పాలమూరుకు కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ రాలేదు: కేసీఆర్
x

పాలమూరుకు కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ రాలేదు: కేసీఆర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నాయన్న కేసీఆర్.


పాలమూరు జిల్లాకు ఎప్పుడూ అన్యాయమే జరిగిందని, ఇప్పటికి కూడా అదే జరుగుతుంనది మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పాలమూరుపై ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా కొత్తది కాదని కేసీఆర్ చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే అసలు బీఆర్ఎస్ఎల్‌పీ నిర్వహించడానికి ప్రధాన అజెండా పాలమూరు రంగారెడ్డి ఎత్తపోతల పథకం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడమేనని చెప్పారు.

పాలమూరు జిల్లా చరిత్రాత్మకంగా తీవ్ర అన్యాయానికి గురవుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ, సాగునీటి విషయంలో పాలమూరు జిల్లాకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాంతానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కొత్తవి కావని, గతంలోనే నీటి కేటాయింపులు జరిగినవేనని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, ట్రిబ్యునల్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయని గుర్తుచేశారు.

బచావత్ ట్రిబ్యునల్ పాలమూరు ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని స్పష్టంగా ప్రకటించిందని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్ర పాలకులు నీటి కేటాయింపులు చేయకపోయినా, బచావత్ ట్రిబ్యునల్ సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసిందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ న్యాయం జరగలేదని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నప్పటికీ, వాస్తవంగా ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని కేసీఆర్ ఆరోపించారు. పునాది రాళ్లు వేయడం తప్ప పాలమూరు అభివృద్ధికి ఆయన చేసింది ఏమీలేదని అన్నారు. ఉద్యమ సమయంలో తాను పాలమూరు జిల్లాలో పర్యటించినప్పుడే ఈ అన్యాయాన్ని ప్రజల ముందుంచానని కేసీఆర్ తెలిపారు. పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆ జిల్లాకు ఇప్పటివరకు ఏమి చేశారని పరోక్షంగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయం కొత్త తరానికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ విషయాలను ప్రజల ముందుంచుతున్నానని ఆయన తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పాలమూరు అంశాన్ని కేంద్రబిందువుగా మార్చాయి.

Read More
Next Story