
PF పెన్షన్‌దారులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు?
సీబీటీ సమావేశంలో కనీస పెన్షన్ ప్రస్తావనే లేకపోవడంపై పెన్షన్‌దారుల ఆగ్రహం
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పెన్షన్‌దారులంటే ఇంత నిర్లక్ష్యమా? PF సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (CBT) సమావేశంలో కనీస ప్రస్తావన తీసుకురారా? ఇదేం తీరు అంటూ లక్షలాది మంది పెన్షన్‌దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంట్రల్ బోర్డు సభ్యుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు చర్చించినా, కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నా తమ మొర ఆలకించరా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీబీటీ సమావేశం రెండు రోజుల కిందట ఢిల్లీలో జరిగింది. దాదాపు 15 అంశాలను చర్చించినా అందులో లక్షలాది మందికి ఉపయోగపడే కనీస పెన్షన్ పెంపు అంశం చర్చకు పెట్టకపోవడంపై వినియోగదారులు మండిపడ్డారు.
ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం ఉన్న Employees’ Pension Scheme (EPS) కింద నెలవారీ కనీస పెన్షన్‌ను ₹7,500కి పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కార్మిక శాఖ ప్రకటించింది. ప్రధాని కూడా సానుకూలంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం EPS-95 పథకంలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులు నెలకు కేవలం ₹1,000 మాత్రమే పొందుతున్నారు. జీవన వ్యయం పెరగడంతో ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం విషాదమని కార్మిక సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ మొత్తాన్ని ₹7,500కు పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.
2024 డిసెంబరు నాటికి కొత్త Centralized Pension Payments System (CPPS) అమలులోకి వచ్చింది. దాదాపు 68 లక్షలకిపైగా EPS పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు. ఈపీఎఫ్ అధికారిక లెక్క ప్రకారం దేశంలో 64, 93,923 పెన్షనర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కనీస పెన్షన్ రూ.1000లే పొందుతున్నారు. అత్యధికంగా అంటే 35 ఏళ్ల పైబడి సర్వీసు పూర్తి చేసిన వారు సైతం కేవలం రూ.7,500లే పెన్షన్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ ను రూ.7,500 చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా శీతారామన్ పార్లమెంటులో కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. చందాదారుల ప్రధాన డిమాండ్లను మరోసారి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎస్-95 పథకానికి చెందిన లక్షలాది మంది పెన్షన్‌దారులు ఎప్పటినుంచో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నెలకు కనీస పెన్షన్‌గా రూ.7,500 చెల్లించాలన్నది వారి డిమాండ్.
ఇటీవల జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని అంతా భావించారు. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయితే, సీబీటీలో ఈ అంశం చర్చించకపోయినప్పటికీ.. ఈ అంశం కేబినెట్ పరిశీలనలో ఉందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా చెబుతున్నారు.
సీబీటీ అజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ.. కార్మిక సంఘాల నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి పేర్కొన్నారు.
ఓ అంచనా ప్రకారం ₹25 లక్షల కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అధికారికంగా inoperative EPF ఖాతాల్లో మొత్తం ₹8,505.23 కోట్లు ఉంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకునేలా ప్లాన్ చేసిందని, అందుకే పెన్షన్ పెంపు విషయాన్ని పట్టించుకోవడం లేదని ఈపీఎఫ్ చందాదారుల తరఫున పోరాటం చేస్తున్న కే.ఎన్.రాజు తెలిపారు.
ఇక, తెలుగురాష్ట్రాలలో ఈపీఎఫ్ పెన్షన్దారులు సుమారు 8 నుంచి 9 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో EPS పెన్షనర్లు సుమారు 4–4.5 లక్షల మంది, తెలంగాణలో EPS పెన్షనర్లు సుమారు 3.5–4 లక్షల మంది ఉన్నట్టు ఈపీఎఫ్ 2022 వార్షిక నివేదిక ప్రకారం తెలుస్తోంది.
Next Story