
ఎస్ఎల్ బీసీ టన్నెల్
Pahalgam Effect:ఎస్ఎల్‌బీసీ రెస్క్యూ నుంచి ఆర్మీ,నేవీ బృందాల ఉపసంహరణ
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో సహాయ పనులకు తాత్కాలిక విరామం ప్రకటించారు. పహెల్ గాం దాడి నేపథ్యంలో టన్నెల్ వద్ద సహాయ పనులు చేస్తున్న ఆర్మీ, నేవీ బృందాలను ఉపసంహరించారు.
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పహెల్ గాంలో ఉగ్ర దాడి ఘటన జరిగిన నేపథ్యంలో 64 రోజులుగా ఎస్ఎల్ బీసీలో సాగుతున్న సహాయ పనుల నుంచి భారత సైన్యం, భారత నావికాదళ బృందాలను ఉపసంహరించారు. ఫిబ్రవరి 22వతేదీన ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిన వెంటనే సహాయ పనుల కోసం ఆర్మీ, నేవీ దళాలను రంగంలోకి దించారు. పహెల్ గాం ఘటన తర్వాత సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలతో ఆర్మీ, నేవీ బలగాలను సహాయ పనుల నుంచి మినహాయించారు.
టన్నెల్ లోపలే చిక్కుకు పోయిన ఆరుగురి మృతదేహాలు
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లోపల గత 64 రోజులుగా వివిధ సంస్థల నిపుణులు ముమ్మర సహాయ పనులు చేపట్టినా లోపల చిక్కుకు పోయిన ఆరుగురి మృతదేహాలను వెలికితీయ లేక పోయారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో మరోసారి పైకప్పు కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సహాయ పనులను తాత్కాలికంగా నిలిపివేసి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 120 మంది సిబ్బందిని తుది సహాయ పనులకు వినియోగించాలని నిర్ణయించారు.
శిథిలాల తొలగింపు
గత 64 రోజులుగా టన్నెల్ లోపల తొలగించిన శిథిలాలను స్క్రాప్ యార్డుకు తరలించారు. లోపల ధ్వంస మైన టన్నెల్ బోరింగ్ మిషన్ యంత్రం అవశేషాలను బయటకు తరలించారు. టన్నెల్ కూలిన ప్రదేశంలో 43 మీటర్ల మార్గాన్ని మూసివేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఎస్ఎల్ బీసీలో సహాయ పనుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
13 మంది సభ్యులతో సాంకేతిక కమిటీ
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో సహాయ పనులను కొనసాగించడానికి 13 మంది సభ్యులతో సాంకేతిక కమిటీని నియమించారు.ఈ నిపుణుల కమిటీలో పలు జాతీయ సంస్థల ప్రతినిధులు, కల్నల్ పరీక్షిత్ మెహ్రాకు స్థానం కల్పించారు. టన్నెల్ లోపల తదుపరి పనులను ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. టన్నెల్ కూలిన ప్రాంతంలో 43 మీటర్ల మేర తవ్వాలా వద్దా అనే విషయంలో ఈ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.టన్నెల్ లో డ్రిల్ బ్లాస్ట్ పద్ధతి ద్వారా చేపట్టాలని నిపుణులు భావిస్తున్నారు. ఉపరితలం నుంచి సొరంగం వరకు రోడ్డు నిర్మించడానికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫాసెస్ట్ నుంచి అనుమతులు పొందాలని నిర్ణయించారు.భూమి పొరల నిర్మాణాన్ని అంచనా వేయడానికి బోర్ వెల్స్ వేయాలని నిర్ణయించారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
ఎస్ఎల్ బీసీలో జాడలేని ఆరుగురి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆరుగురి మృతదేహాలు లభించకున్నా, వారి కుటుంబాలకు సహాయం అందించాలని నిర్ణయించారు.ఫిబ్రరి 22వతేదీన టన్నెల్ కూలినపుడు 8 మంది చిక్కుకు పోగా, వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఆరు మృతదేహాలు లోపలే కూరుకుపోయాయి.
దిండి రిజర్వాయర్ వైపు నుంచి తవ్వకాలు?
శ్రీశైలం జలాశయం వైపు భూమి షీర్ జోన్ ఉన్నందున కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 44 కిలోమీటర్ల సొరంగ ప్రాజెక్టులో మిగిలి ఉన్న 9 కిలోమీటర్ల దూరం శ్రీశైలం జలాశయం వైపు నుంచి కాకుండా దిండి రిజర్వాయర్ వైపు నుంచి 9.550 కిలోమీటర్ల దూరం తవ్వి సాగునీరు అందించాలని యోచిస్తున్నారు.
Next Story