Patnam ! కలెక్టర్ మీద దాడికేసులో పట్నం అరెస్ట్
చుట్టుముట్టిన వారు ఎవరు ? ఎందుకు చుట్టుముట్టారనే విషయాన్ని మిగిలిన జనాలు వాకాబు చేసేలోపలే పట్నంను ఎత్తి వాహనంలో వేసుకుని పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
వికారాబాద్ కలెక్టర్ మీద దాడికేసులో పోలీసులు పట్నం నరేంద్రరెడ్డి(Patnam Narendar Rdeddy)ని అరెస్టుచేశారు. బుధవారం ఉదయం కేబీఆర్ పార్కు(KBR Park)లో వాకింగ్ చేస్తున్న మాజీ ఎంఎల్ఏని పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. పట్నంతో పాటు వాకింగ్ చేస్తున్న మిగిలిన వారికి అక్కడ ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు. పట్నంను చుట్టుముట్టిన వారు ఎవరు ? ఎందుకు చుట్టుముట్టారనే విషయాన్ని మిగిలిన జనాలు వాకాబు చేసేలోపలే పట్నంను ఎత్తి వాహనంలో వేసుకుని పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అంతా నిముషంలోపే జరిగిపోయింది. ఇంతకీ పట్నంను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు ? ఎందుకంటే వికారాబాద్(Vikarabad Collector Pratik Jain) లో సోమవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడిలో పట్నందే కీలకపాత్రగా పోలీసులు గుర్తించారు.
ఫార్మా పార్క్ ఏర్పాటు విషయంలో గ్రామసభ నిర్వహించేందుకు కలెక్టర్ తన అధికారులతో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల(Lagacharla village) గ్రామానికి వెళ్ళినపుడు గ్రామస్తులు కలెక్టర్ పైన దాడిచేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ మీద దాడిజరగటం అన్నది పెద్ద సంచలనమైపోయింది. ఏదో ఆవేశంలో గ్రామస్తులు దాడిచేసినట్లు కాకుండా ముందస్తు వ్యూహం ప్రకారమే కలెక్టర్ పైన దాడిచేయటమే కాకుండా వెంటపడి తరిమి, వాళ్ళు ఎక్కిన కార్లను కూడా గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఇవన్నీ వెంటవెంటనే జరగటంతో గ్రామస్తుల ముసుగులో కొందరు కావాలనే కలెక్టర్ మీద దాడిచేసినట్లు అందరికీ అర్ధమైంది. తర్వాత దాడి ఘటన వీడియోలను చూసినపుడు సురేష్ అనే బీఆర్ఎస్(BRS) నేత కనబడ్డాడు. గ్రామస్తుల ముసుగులో సురేష్(Suresh) కూడా గుంపులో చేరిపోయి కొందరిని రెచ్చగొట్టి దాడికి కారకుడయ్యాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాడి జరిగిన కొద్దిసేపటికే సురేష్ మాయమైపోయాడు.
సురేష్ ను పట్టుకునేందుకు పోలీసులు అతని మొబైల్ ఫోన్ను ట్రాకింగ్ లో పెట్టారు. అంతేకాకుండా ఫోన్ ను విశ్లేషించినపుడు పట్నం నరేంద్రరెడ్డి, సురేష్ దాడికి ముందురోజు చాలాసార్లు మాట్లాడుకున్నట్లు బయటపడింది. అందులో కొన్నిసార్లు సురేష్ ను లైనులో పెట్టుకుని పట్నం మరో మొబైల్ ఫోన్ ద్వారా బీఆర్ఎస్ కీలకనేతతో మాట్లాడిన విషయం కూడా పోలీసులకు తెలిసిందని సమాచారం. దాంతో కలెక్టర్ మీద జరిగిన దాడి గ్రామస్తులు చేసింది కాదని గ్రామస్తుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు చేసిన ముందస్తు వ్యూహంగానే పోలీసులు భావిస్తున్నారు. అందుకనే బుధవారం ఉదయం నరేంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చేసింది. ఎప్పుడైతే పట్నంను పోలీసులు అరెస్టు చేశారో వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), హరీష్ రావు(Harish Rao) తదితరులు గోల మొదలుపెట్టేశారు. పట్నం అరెస్టు రేవంత్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనమంటు రచ్చచేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పట్నం నరేంద్రరెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బాగా సన్నిహితుడు. 2018 ఎన్నికల్లో కొడంగల్(Kodangal) లో రేవంత్(Revanth Reddy) కు వ్యతిరేకంగా పట్నం పోటీచేసి గెలిచాడు. అప్పట్లో పట్నంను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులు లేవు. రేవంత్ ను హౌస్ అరెస్టు చేసి, ప్రచారం పై ఆంక్షలు పెట్టి, ఇంట్లో సోదాలు చేయటం ద్వారా నానా కంపుచేసి పట్నంను గెలిపించుకున్నారు. ఇదంతా ఎందుకు చేశారంటే అప్పట్లో పట్నం మహేందర రెడ్డికి కేసీర్(KCR) అత్యంత సన్నిహితుడు కాబట్టే. పట్నం మహేందర్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి స్వయానా తమ్ముడు అవుతాడు. అయితే మారిన పరిస్థితుల్లో పట్నం మహేందర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. అన్న పట్నం మహేందరరెడ్డి ఏమో రేవంత్ కు బాగా సన్నిహితుడిగా కాంగ్రెస్ లో ఉన్నారు. తమ్ముడు పట్నం ఏమో కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితుడిగా బీఆర్ఎస్ లో ఉన్నాడు. తాజాగా పట్నం అరెస్టుతో ఇంకెవరి పాత్రలు బయటపడతాయో చూడాలి.