ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య ‘దొంగకోళ్ళ’ పంచాయితి
x
Chicken Theft

ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య ‘దొంగకోళ్ళ’ పంచాయితి

తనకోళ్ళను పిల్లివెంకటేశ్వర్లు దొంగతనం చేసినట్లు యజమాని తెలుసుకున్నాడు


ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య దొంగకోళ్ళ పంచాయితీ మొదలైంది. దొంగకోళ్ళ దొంగను పట్టుకోవటంతో పాటు కోళ్ళను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ పోలీసులు తెలంగాణలోకి రావటం పెద్ద వివాదంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో పట్టయిగూడెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రంగనాధ్ అనే వ్యక్తికి చెందిన కోళ్ళను పదిరోజుల క్రితం దొంగలు ఎత్తుకెళ్ళారు. కోళ్ళదొంగతనం జరిగిన విషయాన్ని రంగనాధ్ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఇవ్వటమే కాకుండా సొంతంగా డిటెక్టివ్ పని కూడా మొదలుపెట్టాడు. దొంగతనం జరిగిన కోళ్ళ విషయంలో యజమాని ఎందుకు ఇంత శ్రద్ధచూపించాడు ? ఎందుకంటే దొంగతనం జరిగినవి పందెం కోళ్ళు కాబట్టే. రాబోయే సంక్రాంతి పండుగకు పందెంకోళ్ళను రంగనాధ్ సిద్ధంచేస్తున్నాడు.

ఫిర్యాదు ఇచ్చిన కొద్దిరోజులకు తనకోళ్ళను పిల్లివెంకటేశ్వర్లు దొంగతనం చేసినట్లు యజమాని తెలుసుకున్నాడు. దొంగలించిన కోళ్ళలో రెండింటిని వెంకటేశ్వర్లు దమ్మపేట మండలానికి చెందిన గోపవరపు శేషగిరికి అమ్మాడని కూడా తెలుసుకున్నాడు. దమ్మపేట అంటే భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోకి వస్తుంది. భద్రాద్రి జిల్లా అంటే తెలంగాణలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. తాను తెలుసుకున్న విషయాలను కోళ్ళ యజమాని పోలీసులతో చెప్పాడు. సోమవారం సాయంత్రం చింతలపూడి స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఒక హోంగార్డును వెంటపెట్టుకుని యజమాని ఒక కారులో దమ్మపేటకు చేరుకున్నాడు. కానిస్టేబుళ్ళు ప్రయాణించిన కారుతో పాటు మరో మూడు కార్లలో యజమాని మనుషులు కూడా దమ్మపేటకు చేరుకున్నారు.

దమ్మపేటలోకి ఎంటరవ్వగానే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే శేషగిరి ఇంటిఅడ్రస్ కనుక్కున్న పోలీసులు అతనింటికి చేరుకున్నారు. ఆసమయంలో శేషగిరి ఇంట్లో లేకపోవటంతో ఆడవాళ్ళతోనే పోలీసులు మాట్లాడారు. ఎంతైనా పోలీసులు కదా తమ సహజస్వభావంతో శేషగిరి భార్య రాజేశ్వరితో పాటు మిగిలిన ఆడవాళ్ళతో బాగా దురుసుగా వ్యవహరించారు. దొంగకోళ్ళు, కేసు, జైలంటు భయపెట్టారు. కాంపౌండులోకి ప్రవేశించిన వెంటనే పోలీసులు కాంపౌండు గేట్లు మూసేసి, సీసీ కెమెరాలు, హార్డు డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇల్లు మొత్తం వెతికారు. ఒకచోట రెండు కోళ్ళు కట్టేసుండటాన్ని గమనించారు. దొంగకోళ్ళను శేషగిరి ఎందుకు కొన్నాడని రాజేశ్వరిని బెదిరించారు. బెదిరించటమే కాకుండా కోళ్ళను పట్టుకుని తమ కారులో పెట్టుకున్నారు.

శేషగిరి ఇంటికి పోలీసులు కార్లలో రావటాన్ని చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. లోపల ఏమిజరుగుతోందో తెలుసుకునేందుకు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఇంటిముందు చేరారు. రాజేశ్వరని పోలీసులు బెదిరించటాన్ని చూసిన స్ధానికులు రెచ్చిపోయి గోలమొదలుపెట్టారు. పోలీసులను ఇంటిలోపల నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. మరికొందరు దమ్మపేట పోలీసులకు విషయాన్ని చేరవేశారు. దాంతో వెంటనే దమ్మపేట పోలీసులు శేషగిరి ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న దమ్మపేట పోలీసులు చింతలపూడి పోలీసులతో పాటు కార్లలో వచ్చిన వ్యక్తులను, కోళ్ళతో సహా దమ్మపేట పోలీసుస్టేషన్ కు తీసుకెళ్ళారు. స్టేషన్లో ఉంచి అందరినీ విచారణ మొదలుపెట్టారు.

అయితే విషయం తెలుసుకున్న కొద్దిసేపటికే చింతలపూడి స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో దమ్మపేట స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్లోని పోలీసులతో మాట్లాడి అందరినీ విడిపించి తీసుకెళ్ళిపోయారు. పిల్లి వెంకటేశ్వర్లు నుండి శేషగిరి రెండు పందెంకోళ్ళను కొన్నట్లు తెలిసింది. అయితే తానుకొన్న పందెంకోళ్ళను దమ్మపేటలోనే మరో వ్యక్తి ఇంట్లో ఉంచి ఆ వ్యక్తికి చెందిన రెండుకోళ్ళను తనింట్లో పెట్టుకున్నాడు. ఇలాగ ఎందుకు చేశాడో శేషగిరే చెప్పాలి. దమ్మపేటకు చింతలపూడి పోలీసులు రావటం, దొంగకోళ్ళగురించి విచారిస్తున్న విషయం తెలియగానే వెంకటేశ్వర్లు తాను దొంగలించిన కోళ్ళను ఊరిశివార్లలో వదిలేసి పారిపోయినట్లు స్ధానికులు చెబుతున్నారు. జరిగిన ఘటనపై ఏపీ, తెలంగాణ పోలీసుల్లో ఎవరూ నోరిప్పటంలేదు. దొంగకోళ్ళతో మొదలైన ఏపీ-తెలంగాణ పోలీసుల పంచాయితీ చివరకు ఎలాగ ముగుస్తుందో చూడాలి.

Read More
Next Story