
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ నాయకులు నారా లోకేశ్, దేవినేని ఉమా తదితరులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసేందుకు ఎగబడిన ఆంధ్రాజనం
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు.
ఒకప్పటి తెలుగుదేశం నాయకుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విజయవాడ నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్, సాయి నర్మదలను వారు ఆశీర్వదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్, మంత్రి నారా లోకేశ్ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు.
నూతన దంపతులను ముఖ్యమంత్రి రేవంత్ , మంత్రి లోకేష్ ఆశీర్వదించించారు. ఈ పెళ్లిలో సీఎం రేవంత్, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండపంలోకి సీఎం రేవంత్‌తో పాటు మంత్రి లోకేష్ కలిసివచ్చారు. రేవంత్‌ను చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.
Next Story