
డ్రైవర్లకు న్యాయమైన వేతనాలపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
మోటార్ వెహికిల్స్ చట్టం, 1988 ప్రకారం రాష్ట్రంలో టాక్సీ ఛార్జీల నియంత్రణ లేకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. యాప్ ఆధారిత టాక్సీ అగ్రిగేటర్లు తాము అనుకున్నట్లు ఛార్జీలు వసూలు చేస్తూ డ్రైవర్లు, వినియోగదారులు ఇరువురినీ కష్టాల్లోకి నెట్టేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మోటార్ వెహికిల్స్ చట్టం, 1988 లోని సెక్షన్ 67 ప్రకారం తెలంగాణలో నడిచే అన్ని కాంట్రాక్ట్ క్యారేజీలకు ఏకరీతీ ఛార్జీలు నిర్ణయించి, గెజిట్‌లో నోటిఫై చేయాలని యూనియన్ పిటిషన్ లో పేర్కొంది.
మోటార్ వెహికిల్స్ చట్టం, 1988 సెక్షన్ 74 లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 ప్రకారం టాక్సీమీటర్ల ఇన్‌స్టాలేషన్ వెరిఫికేషన్‌ను నిర్ధారించాలి అని యూనియన్ కోరింది.
నోటిఫై చేసిన ఛార్జీల అమలు పర్యవేక్షణ కోసం ఒక మానిటరింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని తెలిపింది.డ్రైవర్లు, వినియోగదారుల రెండింటికీ అందుబాటులో ఉండేలా ఒక గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ఏర్పాటు చేసి, పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి అని యూనియన్ పేర్కొంది.
సోమవారం ఈ పిటిషన్ న్యాయమూర్తి కె. సారత్ ఎదుట విచారణకు వచ్చింది. సీనియర్ కౌన్సిల్ ఎల్. రవిచందర్ TGPWU తరఫున వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
“డ్రైవర్లకు న్యాయమైన వేతనాలు కల్పించడానికీ, వినియోగదారులను టాక్సీ అగ్రిగేటర్ల దోపిడీ ధరల నుండి రక్షించడానికీ ఈ కేసు అత్యంత ముఖ్యమైనది. ఈ రంగంలో నియంత్రణ, పారదర్శకత అత్యవసరం” అని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ మీడియాకు తెలిపారు.