ఫోన్ ట్యాపింగ్ కేసు: ఛార్జ్ షీట్ మళ్ళీ వెనక్కి పంపిన కోర్టు
x

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఛార్జ్ షీట్ మళ్ళీ వెనక్కి పంపిన కోర్టు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుని విచారిస్తున్న సిట్ అధికారులకు చుక్కెదురైంది.


తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుని విచారిస్తున్న సిట్ అధికారులకు చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్‌ను వారంలో రెండవసారి వెనక్కి పంపింది. చార్జిషీట్‌లో పేర్కొన్న నలుగురు నిందితులను విచారించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతి లేకపోవడమే కోర్టు లేవనెత్తిన ప్రాథమిక వాదన. కేసు నమోదు, తదుపరి అభియోగాలు నమోదు చేసే సమయంలో ఈ అధికారులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చట్టపరమైన ప్రోటోకాల్స్ ప్రకారం, వారి సర్వీస్ పదవీ కాలంలో అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతి తప్పనిసరి.

ప్రాసిక్యూషన్ అనుమతి లేకపోవడంతో పాటు, ఛార్జిషీట్, సాక్ష్యంగా సమర్పించిన సహాయక పత్రాల మధ్య తేడాలను కోర్టు ఎత్తిచూపింది. "ఛార్జిషీట్‌లో ఉదహరించిన సంఘటనల తేదీలు సమర్పించిన సాక్ష్యపు మెటీరియల్‌ డాక్యుమెంట్ తో సరిపోలడం లేదు అని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా, సిట్ దర్యాప్తులో సేకరించిన అన్ని మెటీరియల్ సాక్ష్యాలను పూర్తిగా కోర్టు ముందుంచలేదని, ప్రాసిక్యూషన్ ఇచ్చిన రిపోర్ట్ మరింత సందేహాన్ని కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.

వారంలో సిట్ ఛార్జ్ షీట్ ని ఇలాంటి కారణాలతోనే కోర్టు వెనక్కి పంపడం ఇది రెండో సారి. మొదట కోర్టు ఛార్జిషీట్‌ను తిరిగి పంపింది, దానిని తిరిగి సమర్పించే ముందు ఇప్పటికే ఉన్న లోపాలను సరిదిద్దాలని సిట్‌ని ఆదేశించింది. తక్షణమే పరిష్కరించడానికి దర్యాప్తు ఏజెన్సీ ప్రయత్నాలు చేసినప్పటికీ, కోర్టు ఛార్జ్ షీట్ ని పరిశీలించి అదనపు లోపాలను వెలికితీసి వెనక్కి పంపడం విశేషం.

కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణను కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విచారణకు సంబంధించిన అధికారులు కోర్టుకి తెలిపారు.

Read More
Next Story