వద్ధురా నాయనా ! ఇథనాల్ ఫ్యాక్టరీ
x
Representational Image

వద్ధురా నాయనా ! ఇథనాల్ ఫ్యాక్టరీ

ఇది నిర్మల్ జిల్లా గుండం పల్లి రైతులు పోరాట నినాదం. దీని వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?


“వద్ధురా నాయనా! ఇథనాల్ ఫ్యాక్టరీ” - నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రం , గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మాణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 2023 డిసెంబర్ నుండీ మార్మోగుతున్న నినాదమిది.

మరీ ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల అనంతరం ఊపందుకున్న ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఆపేయాలని కోరుతూ , జులై 20 న ప్రారంభించి, శాశ్వత దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని, గత 50 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వందలాది మంది గ్రామస్తులు ప్రతి రోజూ వినిపిస్తున్న నినాదమిది.

రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తమ సమస్యను తీసుకు రావడానికి ఆగస్ట్ 14 న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఈ ప్రాంత గ్రామాల నుండీ మహిళలు సహా, వందలాది మంది తరలి వెళ్ళి తమ గోడు వినిపించారు. ఆగస్ట్ 17 న ఈ ప్రజల ప్రతినిధి బృందం హైదరాబాద్ ప్రజా భవన్ కు వచ్చి, ప్రభుత్వ ప్రతినిధులను కలసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చింది. ఆగస్ట్ 28 న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామాల ప్రజలతో కలెక్టర్ గారు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు.

ఈ సమావేశం సందర్భంగా బయట పడిన విషయమొక్కటే. పరిశ్రమ యాజమాన్యం ప్రజలకు అబద్ధాలు చెబుతోంది. స్థానిక అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ , రెవెన్యూ , నీటి పారుదల, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులు, ఇథనాల్ కంపెనీ ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని లోతుగా పరిశీలించకుండా, వాటిపై నిపుణులతో చర్చించకుండా, స్థానిక ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పించకుండా, వారి అనుమానాలు తీర్చకుండా, కంపనీ ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా కంపెనీ ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరు చేశారు.

మరీ ముఖ్యంగా ఆ ప్రాంతం పంటలు పండని బీడు భూమి అన్నట్లుగా, దగ్గరలో గ్రామాలు ఏవీ లేవన్నట్లుగా, వన్య ప్రాణుల సంచారం అసలు లేనట్లుగా, కంపెనీ నుండి కాలుష్యం అసలు విడుదల కాదన్నట్లుగా పరిశ్రమ యజమానులు ,స్థానిక అధికారులు వ్యవహరిస్తున్నారు. వాస్తవం దీనికి పూర్తిగా భిన్నమైనది. ఇథనాల్ కంపెనీ ప్రతినిధులు వేలాది కరపత్రాలు ప్రచురించి, వాటిపై తమ పేరు లేకుండా, భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే, ఎటువంటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేకుండా, తమ కంపెనీ వస్తే కలిగే లాభాల గురించీ, రైతులకు జరిగే మేలు గురించీ, తప్పుడు హామీలతో గ్రామాలలో ప్రచారం చేస్తుంటే, ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడం లేదు.

ప్రస్తుతం ఏర్పడుతున్న ఇథనాల్ కంపెనీలు ప్రధానంగా బియ్యం,నూకలు, మొక్కజొన్న, తీపి జొన్న పంటల ఆధారంగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో మన రాష్ట్ర అవసరాలకు తగినంతగా చెరకు ఉత్పత్తి లేదు కనుక, వరి,మొక్కజొన్న, జొన్న పండించే రైతులకు ప్రస్తుత ఇథనాల్ కంపెనీల వల్ల లాభం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది పచ్చి అబద్దం. ఇథనాల్ పాలసీ వచ్చిన గత మూడేళ్లలో, చిత్తనూరు తో సహా ఏ రాష్ట్రం లోనూ, నేరుగా రైతుల నుండీ ఏ ఇథనాల్ కంపెనీ ఈ పంటలు కొనలేదు.

