అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టుకు పోలీసులు.?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను మరోసారి అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారా?
సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్(Allu Arjun)ను మరోసారి అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను చంచల్‌గుడా జైలుకు తరలించే సరికి హైకోర్టులో అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరగడం, ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కాగా రూ.50వేల వ్యక్తిగత పూచికత్తుతో అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ది కానీ, థియేటర్ యాజమాన్యంది కానీ ఏమాత్రం తప్పులేదని, అంతా బందోబస్తు ఏర్పాటు చేయని, ప్రజలను కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులదే తప్పని వాదన ఒకవైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది. మరికొందరైతే పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగితే సీఎంను అరెస్ట్ చేస్తారా? దేవుడి యాత్రా కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగితే దేవుడిని అరెస్ట్ చేస్తారా? అంటూ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమపైకి వస్తున్న అపవాదును తొలగించుకోవడం కోసం పోలీసులు.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను బహిర్గతం చేశారు. అసలు డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ దగ్గరకు రావడానికి అల్లు అర్జున్‌కు అనుమతి ఇవ్వలేదని, అంతేకాకుండా ఎటువంటి అనుమతి లేకుండానే అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ కూడా నిర్వహించారని పోలీసులు చెప్పారు.
పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. తాజాగా దీనిపై పోలీసులు స్పందించారు.
క్లారిటీ ఇచ్చిన పోలీసులు
ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు. ఈ క్రమంలో ప్రీమియర్స్‌కు నటీనటులు, మూవీ టీమ్ ఎవరినీ రావొద్దంటూ థియేటర్ యాజమాన్యానికి వివరించారు. ఈ మేరకు చిక్కడిపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు సూచనలను తుంగలో తొక్కి హీరో ఆరోజు థియేటర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడటం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా వచ్చిన హీరో.. సైలెంట్‌గా థియేటర్‌కు వెళ్లలేదని, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు తెలిపాయి. ఈ మేరకు థియేటర్ యాజమాన్యానికి పోలీసులు రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానానికి సంబంధించి కాపీని కూడా పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ అరెస్ట్ టు బెయిల్
అయితే ఈ నెల 13వ తేదీన అంటే శుక్రవారం రోజున కేసులో భాగంగా అల్లు అర్జున్‌ను ఉదయం 11 గంటల 45 నిమిషాలను ఆయన నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అదే సమయంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రిమాండ్ పడిన క్రమంలో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇంతలోనే హైకోర్టు.. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే వీటిని అమలు చేయాలని చెప్పినప్పటికీ.. రాత్రి అంతా చంచల్‌గూడ జైలులో ఉంచి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు ఆయనను విడుదల చేశారు. ఈ కేసు విచారణ క్రమంలో ఈరోజు పోలీసులు తాము అందించిన రాత పూర్వక లేఖను విడుదల చేశారు.
సంధ్య థియేటర్‌లో ఏం జరిగింది..
హైదరాబాద్ ఆర్‌టీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లొ నిర్వహించిన ప్రీమియర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు అక్కడకు అల్లు అర్జున్ రావడంతో అభిమానులతో థియేటర్ లోపలకు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. బాలుడిని రక్షించడం కోసం పోలీసు సిబ్బంది ఎంతో శ్రమించారు. అనంతరం బాలుడిని హాస్పటల్‌కు తరలించారు. అయితే అక్కడ ఏర్పడిన పరిస్థితులను కంట్రల్ చేయలేకపోయిన పోలీసులు బన్నీ అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ X రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చారు. అదే సమయంలో సినిమాను అభిమానులతో కలిసి చూడటం కోసం అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిద్దరిని విద్య నగర్‌లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.