
పోలీసులకే షాకిచ్చిన సైబర్ నేరగాళ్ళు
వారం రోజులుగా పని చేయని సైబరాబాద్, రాచకొండ వెబ్ సైట్లు
సైబర్ నేరగాళ్లు బరి తెగించారు. ఏకంగా తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయడం లేదు. వెబ్ సైట్లు హ్యాక్ అయిన విషయం ఆలస్యంగా అంటే గురువారం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న పోలీసులకే షాక్ గట్టి తగిలింది. ఏకంగా పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్‌సైట్లను కేటుగాళ్లు హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు పోలీసు శాఖకు సవాలు విసిరారు. వెబ్ సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్లు కూడా హ్యాక్‌కు అయినట్లు తెలుస్తోంది. దీంతో రెండు కమిషనరేట్ల ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి.
నేషనల్ ఇన్ఫర్‌మేటిక్స్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు వెబ్ సైట్ల పునరుద్దరణకు పనిచేస్తున్నారు. రెండు కమిషనరేట్ల వెబ్‌సైట్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. మరోసారి హ్యాకింగ్‌కు గురి కాకుండా అధునాతన ఫైర్వాల్స్ ఏర్పాటుకు ఐటీ టీమ్ కృషి చేస్తోంది. వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన ముఠాను గుర్తించేందుకు పోలీసు బృందాలు దర్యాప్తు మొదలుపెట్టాయి.
హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయిన కొద్ది రోజులకే తెలంగాణ పోలీసుశాఖ వెబ్ సైట్లు హ్యాక్ అవడం సంచలనమైంది. ఈ సైట్ లను ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ సైట్ లకు రీ డైరెక్ట్ అవుతున్నాయి.