పైగా ఇథనాల్ కంపెనీలకు ప్రోత్సాహం పేరుతో, భారత ప్రభుత్వమే బియ్యాన్ని సరఫరా చేసింది. దుర్మార్గం ఏమిటంటే పేద ప్రజలకు ఆహారంగా కిలో 29 రూపాయలకు భారత్ రైస్ పేరుతో ఇవే బియ్యం అమ్మిన భారత ప్రభుత్వం, అదనపు బియ్యం కావాలన్న కర్ణాటక ప్రభుత్వానికి కిలో 31 రూపాయలకు ఇవే బియ్యం అమ్మిన మోడీ ప్రభుత్వం, 2021-2022 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో, ఈ ఇథనాల్ కంపెనీలకు మాత్రం 14 లక్షల టన్నుల బియ్యం కిలో 20 రూపాయలకు సబ్సిడీ ధరపై సరఫరా చేసింది.

కానీ దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందనే పేరుతో, ఇదే ప్రభుత్వం 2023 జులైలో ఇథనాల్ కంపెనీలకు బియ్యం సరఫరా పై నిషేధం విధించింది. ఆ తరువాత నూకల ఎగుమతులపై , ఇథనాల్ కోసం నూకలు సరఫరా చేయడం పై కూడా నిషేధం విధించింది.

సబ్సిడీ బియ్యం అందని ఆ సమయంలో కూడా ఇథనాల్ ఉత్పత్తిని కంపెనీలు నిలిపి వేశాయి తప్ప , నేరుగా రైతుల నుండీ కనీస మద్ధతు ధరలకు ధాన్యం కొనడానికి ఏ రాష్ట్రం లోనూ , ఏ ఇథనాల్ మిల్లూ సిద్దం కాలేదు. గత డిసెంబర్ నుండీ ఇథనాల్ పరిశ్రమల యాజమానుల సంఘం పదేపదే కేంద్ర ప్రభుత్వానికి సబ్సిడీ బియ్యం కోసం విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అలాగే దేశంలో మొక్క జొన్న ధరలు పెరిగిపోయాయని, కాబట్టి విదేశాల నుండీ మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడానికి వీలుగా 50 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని జీరో శాతానికి తీసుకు రావాలని కేంద్రాన్ని కోరాయి తప్ప రైతుల నుండీ నేరుగా కనీస మద్ధతు ధరలకు మొక్క జొన్న కొనడానికి సిద్దం కాలేదు.

దేశంలో చక్కెర ధరలను నియంత్రించడానికి మొలాసిస్ కాకుండా చక్కెరను , చెరకు రసాన్ని, చక్కెర సిరప్ ను కూడా ఇథనాల్ తయారీకి వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 న నిషేధం విధించింది. దానిని కూడా తొలగించాలని ఇథనాల్ కంపెనీలు, మహారాష్ట్ర చక్కర కర్మాగారాల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి.

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఇథనాల్ కంపెనీల మేలు కోసం మాత్రం ఈ ఆగస్ట్ 29 నుండీ ఇథనాల్ కంపెనీలు బియ్యం, నూకలు, చెక్కర, చెరకు రసం, చెక్కెర సీరప్ వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చేసింది. భారత ఆహార సంస్థ ఈ ఆగస్ట్ నుండీ అక్టోబర్ మధ్య బియ్యం ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (OMSS) టెండర్ లలో ఇథనాల్ కంపెనీలు కూడా పాల్గొని, 23 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయడానికి అనుమతిని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఈ కంపెనీలు ఇకపై కూడా రైతుల నుండీ ఏ పంటనూ నేరుగా న్యాయమైన ధరలు ఇచ్చి కొనుగోలు చేయ బోవడం లేదు.

అందువల్ల రాష్ట్రంలో ఏర్పడే ఇథనాల్ కంపెనీలు రైతులకు చేసే మేలు, లాభం ఏమీ లేదు. రైతులకు అందాల్సిన సాగు నీళ్ళను కూడా ఈ కంపెనీలు కబ్జా చేస్తాయి. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాయన్న గ్యారంటీ అసలు లేదు ఇప్పటికే పని చేస్తున్న ఇథనాల్, ఇతర పరిశ్రమలలో స్థానికులకు కాకుండా బయట నుండీ వలస వచ్చిన లేదా చవక కూలీ రేట్లకు పని చేసే కార్మికులనే నియమించుకుంటున్నారు. రైతులకు, గ్రామీణ ప్రజలకు ఇక మిగిలేది కాలుష్యం, విష వాయువులే.

