తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమన పేరే సమంజసం
తెలుగు విశ్వవిద్యాలయానికి ఆదికవి పాల్కురికి సోమన పేరే సమంజసం! అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం, ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్ 31.08.2024 ఉదయం 11.00 గం.
తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు, సాహిత్య ప్రియులు గర్వించదగ్గ అత్యంత గొప్ప తెలుగు సాహిత్య సృష్టికర్త పాల్కురికి సోమన. ఈయన తెలుగు సాహిత్య చరిత్రకు తెలిసిన మొట్టమొదటి ప్రజాకవి. అంటే సామాన్య ప్రజలు మహత్తరమైన విషయాలను అలవోకగా ఆలపిస్తూ ఆసక్తికరంగా తెలుసుకోవడానికి వీలు కల్పించే 'ద్విపద' పద్యాల్లో సాహిత్యం సృష్టించారు. ఆయనకు ముందు నాలుగు పాదాలుండే వృత్తపద్యాల్లో, సంస్కృత పదభూయిష్టమై ఉండే "మార్గ" కవితను వెలయించారు.
నన్నయ, తిక్కన మొదలైన కవులు, వారి కవిత్వం గొప్పదైనా సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు కాబట్టి ఇది ప్రయోజనం తక్కువ గలదని
"ఉరుతర గద్యపద్యోక్తుల కంటే
సరసమై పరగిన జాను తెనుంగు
చర్చించగా సర్వసామాన్యమగుట"
అంటూ సర్వసామాన్యంగా ప్రజలందరికీ అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో "దేశీ" కవిత్వం రాశాడు సోమన. అసలు "తెలుగు" అనే పదాన్నే మొదటిసారిగా వాడింది సోమన. ఆయన ముందు కాలపు కవులు తెనుంగు, తెలుంగు అనే పదాలు వాడారు.
తెలుగుతో పాటు అష్ట భాషల్లో ప్రవీణుడు సోమన. కన్నడ, సంస్కృత భాషల్లో కూడా సుమారు డజను పుస్తకాలు రాశారు. ఈ మూడు భాషల్లో కూడా సుమారు డజను పుస్తకాలు రాశారు. ఈ మూడు భాషల్లోనూ అనేక సాహిత్య ప్రక్రియలు ప్రవేశపెట్టారు. ఒక కవి లేదా మేధావి ఒక ప్రక్రియకు ఆద్యుడంటేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది ఒకే వ్యక్తి తన జీవితకాలంలోనే సుమారు డజను సాహిత్య ప్రక్రియలు ప్రారంభించాడంటే ఎంత గొప్ప విషయమో ఊహించలేము కూడా. సోమన ప్రవేశపెట్టిన సాహిత్య ప్రక్రియలు - సీసాలు, ఉదాహరణలు, రగడలు, అష్టకాలు, స్తవాలు, గద్యలు, వ్యక్తి చరిత్రలు, యాత్రా చరిత్రలు, విశేష వృత్తాలు, ద్విపద కందం, శతకం, మొదలైనవి.
ప్రజలందరికీ మతాన్ని/ దేవున్ని అందుబాటులోకి తెచ్చిన వీర శైవ మత స్థాపకుడు బసవేశ్వరుని చరిత్రను "బసవ పురాణం" పేరుతో సామాన్య ప్రజలు అర్థయుక్తంగా పాడుకునే రీతిలో రాశాడు సోమన. ఇది పండితులను కూడా బాగా ఆకర్షించింది. దీనిని నాటి కాకతీయ రాజధాని ఓరుగల్లులోని అత్యంత ప్రధానమైన స్వయంభూ దేవాలయంలో పండితులందరూ పారాయణం చేసేవారని చెప్పే ఆధారాలున్నాయి. ఈ విషయం రాజు ప్రజాపరుద్రునికి కూడా తెలుసు. ఆయన కూడా సోమనను బాగా గౌరవించేవారు.
సోమన రాజ పోషణను స్వీకరించకపోయినా అతని మంత్రి ద్వారా ఆయనకు చెప్పి తన మిత్రుడు శివరాత్రి కొప్పయ్యకు 'లోకిపర్రు' అనే అగ్రహారాన్ని ఇప్పించాడు. సోమన రాసిన సుమారు 30 గ్రంధాలూ నక్షత్రాల్లాంటివే. అయినా వాటిల్లో చంద్రుడు వంటి కావ్యం 'పండితారాధ్య చరిత్ర'. ఇది తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం వంటి గ్రంధరాజమని విజ్ఞులు అందరూ ప్రశంసించారు. అందులో అతి సామాన్య విషయం నుంచి అత్యంత గొప్ప విషయం వరకు ఆనాటి.. క్రీ.శ.1280 ప్రాంతం నాటి తెలుగు సాంస్కృతిక అంశాలు అన్నీ వివరించబడ్డాయి. ప్రజల జీవన విధానం, కళలు, రాజకీయాంశాలు ... ఒకటేమిటి? 'ఒక్క వ్యక్తికి ఇన్ని అంశాల్లో ప్రావీణ్యం ఉండటం సాధ్యమా!' అని ఆశ్చర్యపోతాం.
