పోలీసులా మజాకానా ? పట్టుకుంటే వదిలిపెట్టరు
x
RBI containers

పోలీసులా మజాకానా ? పట్టుకుంటే వదిలిపెట్టరు

పోలీసులు తమ పవర్ ఏంటో చూపిస్తున్నారు. మామూలుగానే పోలీసులు ఎంతచెబితే అంత. ఎన్నికల సమయం అంటే ఇంకేమైనా ఉందా ? అందుకనే పోలీసులు ఆకాశమేహద్దుగా రెచ్చిపోతున్నారు.


పోలీసులు తమ పవర్ ఏంటో చూపిస్తున్నారు. మామూలుగానే పోలీసులు ఎంతచెబితే అంత. అలాంటిది ఎన్నికల సమయం అంటే ఇంకేమైనా ఉందా ? అందుకనే పోలీసులు ఆకాశమేహద్దుగా రెచ్చిపోతున్నారు. ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. అందుకని అన్నీ రాజకీయపార్టీలు, అభ్యర్ధులు ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. పోలింగ్ తేది దగ్గరకు వస్తోందంటే ప్రలోభాలకు కూడా తెరలేస్తున్నట్లే అనుకోవాలి. లక్షలు, కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. అందుకనే ఎన్నికల కమీషన్ పోలీసులతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటుచేసి ఎక్కడిక్కడ తనిఖీలు చేయిస్తోంది. ఎన్నికల్లో పంపిణీకి తీసుకెళుతున్న డబ్బులను పట్టుకోవటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ తనిఖీల ముసుగులో పోలీసులు చాలాచోట్ల మామూలు జనాలను, అవసరానికి డబ్బులు తీసుకెళుతున్న వ్యాపారస్తులు, ఏటీఎంల్లో నింపటానికి వెళుతున్న క్యాష్ వెహికల్స్ ను కూడా వదలటంలేదు.

ఇపుడు విషయం ఏమిటంటే కేరళ నుండి హైదరాబాద్ కు వస్తున్న నాలుగు కంటైనర్లను అనంతపురం పామిడి మండలం నేషనల్ హైవే దగ్గర పోలీసులు ఆపారు. అన్నీ కంటైనర్లకు పైన పోలీసు అనే స్టిక్కరుంది. కంటైనర్లకు పోలీసు అనే స్టిక్కర్ ఉండటంతో పోలీసులకు అనుమానమొచ్చింది. డ్రైవర్ తదితర సిబ్బందిని బయటకుదింపి విచారించారు. ఆ విచారణలో తెలిసిన విషయాలతో పోలీసులకు షాక్ కొట్టినట్లయ్యింది. కారణం ఏమిటంటే నాలుగు కంటైనర్లలో రు. 2 వేల కోట్లుంది. కంటైనర్లను వెంటనే తెరిపించి చూసిన పోలీసులకు రు .2 వేలు, రు. 500 నోట్ల కట్టలు కనిపించాయి. నాలుగు కంటైనర్లో రు. 500 కోట్లు చొప్పున బండిల్సున్నాయి. అవన్నీ ఎక్కడికి వెళుతున్నాయని పోలీసులు అడిగితే కేరళ రిజర్వుబ్యాంకు నుండి హైదరాబాద్ రిజర్వుబ్యాంకుకు తీసుకెళుతున్నట్లు డ్రైవర్, సిబ్బంది చెప్పారు. అయితే దాన్ని పోలీసులు నమ్మలేదు.

క్యాష్ తీసుకెళుతున్నట్లుగా అవసరమైన కాగితాలను సిబ్బంది చూపించినా పోలీసులు ఒప్పుకోలేదు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఇన్ కమ్ ట్యాక్స్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో అందుబాటులో ఉన్న అధికారులంతా కంటైనర్ల దగ్గరకు వచ్చారు. అక్కడినుండే కేరళ, హైదరాబాద్ లోని ఆర్బీఐ ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిజంగానే కంటైనర్లు ఆర్బీఐవే అని నిర్ధారించుకుని తర్వాత వాటిని వదిలిపెట్టారు. ఇందులో రు. 500 కోట్ల ఐసీఐసీఐ, మరో రు. 500 కోట్లు ఐడీబీఐకి, వెయ్యి కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంకుకు వెళ్ళాలి. పోలీసులు కంటైనర్లను ఆపి మళ్ళీ వదిలేటప్పటికి కొన్ని గంటలు పట్టింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఆర్బీఐ కంటైనర్లనే పోలీసులు కొన్ని గంటలపాటు నిలిపేశారు. ఇక మామూలు జనాల లెక్కేముంది. రవాణా అవుతున్న డబ్బులను పట్టుకునేందుకే ఎన్నికల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా స్పెషల్ ఆపరేషన్స్ టీములను (ఎస్ఓటీ) ఏర్పాటుచేశారు.

అయితే ఈ టీములు మామూలు జనాలు, వ్యాపారస్తులను చావగొట్టేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఎవరైనా సరే రు. 50 వేలు దగ్గరుంచుకోవచ్చు. రు. 50 వేలకు మించి దగ్గరున్నపుడు పోలీసుల తనిఖీలో దొరికితే మాత్రం లెక్కలు చెప్పాల్సిందే. వ్యాపారులు సాయంత్రం బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి తీసుకెళుతున్న క్యాష్ ను కూడా పోలీసులు వదలటంలేదు. మామూలు జనాలు అవసరాలకోసం రు. 50 వేలు తీసుకెళుతున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. వ్యాపారస్తులు, మామూలు జనాలు తమ దగ్గరున్న డబ్బుకు లెక్కలు, పత్రాలు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోకుండా సీజ్ చేసేస్తున్నారు. ఆ డబ్బును తిరిగి తెచ్చుకోవటానికి జనాలు నానా అవస్తలు పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకుల దగ్గర కాపుకాసి డబ్బులు డ్రాచేసి బయటకు వస్తున్న వాళ్ళని పట్టుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. అందుకనే పోలీసులా మజాకానా అని జనాలు అనుకుంటున్నారు.

Read More
Next Story