మోదీ ‘మన్ కీ బాత్’ ప్రశంసలందుకున్న  విప్పపూల లడ్డు కథ
x
Mahua Flowers Laddus

మోదీ ‘మన్ కీ బాత్’ ప్రశంసలందుకున్న విప్పపూల లడ్డు కథ

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో తయారవుతున్న విప్పపూల లడ్డూ(Mahua Flower Laddus)ల గురించి మోడీ ప్రస్తావించగానే దేశవ్యాప్తంగా విప్పపూల లడ్డూలపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది


మామూలుగా లడ్డూలంటే ఎవరికైనా ఎన్నిరకాలు తెలుసుంటాయి. రవ్వలడ్డు, బూందీలడ్డు, బందరులడ్డు, డ్రైఫ్రూట్ లడ్డుతో పాటు మరో రెండు, మూడురకాలు తెలిసుంటే ఎక్కువే. కాని ఇపుడు కొత్తగా ఒక లడ్డు పాపులరవుతోంది. అదేమిటంటే విప్పపూల లడ్డు. పైన చెప్పిన రకాల లడ్డూలు ఎక్కువగా తింటే అనారోగ్యం చేసే ప్రమాదముంది. అదే విప్పపూల లడ్డుతింటే సంపూర్ణ ఆరోగ్యం. విప్పపూల లడ్డూలు ఎన్నితింటే అంత ఆరోగ్యం. ఇంతకీ విప్పపూల లడ్డూ ఎలాగ ఫేమస్ అయ్యింది ? ఎలాగంటే నరేంద్రమోడీ(Narendra Modi) కారణంగానే. మోడీ విప్పపూల లడ్డూకు బ్రాండ్ అంబాసిడర్ గా ఏమీ పనిచేయటంలేదు.


ఆదివారం జరిగిన 124వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతు ప్రత్యేకంగా విప్పపూల లడ్డు(మహువా పూల లడ్డు)గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో తయారవుతున్న విప్పపూల లడ్డూ(Mahua Flower Laddus)ల గురించి మోడీ ప్రస్తావించగానే దేశవ్యాప్తంగా విప్పపూల లడ్డూలపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోయింది. పైగా విప్పపూల లడ్డూలు తినటంవల్ల కలిగే లాభాలగురించి మోడీ ప్రత్యేకంగా చెప్పటంతో జనాల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఇదే విషయమై ‘తెలంగాణ ఫెడరల్’ విప్పపూల లడ్డూల తయారీపై ఫోకస్ పెట్టింది.


గిరిజన సహాకార సంస్ధ ఆధ్వర్యంలో ఉట్నూరులో నడుస్తున్న ‘భీమ్ బాయి ఆదివాసి మహిళా సహకార సంస్ధ’ లీడర్ భగు బాయితో మాట్లాడింది. భగు బాయి నాయకత్వంలో 12 మంది గిరిజనమహిళలు సహకార సంఘాన్ని2019లో ఏర్పాటుచేసుకున్నారు. నిజానికి విప్పపూల లడ్డూలన్నది ఇప్పుడు మొదలుపెట్టిందికాదు. 2019 నుండే విప్పపూలతో లడ్డూల తయారీ, వాడకం మొదలైంది. కాకపోతే అప్పట్లో చాలా పరిమితంగా మాత్రమే తయారుచేసే వారు. తయారుచేసిన లడ్డూలు సంఘం సభ్యురాళ్ళకు, తమఊరిలో తినటానికి మాత్రమే సరిపోయేది. ఆ సమయంలోనే జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ దృష్టిలోపడటంతో విప్పపూల లడ్డూల తయారీ పెద్ద మలుపు తిరిగింది.


