మూడు నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక మొనగాడు
x
Pendyala Raghava Rao

మూడు నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక మొనగాడు

ఈ నేపధ్యంలోనే అప్పటివరకు కమ్యూనిస్టు ఉద్యమాల్లో, రైతాంగ పోరాటాల్లో బాగా చురుగ్గా పాల్గొంటున్న పెండ్యాల రాఘవరావు పేరు చర్చల్లోకి వచ్చింది.


అది 1952 మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయం. దేశమంతా స్వాతంత్ర్య పోరాటాల ఫలాల తాలూకు స్వేచ్చను అనుభవిస్తుంటే తెలంగాణాలో మాత్రం నిజాం వ్యతిరేక ఉద్యమాల తాలూకు రిలీఫ్ ఫీలవుతున్నారు జనాలు. అప్పుడే సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రముఖ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పోటీచేస్తున్నారు. కాళోజీకి వ్యతిరేకంగా ఎవరు పోటీచేస్తారా అని అందరు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాకవిగా కాళోజీ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పాపులర్. అందుకనే గట్టి ప్రత్యర్ధి ఎవరాని చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అప్పటివరకు కమ్యూనిస్టు ఉద్యమాల్లో, రైతాంగ పోరాటాల్లో బాగా చురుగ్గా పాల్గొంటున్న పెండ్యాల రాఘవరావు పేరు చర్చల్లోకి వచ్చింది.

వరంగల్ జిల్లాలోని చినపెండ్యాల గ్రామంలో బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో రాఘవరావు పుట్టారు. అప్పట్లో భూస్వమ్య కుటుంబంలో పుట్టారంటేనే బాగా స్ధితిమంతులనే అనుకోవాలి. అయితే స్తోమతతో సంబంధంలేకుండా 17వ సంవత్సరంలోనే సామాజిక అంశాలపైన బాగా స్పందించేవారు. అస్పృస్యత, మనుషులంతా ఒకటే అనే భావన బలపడింది. తన తండ్రి భావాలకు విరుద్ధంగా రాఘవరావు నడుచుకునేవారు. అందుకనే ఆర్యసమాజ్ లో చేరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా చురుగ్గా ఉండేవారు. మహాత్మాగాంధి పిలుపుతో అస్పృస్యతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాల్లో, రైతాంగ పోరాటాల్లో కూడా చురుగ్గా ఉండేవారు.

ఉద్యమాలే ఊపిరిగా బతికిన పెండ్యాల

1948 ప్రాంతంలో తెలంగాణాలో బాగా ఉధృదంగా జరిగిన రైంతాంగ పోరాటాన్ని అణిచేయటానికి నిజాం సైన్యం గ్రామాలపైన విరుచుకుపడింది. ఆ గొడవల్లో దాదాపు 4 వేలమంది ఉద్యమకారులు మరణించారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే పెండ్యాల తెలంగాణా మొత్తం తిరుగుతు ఉద్యమ జ్యోతి ఆరిపోకుండా తనవంతు ప్రయత్నాలు చేశారు. ఈ నేపధ్యంలోనే 1951లో వరంగల్ జిల్లాలోని మల్కాపూర్లో నిజాం సైన్యం పెండ్యాలను అరెస్టుచేసి జైల్లో పెట్టింది. తర్వాత కొంతకాలానికి పెండ్యాల విడుదలయ్యారు. విడుదల కూడా సరిగ్గా 1952 సాధారణ ఎన్నికలకు ముందు. అందుకనే జైలు నుండి విడుదలైన పెండ్యాల పైన అందరి దృష్టిపడింది. ఉద్యమకారుల్లో కీలకమైన నేతలంతా కలిసి పెండ్యాలను వరంగల్ పార్లమెంటుతో పాటు వర్ధన్నపేట, హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎల్ఏగా పోటీచేయటానికి ఒప్పించారు. దాంతో వరంగల్ ఎంపీ సీటులో కాంగ్రెస్ అభ్యర్ధిగా కాళోజీ పీడీఎఫ్ అభ్యర్ధిగా పెండ్యాల తలపడ్డారు.