నారాయణ పేట జిల్లా, మరికల్ మండలం చిత్తనూరు గ్రామ సమీపంలో 2022 లో ఇథనాల్ ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ పరిధిలో ఇవే అనుభవాలు అక్కడి స్థానిక ప్రజలకు దండిగా ఉన్నాయి. కంపెనీలో ఉత్పత్తి ప్రారంభమయిన కొద్ది రోజులకే విష వాయువుల ఆధారిత దుర్వాసన, పక్కనే ఉన్న నదీ జలాలు కలుషితం కావడం, వాటిని తాగిన పక్షులు, మేకలు, జింకలు చనిపోవడం, ఆ నీళ్ళలో దిగిన పిల్లలకు చర్మ సమస్యలు రావడం, కంపెనీ నుండీ ట్యాంకర్ లతో వ్యర్ధాలను బయటకు తెచ్చి, రోడ్ల పక్క, పంట పొలాలలో పడవేయడం, లాంటి ఘటనలతో రైతులు, గ్రామాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో సంఘటితమయ్యి అప్పుడే ఉద్యమం ప్రారంభించారు.

తొలుత కాలుష్యాన్ని మాత్రమే సమస్య అనుకున్న అక్కడి రైతులు ,క్రమంగా తమ పంట పొలాల సాగుకు హక్కుగా దక్కాల్సిన కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4 టీ ఎం సీ ల నీళ్ళను కంపెనీ కొల్ల గొడుతున్న విషయం కూడా గుర్తించారు. అందుకే ఇథనాల్ కంపెనీ రద్ధు కోసమే గొంతెత్తారు. రెండు సంవత్సరాల పాటు వివిధ రూపాలలో నిరసనలు, పోరాటాలు సాగించారు. ఇథనాల్ ఉత్పత్తి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని కంపెనీ యాజమాన్యం హామీ ఇస్తూ అనేక వీడియోలు కూడా విడుదల చేసింది.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిన, చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యం పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. అక్రమ కేసులు పెట్టింది. నాయకులను పోలీస్ స్టేషన్ లో హింసించి జైలుకు పంపింది.

2023 డిసెంబర్ లో రాష్ట్రంలో అధికారం మారింది. పాత అధికార పార్టీ వాళ్ళు ఓడిపోయి కొత్త అధికార పార్టీ వాళ్ళు స్థానికంగా గెలిచారు. కానీ , కంపెనీ యాజమాన్యం మాత్రం అప్పటి నుండీ ఇప్పటి వరకూ నిరాటంకంగా విష కాలుష్యాన్ని వెదజల్లే తన ఫ్యాక్టరీని నడిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఫ్యాక్టరీ వెదజల్లే దుర్వాసన 35 కిలో మీటర్లకు విస్తరించింది. ఒక మండలంలో ఉండే మూడు గ్రామాలను దాటి, ప్రస్తుతం 7 మండలాలలో 54 గ్రామాలకు విష వాయువులు వ్యాపిస్తున్నాయి.

గాలిలో కర్బన శాతం పెరుగుతున్నది. వ్యర్ధాలను శుద్ధి చేయడం లేదు. కాలుష్యం , దుర్వాసన భయంతో ఈ గ్రామాల పరిధిలో వ్యవసాయ పని చేయడానికి కూలీలు రావడం లేదు. కంపెనీలో విడుదలయ్యే కార్బన్ డై యాక్సైడ్ ను బంధించి, సోడా కంపెనీలకు సరఫరా చేస్తామన్న యాజమాన్య హామీ అమలు కావడం లేదు. దానిని కూడా బయటకే వదులుతున్నారు.

నిజానికి కంపెనీలో వ్యర్ధాలను ఎలా శుద్ధి చేస్తున్నారో, ఎప్పటికప్పుడు కంపెనీ రిజిస్టర్లో నమోదు చేయాలి. వాటి పరిశీలనకు బయట వ్యక్తులను అనుమతించడమ్ లేదు. .అలాగే ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు కూడా పంపాలి. కానీ అలాంటి నివేదిక ఏదీ ఆ సంస్థ వెబ్ సైట్ పై కనిపించడం లేదు.. ఈ మధ్య కాలంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బృందం రెండు సార్లు కంపనీని సందర్శించినా, అంతా సవ్యంగానే ఉందని అబద్ధపు రిపోర్టులను విడుదల చేస్తున్నది.

ఈ అనుభవాన్ని చిత్తనూరు వెళ్ళి చూసి వచ్చిన దిలావర్ పూర్ ప్రజలు, తమ ప్రాంతానికి వచ్చే ఇథనాల్ కంపెనీ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించనుందో అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ నిర్బంధాలను, యాజమాన్య తప్పుడు ప్రచారాలను అధిగమించి, ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నది కూడా ఆ భయాల తోనే.


Read More
Next Story