తడిబట్టలతో ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. మరి పొన్నం?
x

తడిబట్టలతో ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. మరి పొన్నం?

హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌ హనుమాన్‌ దేవాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌ హనుమాన్‌ దేవాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫ్లై యాష్ స్కామ్‌ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమేయం ఉందని చేస్తోన్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవినీతి చేయలేదని గుడిలో ప్రమాణం చేయాలని.. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ బాబు సవాల్ విసిరారు.

సవాల్ స్వీకరించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు హనుమాన్ టెంపుల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు ఆలయ ఆవరణతో పాటు గ్రామంలో కూడా మోహరించారు. పోలీసులు చెల్పూర్ వద్ద హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి రాజకీయ నేతలను అనుమతించడం లేదు. కౌశిక్ రెడ్డిని వీణవంకలోని ఆయన నివాసంలోనే గృహనిర్బంధం చేశారు.

ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటివద్దే తడిబట్టలతో తాను అవినీతికి పాల్పడలేదని దేవుడి ఫోటోపై ప్రమాణం చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్లైయాష్ తరలింపు, ఓవర్ లోడ్ లారీల నుంచి డబ్బులు తీసుకోలేదని మంత్రి పొన్నం కూడా ప్రమాణం చేయాలన్నారు. అలా చేస్తే తాను క్షమాపణ చెప్తానన్నారు. పొన్నంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు.

అసలేంటి వివాదం..?

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎన్‌టీపీసీ రామగుండం నుంచి ఖమ్మంకు ఫ్లై యాష్‌ను అక్రమంగా తరలిస్తూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన పొన్నం ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై కౌశిక్‌రెడ్డి స్పందిస్తూ.. అక్రమంగా ఫ్లై యాష్‌ తరలింపులో మంత్రి ప్రమేయం లేకుంటే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే సవాల్‌పై ప్రణవ్‌ బాబు స్పందిస్తూ కౌశిక్‌రెడ్డి అవినీతికి పాల్పడకపోతే చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని ప్రతిసవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత సవాల్‌పై స్పందించిన కౌశిక్ రెడ్డి మంగళవారం హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు. చెల్పూర్‌ లోని హనుమాన్ దేవాలయంతో పాటు హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారి వరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసుకుని పరస్పర సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు లేవనెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.



Read More
Next Story