
స్థానిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టేలా పని చేయాలి
బిజెపి పదాదికారుల సమావేశంలో రాంచందర్ రావు పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడంపై బిజెపి ఫోకస్ పెట్టింది. వరుసగా పార్టీ శ్రేణులతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమావేశమౌతున్నారు. ప్రజలు బిజెపికి పట్టంకట్టేలా నేతలు, కార్యకర్తలు పనిచేయాలని రామచందర్‌రావు బుధవారం కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామగ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలని ఆయన బిజెపి రాష్ట్ర పదాదికారుల సమావేశంలో పిలుపునిచ్చారు.
‘‘నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు సాధిస్తుందనే నమ్మకముందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలువబోతున్నాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుపడినా.. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. పదవులను బాధ్యతగా నిర్వహించాలి. కార్యకర్తగా 40 ఏళ్లు బిజెపిలో కొనసాగినందుకు సంతోషంగా ఉంది అని రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడానికి బిజెపి కృషి ఉందన్నారు.10 ఏళ్లు కేసీఆర్ మాటల గారడితో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్‌లను అమలు చేసే పరిస్థితులు లేవు. బిఆర్ఎస్ , కాంగ్రెస్ దొందే దొందేనన్నారు. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించాయి. కేవలం 600 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జీవో వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలి. జీఎస్టీ తగ్గింపును దేశప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. దీని వల్ల అన్ని సామాజికవర్గాలు లబ్ధి చేకూరాయి. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుంది.ఖరీఫ్ సీజన్ పూర్తి అయ్యే లోపు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందుతుంది అని ఆయన భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా యదేచ్చగా జరుగుతోంది. దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన అన్నారు. ‘‘తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నారు’’ అని రామచందర్‌రావు అన్నారు.