అప్పటివరకు పెద్దఎత్తున జరిగిన ఉద్యమాల కారణంగా ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని బ్యాన్ చేసింది. దాంతో కమ్యూనిస్టు పార్టీకి ప్రత్యామ్నాయంగా పీడీఎఫ్ ఏర్పాటైంది. అందుకనే పెండ్యాల పీడీఎఫ్ అభ్యర్ధిగా పోటీచేయాల్సొచ్చింది. ఆ ఎన్నికల్లో వరంగల్ ఎంపీతో పాటు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వర్ధన్నపేట, హనుమకొండలో పోటీ హోరాహోరీగా జరిగింది. చివరకు ఎంపీగా, రెండు నియోజకవర్గాల్లో ఎంఎల్ఏగా పెండ్యాల గెలిచారు. ఎంపీగా కాళోజీ ఓడిపోవటం ఆయన అభిమానులను నిరుత్సాహపరిచినా మూడు నియోజకవర్గాల్లో పెండ్యాల గెలవటం ఈయన అభిమానులను సంతోషపరిచింది.

పెండ్యాల విజయాన్ని పొగిడిన కాళోజీ

పెండ్యాల సాధించిన విజయాన్ని ఓడిపోయిన కాళోజీ కూడా తన ఆత్మకథ ‘ఇది నా గొడవ’ లో గొప్ప విజయంగా చెప్పటమే కాళోజీ గొప్పతనానికి నిదర్శనం. ఇదే విషయాన్ని కాళోజీ ప్రస్తావిస్తు అప్పట్లో ఎంపీగానే కాకుండా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎల్ఏగా గెలిచిన పెండ్యాలది అరుదైన రికార్డన్నారు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలకు రాజీనామాచేసి ఎంపీగానే పెండ్యాల కంటిన్యు అయ్యారు. ఎంపీగా గెలిచిన పెండ్యాలకు 77,264 ఓట్లొస్తే ఓడిపోయిన తనకు 73,651 ఓట్లొచ్చినట్లు కాళోజీ తన ఆత్మకథలో రాశారు. అప్పటి ఎన్నికలో పెండ్యాల, కాళోజీతో పాటు సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన కే సోమయాజులుకు 35,591 ఓట్లొచ్చాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం 3,65,451 ఓట్లుంటే పోలైన ఓట్లు 1,86,506. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే పోలైన ఓట్లన్నీ వ్యాలీడ్ ఓట్లవ్వటమే.

అప్పట్లో పెండ్యాల సాధించిన విజయం ఎంత గొప్పదంటే అప్పటినుండి ఏ నేత కూడా ఒకేసారి ఎంపీ, ఎంఎల్ఏగా పోటీచేసి గెలవలేదు. తెలుగుదేశంపార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయార్ కూడా 1983 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీచేసి గెలిచారే కాని ఎంపీ, ఎంఎల్ఏగా పోటీచేయలేదు. అప్పట్లో ఎన్టీయార్ తిరుపతి, గుడివాడ నుండి గెలిచారు. తర్వాత్తర్వాత రెండు నియోజకవర్గాల నుండి పోటీచేసేంత స్ధాయున్న నేతలే తగ్గిపోయారు. చాలాసంవత్సరాల తర్వాత 2009లో పీఆర్పీ అధ్యక్షుడిగా చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీచేశారు. పాలకొల్లులో ఓడిపోయి తిరుపతిలో గెలిచారు. 2019లో ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడిగా గాజువాక, భీమవరంలో పోటీచేసినా రెండుచోట్లా ఓడిపోయారు. అందుకనే అప్పటినుండి ఇప్పటివరకు ఒకేసారి ఎంపి, రెండు అసెంబ్లీలకు పోటీచేసి గెలిచిన పెండ్యాల రాఘవరావు మొనగాడుగా మిగిలిపోయారు.

Read More
Next Story