కారు దిగిన పెద్దపల్లి ఎంపీ.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వెంకన్న
ఒక్క ఓటమి మరెన్నో పరిణామాలు.. తెలంగాణలో ఓడిన బీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు ఇస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది.
ఒక్క ఓటమి మరెన్నో పరిణామాలు.. తెలంగాణలో ఓడిన బీఆర్ఎస్ కు షాకులు మీద షాకులు ఇస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. సీఎంతో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేశ్.. అక్కడ వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.
ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, హస్తం పార్టీ ముఖ్య నేతల్ని కలిశారు వెంకటేశ్. వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వెంకటేష్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్న టార్గెట్‌తో.. బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్‌ను మారుస్తారన్న చర్చ పార్టీలో మొదలైంది.
వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలో నిలవబోతున్నారన్నది బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన తర్వాత పార్టీ నాయకత్వానికి వెంకటేష్‌కు కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా సమాచారం. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ స్థానంలో మరొకరిని బరిలోకి దింపే ఆలోచన అధిష్టానం చేస్తున్న తరుణంలో వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు.