Cases on BRS MLA|కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు..ఓవర్ యాక్షన్ ఫలితమేనా ?
జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ పై దాడికి ప్రయత్నంచేశాడని పాడిపై పోలీసులు కేసులు నమోదుచేశారు.
ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డిపై మూడుకేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ పై దాడికి ప్రయత్నంచేశాడని పాడిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లాకలెక్టర్ ఆడిటోరియంలో సమీక్ష జరిగింది. జిల్లాఅభివృద్ధికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలతో పాటు ఇతర ప్రాజాప్రతినిధుల నుండి సూచనలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్(Jagityal MLA Sanjay) మాట్లాడారు. సంజయ్ మాట్లాడటం మొదలుపెట్టగానే హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి(BRS MLA Padi Kaushik Reddy) అడ్డుపడ్డారు. ఎంఎల్ఏ చేతిలోని మైక్ లాక్కోవాలని ప్రయత్నించారు. సంజయ్ మైక్ ఇవ్వకపోతే పాడి దాడికి ప్రయత్నించాడు. సంజయ్ ముందు ఏ పార్టీ ఎంఎల్ఏనో చెప్పి తర్వాత మాట్లాడాలని పట్టుబట్టాడు. తాను కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏగానే మాట్లాడుతున్నట్లు సంజయ్ బదులివ్వటంతో కౌశిక్ ఒక్కసారిగా రెచ్చిపోయారు.
సంజయ్ మాట్లాడుతున్న వేదికమీదకు దూసుకువచ్చి దాడికి కౌశిక్ ప్రయత్నించారు. ఇద్దరు రెండునిముషాల పాటు తిట్టుకుంటూ ఒకరిని మరొకరు తోసుకున్నారు. ఇంతలో మిగిలిన ప్రజాప్రతినిధులు, పోలీసులు వేదికమీదకు చేరుకుని ఇద్దరినీ విడదీశారు. చివరకు మంత్రి ఆదేశాలమేరకు పోలీసులు పాడిని సమావేశంలో నుండి బయటకు తీసుకెళ్ళిపోయారు. డాక్టర్ సంజయ్ వెంటనే రాజీనామాచేసి ఉపఎన్నికలకు సిద్ధమవ్వాలంటు పాడి పదేపదే చాలెంజ్ చేయటం గమనార్హం. సంజయ్ రాజీనామా చేస్తే తాను కూడా ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని పాడి గట్టిగా అరచిచెప్పారు. నిజానికి సమావేశంలో పాడి గొడవచేయాల్సిన అవసరం, సంజయ్ పై దాడికి ప్రయత్నించాల్సిన అవసరమే లేదు.
ఎందుకింతగా రెచ్చిపోయారు ?
అచ్చంగా సమావేశంలో గొడవచేసి మీడియాఅటెన్షన్ కోసమే పాడి గొడవచేసినట్లు అర్ధమైపోతోంది. డాక్టర్ సంజయ్ 2023 ఎన్నికల్లో జగిత్యాలలో బీఆర్ఎస్ తరపున గెలిచారు. తర్వాత మారిన పరిస్ధితుల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపారు. అప్పటినుండి సంజయ్ ను పాడి టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంఎల్ఏలే కాబట్టి జిల్లాస్ధాయిలో ఏ సమావేశం జరిగినా పాడి ఇలాగే సంజయ్ రాజీనామా కోసం గొడవచేస్తున్నారు. ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపీలు తర్వాత మరోపార్టీలోకి ఫిరాయించటం సాధారణమైపోయింది. కాబట్టి సంజయ్ ఫిరాయింపు విషయంలో పాడి ఇంతగా గోలచేయాల్సిన అవసరమే లేదు.
ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్(BRS Chief KCR) యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడిన విషయం అందరికీ గుర్తుండేఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళల్లో కాంగ్రెస్, టీడీపీ నుండి 18 మంది ఎంఎల్ఏలు, 23 మంది ఎంఎల్సీలను, నలుగురు ఎంపీలను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం కౌశిక్ రెడ్డికి కూడా బాగాతెలుసు. అప్పట్లో అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ ఏదైతే చేశారో ఇఫుడు రేవంత్(Revanth) కూడా అదే చేస్తున్నారు. కేసీఆర్ ఫిరాయింపులరాజకీయానికి రేవంత్ కూడా ఫిరాయింపులతోనే సమాధానంచెబుతున్నారు. దాన్నే కౌశిక్ రెడ్డి సహించలేకపోతున్నారు. నిజానికి కౌశిక్ కూడా 2023 ఎన్నికలకు ముందువరకు కాంగ్రెస్ లోనే ఉండేవాడు. టికెట్ హామీతోనో ఇంకేదో కారణాలతో బీఆర్ఎస్ లో చేరాడు.
ఇపుడు విషయం ఏమిటంటే కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడేందుకే పాడి ఇలాంటి గొడవలుచేస్తున్నట్లు అందరికీ అర్ధమవుతోంది. ఆమధ్య శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ విషయంలో కూడా ఇలాంటి గొడవేచేశాడు. గాంధీ కూడా బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తో నడుస్తున్న ఎంఎల్ఏనే. సమయం దొరికినపుడు లేదా సందర్భం దొరికిచ్చుకుని ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలకోసం గొడవలుపడటం కౌశిక్ అలవాటుగా చేసుకున్నాడు. గొడవలుపడగానే వెంటనే మీడియా, సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతాడు. ఆ విధంగా తమ అధినేతల దృష్టిలో పడేందుకే పాడి ఈ విధంగా అలజడి సృష్టిస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది. ఈ పద్దతిని కౌశిక్ రెడ్డి ఇంకా ఎంతకాలం కంటిన్యుచేస్తారో చూడాలి. ఏదేమైనా జరిగింది చూసినతర్వాత బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డిది ఓవర్ యాక్షన్ అన్నవిషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఆ ఓవర్ యాక్షన్ ఫలితంగానే ఇపుడు తనపైన మూడుకేసులు నమోదయ్యాయి.