అప్పటివరకు పరిమితంగా మాత్రమే తయారవుతున్న విప్పపూల లడ్డూలను కలెక్టర్ ఒకసారి రుచిచూశారు. ఈ లడ్డూలను తినటంవల్ల వచ్చే లాభాలను తెలుసుకున్నారు. విప్పపూల లడ్డూ కలెక్టర్ కు బాగా నచ్చటంతో కలెక్టరే ప్రచారం మొదలుపెట్టారు. ఉట్నూరులో తయారవుతున్న విప్పపూల లడ్డూలను కలెక్టర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్)కు టెస్టింగుకు పంపారు. ఎన్ఐఎన్ లోని శాస్త్రవేత్తలు విప్పపూల లడ్డూలను పరీక్షించి వాటిని తినటంవల్ల జరిగే లాభాలను కలెక్టర్ కు ఒక నివేదికరూపంలో అందించారు. రిపోర్టుచూసిన కలెక్టర్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విప్పపూల లడ్డూలను పరీక్షించిన శాస్త్రవేత్తలకు అందులోని పోషకాలు, లడ్డూలను తినటం వల్ల వచ్చే లాభాలను వివరించగలిగారు. మరి సంవత్సరాల తరబడి విప్పపూలను ఆహారంలో తీసుకోవటం వల్ల కలిగే లాభాలను గిరిజన మహిళలకు ఎవరు చెప్పారు ? ఎవరూ చెప్పలేదు వారసత్వంగా అనేక రకాలైన బలవర్ధకమైన ఆహారాలను పెద్దలనుండి పిల్లలకు వాటంతట అవే వారసత్వంగా తెలుస్తుంది. పుట్టేది, పెరిగేది అడవుల్లోనే కాబట్టి మంచి, చెడు, బలవర్ధకమైన ఆహారాన్ని కూడా అడవితల్లే తెలిసేట్లు చేస్తుంది.


ఈపద్దతిలోనే ఉట్నూరు గిరిజనమహిళలు అడవుల్లో ప్రకృతిప్రసాదంగా దొరికే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అందులో విప్పపూలతో తయారైన వంటకాలు లేదా వంటకాల్లో విప్పపూలను జతచేయటం ఒకటి. మొదటినుండి విప్పపూలను గిరిజన మహిళలు విప్పపూలతో కాచిన సారా, విప్పపూలతో చేసిన అంబలి, పప్పులు, విప్పపూలు కలిపి పులుసులు, పులుసు రూపంలో చేసుకోవటం అలవాటే. ఏదోరూపంలో తమ ఆహారంలో విప్పపూలు కలిసుండటం గిరిజనులకు ముఖ్యంగా స్త్రీలకు చాలా సహజం. విప్పపూలను విరివిగా వాడటం వల్ల మహిళలు ముఖ్యంగా వివాహం అయిన మహిళల్లో గర్భం కారణంగా మొదలయ్యే నడుంనొప్పి, వయసైన తర్వాత వచ్చే కీళ్ళనొప్పులు, రక్తహీనత లక్షణాలు దాదాపు కనబడటంలేదు. లేదా చాలా తక్కువగా ఉంటున్నాయి.


గిరిజన మహిళల ఆరోగ్యాన్ని పరీక్షించిన కలెక్టర్ కు పైన చెప్పిన సమస్యలేవీ ఉట్నూరు గిరిజన మహిళల్లో కనబడలేదు. అందుకనే ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలతో పరీక్షలు జరిపించారు. విప్పపూలను సంప్రదాయక గిరిజన ఆహారాల్లో వాడటమే కాకుండా లడ్డూలరూపంలోకి తీసుకొస్తే మిగిలిన వారికి కూడా కొత్తరుచిని పరిచయం చేసినట్లవుతుందని కలెక్టర్ అనుకున్నారు. అందుకనే 2019లో విప్పపూల లడ్డూల తయారీని కలెక్టర్ బాగా ప్రోత్సహించారు. ఎప్పుడైతే విప్పపూల లడ్డూల తయారీని వ్యాపారంగా చేసుకోవటం మొదలుపెట్టారో అప్పటినుండి దేశంలో ఎక్కడ గిరిజన ఉత్సవాలు జరిగినా ప్రత్యేకంగా ఉట్నూరు స్టాల్ ఏర్పాటుచేయించి విప్పపూల లడ్డూలను కలెక్టర్ ప్రమోట్ చేయించారు. దాంతో ఆనోటా ఈనోటా విప్పపూల లడ్డూకి పాపులారిటి పెరిగింది.


ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, హైదరాబాద్(Hyderabad), ఢిల్లీ(Delhi), విజయవాడ, ముంబాయ్(Mumbai) లాంటిచోట్ల ఎగ్జిబిషన్లు జరుగుతున్నపుడు విప్పపూల లడ్డూల కౌంటర్లను ఏర్పాటుచేసేవారు. అమ్మకాలు బాగా ప్రోత్సాహకంగా ఉండటంతో పెద్ద పెద్ద ఆర్డర్లమీద విప్పపూల లడ్డూలను దుబాయ్(Dubai) కు కూడా ఎగుమతి చేస్తున్నారిప్పుడు. ప్రతిరోజు సగటున 100 కిలోల విప్పపూల లడ్డూలను తయారుచేసి అనేక ప్రాంతాలకు పంపుతున్నారు. మార్చినెలలో మాత్రమే దొరికే విప్పపూలను ఎంతవీలుంటే అంత సేకరించి దాన్ని గ్రేడింగ్ చేసి నిల్వచేసి పెట్టుకుంటున్నారు. వచ్చే ఆర్డర్లకు తగ్గట్లుగా విప్పపూలను బాగా ఎండబెట్టి పౌడర్ గా మార్చుతారు. నువ్వులు, యాలకులు, బెల్లం, జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలను కూడా కలుపుతారు. ఇన్ని డ్రైఫ్రూట్స్, యాలకులు, నువ్వులు కలపటం వల్ల విప్పపూల లడ్డూలు రుచికరంగా ఉంటాయి.

చిన్నపటి నుండి అలవాటే


ఇదే విషయమై గ్రూపు లీడర్ భగు బాయ్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘తాము చిన్నప్పటినుండి విప్పపూలను ఆహారంలో భాగంగా చేసుకుంటు’న్నట్లు చెప్పారు. ‘విప్పపూలతో లడ్డూలను ఇపుడు చేస్తున్నాంకాని చిన్నప్పటినుండి విప్పపూలను రొట్టెలు, గారెలు, అంబలి, రోటిపచ్చడి రూపంలో తీసుకుంటున్నా’మని అన్నారు. ‘విప్పపూల లడ్డూలు ఇపుడింత ఫేమస్ అవటానికి కలెక్టర్ గా పనిచేసిన దివ్యా దేవరాజనే కారణమ’న్నారు. విప్పపూలతో చేసిన ఆహారం గర్భవతులకు చాలామంచిదన్నారు. ‘విప్పపూలను ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల నడుంనొప్పులు రావని, కీళ్ళనొప్పులు దగ్గరకు కూడా రావ’న్నారు. అలాగే రక్తహీనత అన్నదే ఉండదని భగు చెప్పారు. ‘ఇలాంటి ఆరోగ్య చిట్కాలన్నీ తమ పెద్దల నుండి చిన్నప్పటినుండే నేర్చుకున్న’ట్లు చెప్పారు.



‘మార్చినెలలో మాత్రమే దొరికే సీజనల్ పూలను సేకరించి గ్రేడింగ్ చేసి బాగా ఎండపెట్టి పౌడర్ గా చేసుకుంటామ’న్నారు. ‘జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలను వేయించి వాటినికూడా పౌడర్ రూపంలోకి మార్చుకుంటామ’న్నారు. వీటికి బెల్లంపొడిని జతచేస్తే కాస్త జిగురుగా తయారవుతుందన్నారు. ‘నాలుగు రకాల పౌడర్లకు యాలకులు, నవ్వులపొడిని కలపటంతో మంచి వాసన, రుచికరమైన విప్పపూల లడ్డూలు తయారవుతాయ’ని చెప్పారు. కిలో విప్పపూల లడ్డూలను 400 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పారు. ‘ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని 60 బాలికల హాస్టళ్ళకు విప్పపూల లడ్డూలను సరఫరా చేస్తున్నామ’న్నారు. విప్పపూల లడ్డూలను రుచిచూసిన వారంతా తెగ మెచ్చుకుంటున్నట్లు భగు బాయ్ చెప్పారు. ‘హైదరాబాద్ లోని శిల్పారామంలో తమ సహకార సంఘానికి పర్మనెంటుగా ప్రభుత్వం ఒక స్టాల్ ను కేటాయించింద’ని చెప్పారు. ఆస్టాల్లో ప్రతిరోజు విప్పపూల లడ్డూలను అమ్ముతున్నట్లు కూడా తెలిపారు. మహిళలందరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే తన లక్ష్యంగా భగుబాయ్ చెప్పారు.

Read More
Next Story