
మాజీ మావోయిస్ట్, బీఆర్ఎస్ నేత గాదే ఇన్నయ్య అరెస్ట్..
వరంగల్ జిల్లా జాఫర్గఢ్‌లోని ఇన్నయ్య ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు.
మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త, బీఆర్ఎస్ నేత గాదె ఇన్నారెడ్డి(గాదె ఇన్నయ్య)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్గఢ్‌లోని ఇన్నయ్య ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల ఆయన కార్యకలాపాలు, మీడియా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. జాఫర్గఢ్‌లో తన స్వగృహంలో అనాథ శరణాలయాన్ని నడుపుతున్న గాదె ఇన్నారెడ్డి, గత కొద్ది రోజులుగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై భద్రతా సంస్థలు నిఘా పెంచినట్లు తెలుస్తోంది.
ఇటీవల మావోయిస్టు నేత హిడ్మా స్వగ్రామమైన పువర్తికి గాదె ఇన్నారెడ్డి మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లడం కూడా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ పర్యటన వెనుక ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఎన్ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. సోదాల సందర్భంగా ఇన్నారెడ్డి ఇంట్లో పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ఐఏ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ సోదాలు ముందస్తు సమాచారం లేకుండానే నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్ఐఏ అధికారుల నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, భద్రతా అంశాలకు సంబంధించిన కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

