Telangana | జనసంద్రంగా మారిన సాగరతీరం, తెలంగాణ తల్లికి జనం జేజేలు
x

Telangana | జనసంద్రంగా మారిన సాగరతీరం, తెలంగాణ తల్లికి జనం జేజేలు

హుసేన్ సాగర తీరంలో అంబేద్కర్ సచివాలయంలో సోమవారం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ సభ జనసంద్రంగా మారింది. జనం తెలంగాణ తల్లికి జేజేలు పలికారు.


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదేళ్ల తర్వాత మొట్టమొదటి సారి సచివాలయం కేంద్రంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసిన మహిళలు మురిసిపోయారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సభకు తరలివచ్చిన జనసంద్రాన్ని చూసిన సీఎం రేవంత్ రెడ్డి ఆనందపడ్డారు. ‘‘మిమ్మల్ని చూస్తోంటే కృష్ణా, గోదావరి నదులు ఇక్కడ ప్రవహిస్తున్నట్లు ఉంది..చరిత్ర పుటల్లో ఈ కార్యక్రమం శాశ్వతంగా నిలిచిపోతుంది’’అని సీఎం పేర్కొన్నారు.

సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి
‘‘భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే,మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి...ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు... అవమానించారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ నేతలు తమ గురించి మాత్రమే ఆలోచించి... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారు’’అని సీఎం రేవంత్ చెప్పారు.



తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకే...

ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తన సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని సీఎం ఆరోపించారు.అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చామని సీఎం చెప్పారు.ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు.ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం అని సీఎం తెలిపారు.ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదని సీఎం పేర్కొన్నారు.అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించిందని సీఎం చెప్పారు.

కన్నతల్లి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి

‘‘తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది.డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజు..ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం’’అని సీఎం రేవంత్ ఉద్వేగంగా చెప్పారు.

తెలంగాణ కవులను గౌరవించుకుందాం
తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామర పత్రం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ వివరించారు.



Read More
Next Story