ముగ్గురినీ ‘పోడు’ భయపెడుతోందా ?
x
Mahaboobbad candidates (source Twitter)

ముగ్గురినీ ‘పోడు’ భయపెడుతోందా ?

మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోటీచేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ఒక మైనస్ పాయింట్ ఉంది.


ఎన్నికలన్నాక అభ్యర్ధుల్లో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లుంటు సహజమే. ఎవరి ప్లస్ పాయింట్లను వాళ్ళు చెప్పుకుంటే మైనస్ పాయింట్లను ప్రత్యర్ధులు హైలేట్ చేస్తుంటారు. అయితే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోటీచేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ఒక మైనస్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ప్రస్తావనకు రాకుండా ముగ్గురు వీలైనంతలో తప్పించుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంటు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కేంద్ర మాజీమంత్రి బలరామ్ నాయక్, బీఆర్ఎస్ తరపున ఎంపీ మాలోతు కవిత, బీజేపీ నుండి మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ పోటీచేస్తున్నారు.

ముగ్గురిలో ఎవరి ప్లస్సులు, ఎవరి మైనస్సులు వాళ్ళకున్నా ముగ్గురికి కామన్ గా ఒక మైనస్ పాయింట్ భయపెడుతోంది. అదేమిటంటే పోడుభూముల వ్యవహారం. అడవులు, కొండలపైన నివసించే గిరిజనులు తమ సౌకర్యం ప్రకారం వ్యవసాయం చేసుకుంటుంటారు. ఎక్కువగా పప్పుధాన్యాలనే సాగుచేస్తుంటారు. అయితే అటవీ శాఖ అధికారులు దాడులుచేసి పోడు వ్యవసాయం చట్టవిరుద్ధమని గోలచేస్తారు. అంతేకాకుండా పోడు భూములను ధ్వంసం చేస్తుంటారు. దాంతో అప్పటివరకు గిరిజనులు కష్టపడి సాగుచేసిన పంటంతా ధ్వసమైపోతుంది. తమ కష్టాన్ని ధ్వంసంచేసిన అధికారులపైన గిరిజనులు తిరగబడతారు. అటవీ, పోలీసు అధికారులకు గిరిజనులకు మధ్య రెగ్యులర్ గా గొడవలు జరుగుతునే ఉంటాయి. సుమారు రెండేళ్ళ క్రితం ఖమ్మం జిల్లాలో జరిగిన ఇలాంటి గొడవలోనే ఫారెస్టు అధికారి చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.

దశాబ్దాల పోరాటం

తెలంగాణా వ్యాప్తంగా గిరిజనులున్న ప్రాంతాల్లో ఎప్పటినుండో జరుగుతున్న వివాదమే. ఇపుడు పై ముగ్గురు అభ్యర్ధులకు సమస్య ఏమొచ్చిందంటే మహబూబాబాద్ నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలు ఇప్పించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయట. నియోజకవర్గంలో సుమారు 7 లక్షల గిరిజన ఓట్లున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధికి వచ్చిన సమస్య ఏమిటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే పోడుభూములకు పట్టాలిప్పించాలని డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికిప్పుడు పట్టాలంటే అది బలరామ్ చేతిలో లేనిపని. అలాగే కవిత ప్రచారంలోకి వెళ్ళినపుడు కూడా పోడుభూములకు పట్టాల అంశం ఎదురవుతోంది. ఎలాగంటే పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినపుడల్లా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలిచ్చేస్తామని కేసీయార్ చాలాసార్లు హామీలిచ్చారు. అయితే ఎవరికీ పట్టా ఇవ్వలేదు.

ఈ విషయంపై కవితను గిరిజనులు గట్టిగా నిలదీస్తున్నారట. ఇక సీతారమ్ వ్యవహారం కూడా కాస్త అటుఇటుగానే ఉందంటున్నారు. ఎలాగంటే తాను పార్లమెంటు అభ్యర్ధినని సీతారమ్ చెప్పుకుంటున్నా మొన్నటివరకు బీఆర్ఎస్ ఎంపీనే కదాని గిరిజనులు నిలదీస్తున్నారట. బీఆర్ఎస్ ఎంపీగా 2014లో గెలిచిన సీతారామ్ మొన్నటివరకు బీఆర్ఎస్ నేతే. సీతారామ్ కు టికెట్ దక్కకపోవటంతో బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నపుడు పట్టాలు ఎందుకు ఇప్పటించలేదని నిలదీస్తున్నారు. దాంతో తమ ప్రచారంలో పోడుభూములకు పట్టాలు అనే అంశంపై ఏమిచెప్పాలో తెలీక వీలైనంతలో ఆ పాయింట్ ను తప్పించుకుంటున్నారట.

ప్లస్ పాయింట్లున్నాయా ?

అయితే ముగ్గురికి ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అవేమిటంటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఇల్లందు, పినపాక, నర్సంపేటలో కాంగ్రెస్ ఎంఎల్ఏలే ఉన్నారు. భద్రాచలం ఎంఎల్ఏ తెర్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్నారే ప్రచారం తెలిసిందే. కాబట్టి ఏడు అసెంబ్లీల్లోను కాంగ్రెస్ ఎంఎల్ఏలే ఉండటం బలరామ్ కు ప్లస్సనే చెప్పాలి. అలాగే ములుగులో ట్రైబల్ యూనివర్సిటి నిర్మాణం జరుగుతుండటం సీతారామ్ కు సానుకూలం. విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోవటం బీజేపీకి మైనస్. కవితకు ప్లస్సులకన్నా మైనస్సులే ఎక్కువున్నాయి. పదేళ్ళ కేసీయార్ పాలనపై వ్యతిరేకత, పార్టీ బలహీనపడిపోవటం, పార్టీలో నుండి నేతలు వెళిపోతుండటం పెద్ద మైనస్.

తమ వ్యవసాయ భూములే

పోడు భూముల సమస్యపై లంబాడా హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ జాదవ్ రమేష్ నాయక్ మాట్లాడుతు దశాబ్దాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవటం అన్యాయమన్నారు. తాము అడవులను నరికి కొత్తగా వ్యవసాయం చేయటంలేదన్నారు. తమవల్ల అడవులు ధ్వంసం అవుతుంటే అధికారులు అభ్యంతరాలు చెప్పాలన్నారు. తాము వ్యవసాయం చేస్తున్నవి పోడుభూములు కావని తమ వ్యవసాయ భూములుగా రమేష్ చెప్పారు. అలాగే సుమారు 1.5 లక్షలమందికి రైతుబంధు పథకం అందటంలేదని, గిరిజనుల్లో ఒక్కరికి కూడా రైతురుణమాఫీ అందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పాయింట్లు కాంగ్రెస్ కు పెద్ద మైనస్ అవుతుందన్నారు.

3.5 లక్షలకే పట్టాలు

ఇదే విషయమై రైతు స్వరాజ్య వేదిక తరపున కన్నెగంటి రవి మాట్లాడుతు 40 ఏళ్ళుగా అడవుల్లోవ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వకపోవటం అన్యాయమన్నారు. కేసీయార్ పదేళ్ళపాలనలో 11 లక్షల ఎకరాల్లో పట్టాలు కావాలని ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల్లో సుమారు లక్షమందికి 3.5 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చినట్లు చెప్పారు. మిగిలిన దరఖాస్తుల విషయం ఏమిటో తెలీదన్నారు. ఆధార్ కార్డులు లేవని, వయసు సంబంధిత కారణాలతో దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. పట్టాల విషయమై సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా ఇంతవరకు సమాధానం రాలేదన్నారు.

Read More
Next Story