
సినిమాకు కష్టపడటమే తెలుసు..చెప్పుకోవడం రాదు-పవన్
హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో నిర్మాత ఎఎం రత్నం కష్టంపై హీరో ,ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన
సినిమా కోసం కష్టపడటమే తెలుసుగాని , ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని చెప్పాలంటే తనకు మొహమాటంగా ఉంటుందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు.సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది తనకు తెలియదని చెప్పారు.రాజకీయాల పరంగా మీడియా ముందుకు రావడం అలవాటే గానీ , జీవితంలో మొట్టమొదటిసారి సినిమా పరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశానని అన్నారు. హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఎఎం రత్నం కష్టంపై తీవ్ర ఆవేదన
హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ నిజానికి ఈ రోజు సాయంత్రం ఉందని, అయినప్పటికీ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నిర్మాత ఏఎం రత్నం కోసమే పెట్టామని పవన్ వివరించారు. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎఎం రత్న మంటూ ఆయనకు ఆర్ధిక పరంగా ఇంత కష్టం రావడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. సినిమా బతకాలని చాలా తపన పడే వ్యక్తి ఆయన,ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో తపనపడ్డారని తెలిపారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొందని, షూటింగ్ చాలా ఆలస్యమైందని తెలిపారు.ఆయన తపన చూశాక ఈ సినిమాకు తాను ఎంత ఇవ్వగలనో అంత ఇచ్చానని, ఇందులో బెస్ట్ ఫర్మార్మెన్స్ చూపించానని పేర్కొన్నారు.ఈ సినిమా కోసం తాను ఎక్కువగా సమయం ఇవ్వలేనని చెప్పినా కష్టపడి షూటింగ్ పూర్తిచేశారని చిత్ర బృందాన్ని పవన్ కొనియాడారు. క్లైమాక్స్ కోసం ఏకంగా 55 రోజులు షూటింగ్ చేశామని తెలిపారు.తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ హరిహర వీరమల్లు సినిమా క్లైమాక్స్ కు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు.
కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ
తనకు సినిమా అన్నం పెట్టిందని, సినిమా అంటే తనకు ప్రాణవాయువుతో సమానం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.హరిహర వీరమల్లు సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందన్నారు .క్రిష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో ముందుకువచ్చారని , ఆయన కొన్ని కారణాల వల్ల సినిమాకు దూరమైనా ,ఆయనకు మా టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జ్యోతికృష్ణ తరువాత సినిమాను కొనసాగించారన్నారు.రత్నం ఎంతో ముందుచూపు ఉన్న నిర్మాత. ఆయన ఈ సినిమా కోసం ఎంతో నలిగిపోయారు.ఈ సినిమా పూర్తవుతుందా, లేదా? అని అనుకున్నప్పుడు దీనికి కీరవాణి ప్రాణం పోశారని పవన్ తెలిపారు. ఒక్కోసారి డబ్బులు, సక్సెస్ కోసం కాదు ఇండస్ట్రీ బాగుకోరే వ్యక్తుల వెంట నిలవడం ఎంతో ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా ఈ మీటింగ్‌కు వచ్చాను. ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా రత్నం పేరును ప్రతిపాదించానని పవన్ తెలిపారు.
సినిమాలో రాణించాలంటే ప్రతిభే ముఖ్యం
ఈ సినిమాలో బాబీదేవోల్ అద్భుతంగా చేశారు,ఈ సినిమా ప్రమోషన్‌ను నిధి తన భుజాలపై వేసుకుంది.ఈ సినిమా అనాథ కాదు, నేనున్నా అని చెప్పడానికే వచ్చానని పవన్ తెలిపారు.కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని, దేశ సమస్యల కోసం పోరాటాలు చేసేవాడిని,నా సినిమాకు అండగా ఉండలేనా అనిపించింది.అందుకే ఈ సినిమా ప్రచారంలో భాగం కావాలని వచ్చానన్నారు.మిగతా హీరోలకు బిజినెస్ అయినంతగా తన సినిమాలకు బిజినెస్ అవ్వదన్నారు.తన సినిమాల సమయంలో గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసంటూ , ఇప్పుడు తమ ప్రభుత్వం చిత్రపరిశ్రమను ఎంతో ఆదరిస్తోందన్నారు. భారతీయ సినిమాకు కుల, మత భేదాలు ఉండవని, క్రియేటివిటీ ,ప్రతిభపై మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. చిరంజీవి కుమారుడైనా, తమ్ముడైనా ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలబడరని, రేపు తన కుమారుడైనా అంతేనంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Next Story