అంతా చూస్తుండగనే  ఆమ్మా, నాన్న వరదల్లో కొట్టుకుపోయారు!
x
వరదనీటి కొట్టుకుపోతుండగా షరీఫ్ ను కాపాడిన యువకులు

అంతా చూస్తుండగనే ఆమ్మా, నాన్న వరదల్లో కొట్టుకుపోయారు!

పాలేరు జలప్రళయం యాకూబ్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇటుకలు తయారు చేస్తూ, జీవనం గడుపుతున్న యాకూబ్, సైదాబీలు వరదనీటిలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు.


ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన పాలేరు జలాశయం చెంత నివాసముంటున్న యాకూబ్ దంపతులు వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. మోతే మండలం కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, సైదాబీ దంపతులకు యూసుఫ్, షరీఫ్ లనే ఇద్దరు కుమారులున్నారు. పొట్ట చేతపట్టుకొని కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి వలస వచ్చి పాలేరు చెంత సిమెంటు ఇటుకల తయారీ యూనిట్ పెట్టి జీవనం గడుపుతున్నారు.


తెల్లారేసరికల్లా చుట్టూ చేరిన వరదనీరు
భారీవర్షాలతో,పాలేరు జలాశయంలో వరద వెల్లువెత్తింది. రోజూలాగే తెల్లవారుజామున అయిదున్నర గంటలకు యాకూబ్, సైదాబీ, కుమారుడు షరీఫ్ లు నిద్ర లేచే సరికి ఇంటి చుట్టూ పాలేరు వరదనీరు చుట్టుముట్టింది.వేగంగా ప్రవహిస్తున్న వరదనీటిలో నుంచి బయటపడే దారి లేక, దిక్కు తోచక వారు ముగ్గురూ రేకుల ఇంటిపైకి ఎక్కారు. ఆపరేషన్ చేయించుకొని నెలరోజులే అయినా సైదాబీ ధైర్యాన్ని తెచ్చుకొని వరదనీటి మధ్యలో ఎటూ వెళ్లలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రేకుల ఇంటిపైకి ఎక్కారు. ఎవరైనా వచ్చి తమను కాపాడుతారనే ఆశతో ప్రవాహం మధ్య ఇంటిపైన నిలబడి హాహాకారాలు చేశారు.

8 గంటలు వరదనీటి మధ్య గోడపైనే...
వరదనీటి ప్రవాహం మధ్య బిక్కుబిక్కుమంటూ వర్షం కురుస్తుండగా ఇంటిపై తడుస్తూ తెల్లవారుజామున అయిదున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల దాకా 8గంటల పాటు నిలబడ్డారు. తమ కళ్ల ముందే వరదనీటి ఉధృతికి రేకుల ఇల్లు మూడు గదులు కొట్టుకు పోగా కేవలం ఒక్క గోడ మాత్రమే మిగిలింది. అంతే ఆ ఒక్క గోడపైనే వారు ముగ్గురు నిలబడి తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు.

వరదనీటిలో గోడపై ఉన్న యాకూబ్ దంపతులు


డ్రోన్ల ద్వారా లైఫ్ జాకెట్లు పంపారు...

కూసుమంచి నాయకన్ గూడెం గ్రామంలో సిమెంటు బ్రిక్స్ వ్యాపారం నడుపుతున్న యాకూబ్ ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంటవరకు డ్రోన్ సాయంతో మొబైల్, లైఫ్ జాకెట్లు పంపించారు. ఎన్నడూ రాని వరద ఒక్కసారిగా రావడంతో తెల్లవారుజామున 5.30 గంటలకే రేకుల ఇంటిమీదకు ఎక్కారు.తమను ఎవరైనా కాపాడుతారని గంటల తరబడి వేచిచూసిన యాకూబ్ దంపతులను వరద ప్రవాహం అధికంగా ఉండటంతో రెస్య్కూ టీం సభ్యులు వచ్చినా, వారు నీటిలో వెళ్లలేమని వారు చేతులెత్తేశారు.గోడ ఎక్కి నిలబడి ఫోన్ లో తమను కాపాడమని దండాలు పెట్టినా ఎవరూ కాపాడలేదు.వారు ఫోనులో ఆర్తనాదాలు చేశారు. 8గంటల పాటు గోడపైనే నీటి మధ్య ఉన్న వారు నిలబడిన గోడ కొట్టుకుపోవడంతో వారు ముగ్గురు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు.

మరణించిన యాకూబ్, సైదాబీలు


యువకులు కాపాడారు...

గోడపడిపోగానే వరదనీటిలో యాకూబ్, సైదాబీ, కుమారుడు షరీఫ్ కొట్టుకుపోయారు.యాకూబ్ లైఫ్ జాకెట్ వరదనీటిలో తేలింది. తల్లి సైదాబీతో కలిసి కుమారుడు షరీఫ్ వరదనీటిలో కొంత దూరం కొట్టుకువచ్చారు. వరద ధాటికి తల్లి కూడా కనిపించలేదు.తల్లిదండ్రులిద్దరి లైఫ్ జాకెట్లు విడిపోగా వారు వరదలో కొట్టుకుపోతూ చెట్ల వద్ద మునిగి ప్రాణాలు కోల్పోయారు. షరీఫ్ కిలోమీటరు దూరంలోని సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారిలో వంతెన వద్దకు కొట్టుకువచ్చాడు. అంతే పాలేరు వంతెన వద్ద ఉన్న యువకులు షరీఫ్ ను తాళ్లతో పట్టుకొని పైకి లాగి రక్షించారు.

