యాక్రాంతం అవుతున్నాయి. 12 శతాబ్దాల చరిత్ర ఉన్న మసీదు, కబ్రస్థాన్‌లను అక్కడి ప్రభుత్వం రాజ్యంగ విరుద్ధంగా కూలగొడుతోంది. వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ చేస్తున్న కుట్రలను అడ్డుకుంటాం’’ అని వెల్లడించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎంఐఎం ఉండేలా చేస్తామని, ఇందులో భాగంగానే మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.