సోమన అంతగొప్పవాడు కాబట్టి తన జీవితకాంలోనే ఆయన గ్రంధాలు అనేకం పారాయణ గ్రంథాలు అయ్యాయి. సామాన్య భక్తులు, ప్రత్యేకించి వీరశైవ మతానుయాయులు ఆయన స్తోత్ర గ్రంధాలను పఠించేవారు. క్రమంగా పాల్కురికి ప్రచారం చేసిన కుల-లింగ వివక్ష లేని వీరశైవ మతం రాజుల దృష్టినీ ఆకర్షించింది. కాబట్టి సామాన్య ప్రజలు వీరశైవ మతానుయాయులు బాగా పర్యటించే నల్లమల అడవుల్లోని శైవాలయాలను రాజులు బాగా వృద్ధి చేశారు. అలా నల్లమల అడవుల ప్రారంభంలో ఉన్న ఉమామహేశ్వర క్షేత్రాన్ని పద్మనాయక రాజు మాదానాయకుడు 14వ శతాబ్దంలో శిల్పకళా శోభాయమానంగా తీర్చిదిద్ది భక్తులకు అనేక పనుతులు ఏర్పాటు చేశాడు. శ్రీశైలానికి ఉత్తర ద్వార క్షేత్రంగా కీర్తించబడుతున్న ఈ క్షేత్రం నుంచి కృష్ణా నది తీరం వరకు నల్లమల అడవుల గుండా భక్తులు సురక్షితంగా శ్రీశైలం చేరుకోవడానికి వీలుగా సుమారు 40 కిలోమీటర్ల దూరం రాతిమెట్లు (జాతర రేవు వరకు) కట్టించాడు.
ఉమామహేశ్వరంతో పాటు సుమారు 400 శైవ క్షేత్రాలను సోమన 'పండితారాధ్య చరిత్ర'లోని 'పర్వత ప్రకరణం'లో పేర్కొన్నారు. వాటిల్లో సుమారు 20 స్థలాలు ఇప్పటికీ పర్యాటకానికి అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దశాబ్దంలో 107 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వాటితో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుకు "పాల్కురికి సోమన పర్యాటక ప్రాజెక్టు" అని పేరు పెడితే సోమనను సముచితంగా గౌరవించుకున్న వాళ్లమవుతాం. అలాగే ఆయన ఊరు పాలకుర్తిని కూడా స్మారక పర్యాటక క్షేత్రంగా ఇంకా అభివృద్ధి చేయాలి.
మొట్టమొదటిసారిగా తెలుగువారి జీవన వైవిధ్యాలను, సాంస్కృతిక విశేషాలను అక్షరబద్ధం చేసిన వ్యక్తి కాబట్టి వాటిని అధ్యయనం చేసే తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమన పేరును పెడితే మన సంస్కృతి పరిరక్షులకు మనం పెద్దపీట వేసినవాళ్లమవుతాం. పైగా ఇప్పుడున్న పి.ఎస్. అంటే పొట్టి శ్రీరాములుకు సూచించే ఆంగ్ల అక్షరాలను మార్చవలసిన అవసరమూ ఉండదు. ఎందుకంటే, అవే అక్షరాలు పాల్కురికి సోమనకూ వర్తిస్తాయి కాబట్టి.
ఎవరో రాసిన అర్ధం కాని సంస్కృత శ్లోకాలను, మంత్రాలను తెలంగాణ శివాలయాల్లో జపించడం కంటే మన సోమన మనకు అర్ధమయ్యే భాషలో పాడుకునే రీతిలో రాసిన శివస్తోత్రాలను, ప్రతులను ప్రతి శివాలయానికి పంపించి వాటినే పఠిస్తే దేవున్ని తెలిసి చేరుకోవచ్చు. పాల్కురికి పక్కనే ఉన్న బమ్మెర పోతన స్మారక మందిరంతో పాల్కురికి పీఠాన్ని కూడా కలిపి కొన్నేండ్ల పాటు వారి అమోఘమైన రచనల్లోని విశేషాలపై అధ్యయనం చేయించి ప్రచురిస్తే మళ్లీ సామాన్య ప్రజలకు అసామాన్యమైన విషయాలు తెలిసి మన ఆత్మ విశ్వాసం పెరిగే అవకాశముంటుంది. చారిత్రక పురుషుల ద్వారా జరిగే అసలు మేలు అదే కదా!