యాకూబ్ మృతదేహాన్ని తరలిస్తున్న గ్రామస్థులు


విగత జీవులుగా మారిన యాకూబ్ సైదాబీలు

యాకూబ్, సైదాబీల ప్రాణాలు ప్రజలందరూ చూస్తుండగానే వరదనీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వరద తగ్గాక యాకూబ్, సైదాబీల మృతదేహాలు చెట్లు, ఫెన్సింగ్ వద్ద దొరికాయి. దంపతులిద్దరూ మరణించడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనాథ పిల్లల్ని అయినా ప్రభుత్వం ఆదుకోవాలని యాకూబ్ బంధువులు కోరారు. బెంగళూరు యాకూబ్ కుటుంబం ఒక్కో మెట్టు ఎక్కుతూ పిల్లల్ని చదివిస్తూ బెంగళూరు అనారోగ్యంతో ఖమ్మం వచ్చాడు. విగతజీవులుగా మారారు, తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో జలప్రళయం యాకూబ్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

కన్నీటిపర్యంతమైన మంత్రి పొంగులేటి
తన సొంత పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యాకూబ్, సైదాబీలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు సార్లు ఫోనులో మాట్లాడినా వారిని కాపాడలేక పోయానని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. వరదనీటి ఫ్రషర్ వల్ల రెస్క్యూ టీం, గతఈతగాళ్లు కూడా వెళ్లలేక పోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వారిని కాపాడేందుకు డిఫెన్సు, నేవీ, హకీంపేట హెలికాప్టరును పంపించాలని తాను కోరినా భారీవర్షం మధ్య టేకాఫ్ తీసుకోలేమని వారు చెప్పారని మంత్రి తెలిపారు. వరదనీటి మధ్యలో చిక్కుకున్న యాకూబ్ దంపతులను తాము కాపాడలేక పోయామని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.

నా కుమార్తె, అల్లుడ్ని ఎవరూ కాపాడలేదు...
తన కుమార్తె సైదాబీ, అల్లుడు యాకూబ్ వరదనీటిలో 8 గంటలు గడిపారని, కానీ ఎవరూ కాపాడలేక పోయారని సైదాబీ తల్లి కాశింబీ ఆవేదనగా చెప్పారు. తన కుమార్తె సైదాబీకి నెలరోజుల క్రితమే ఆపరేషన్ అయిందని, వరదనీటి మధ్య గోడపై 8 గంటలు నిలబడినా ప్రాణాలు దక్కలేదని కాశింబీ పేర్కొన్నారు. చుట్టూ వరదనీరు కమ్ముకుంటుందని, తాము క్షేమంగా ఇంటిపైన ఉంటామని తన కుమార్తె సైదాబీ ఫోనులో చెప్పిందని గుర్తుచేసుకొని కాశింబీ కళ్లనీళ్ల పర్యంతమయ్యారు.

అనాథ పిల్లల్ని ఆదుకోండి
తన కుమార్తె, అల్లుడు వరదల్లో కొట్టుకు పోయి మరణించడంతో యూసుఫ్, షరీఫ్ అనాథలుగా మారారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కాశింబీ అభ్యర్థించారు. తన మనవళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి నష్టపోయిన ఇంటికి ఆర్థిక సాయం అందించాలని ఆమె కోరారు. ఇద్దరు పిల్లలను ఆదుకోవాలని యాకూబ్ బంధువు జానీ కోరారు. యూసుఫ్,షరీఫ్ లు ఇంజినీరింగ్ చదువుతున్నారని, వారి చదువుకు ప్రభుత్వం ఆదుకోవాలని మృతుల బంధువులు కోరారు.

ప్రాణాపాయం నుంచి బయటపడ్డా...
తాను వరదనీటిలో కొట్టుకుపోతుండగా యువకులు కాపాడారని షరీఫ్ చెప్పారు.‘‘ ఉదయాన్నే లేవగానే పాలేరు రిజర్వాయరు నుంచి వరదనీరు పోటెత్తింది. దీంతో రేకుల పైకి ఎక్కాం, 8 గంటలపాటు నిరీక్షించి వరదలో కొట్టుకుపోయామని షరీఫ్ చెప్పారు. తాను ప్రాణాలతో బయటపడగా, తన తల్లిదండ్రులు తన కళ్లముందే వరదల్లో కొట్టుకుపోయారని షరీఫ్ ఆవేదనగా చెప్పారు. తాను వరదనీటిలో నుంచి బయటపడతానని అనుకోలేదని షరీఫ్ విలపిస్తూ చెప్పారు.




Read More
Next Story