
బీఆర్ఎస్ నేతల ఇళ్ళపై పోలీసుల దాడులు
ఈరోజు ఉదయం ఒకేసారి బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి, ఎంఎల్సీ రవీందర్ రావు ఇళ్ళపై ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల నేపధ్యంలో శుక్రవారం డెవలప్మెంట్లు సంచలనంగా మారాయి. పంపిణీ చేయటానికి బీఆర్ఎస్ నేతల ఇళ్ళల్లో డబ్బులను భారీ మొత్తాల్లో నిల్వచేసుకున్నారన్న అనుమానాలతో పోలీసులు కొందరి ఇళ్ళలో సోదాలు(Police raids on BRS leaders houses) చేశారు. కారుపార్టీ ఎంఎల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి ఇళ్ళపై పోలీసులు ఏకకాలంలో దాడులుచేసి సోదాలు జరపటం కలకలం సృష్టిస్తోంది. జూబ్లీ హిల్స్(Jubilee Hills by poll) ఉపఎన్నిక ఈనెల 11వ తేదీన జరగబోతున్న విషయం తెలిసిందే. పోలింగ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయటానికి పార్టీలు డబ్బులు రెడీచేసుకుంటున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రచారంపై పార్టీలు ఒకదానిపై మరొకటి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలోనే ఈరోజు ఉదయం ఒకేసారి బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ ఎంఎల్ఏ మర్రి జనార్ధనరెడ్డి, ఎంఎల్సీ రవీందర్ రావు ఇళ్ళపై ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మోతీ నగర్లో ఉంటున్న మర్రి ఇంటిపైన, కూకట్ పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న రవీందర్ ఇళ్ళల్లో ఏకకాలంలో సోదాలు మొదలయ్యాయి. దీన్ని పై ఇద్దరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులే డబ్బులున్న బ్యాగులను తనింట్లోకి తీసుకెళ్ళినట్లు మర్రి ఆరోపిస్తున్నారు. తనింట్లో డబ్బుసంచలు లేకపోయినా పోలీసులే పెట్టి తనవిగా చిత్రీకరిస్తున్నారని మండిపోయారు. ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకతను డైవర్ట్ చేయటానికి సోదాల డ్రామాలాడుతున్నట్లు రెచ్చిపోయారు.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇంతటి రౌడీయిజానికి పాల్పడుతుందని అనుకోలేదని మర్రి అన్నారు. ఉపఎన్నికలో ఓడిపోతామని తెలిసి ఇలాంటి నాటకాలు ఆడటం మంచిదికాదన్నారు. ఇదేసమయంలో బీఎస్పీ కాలనీలో ఉంటున్న తక్కెళ్ళపల్లి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో ఉన్న తనింట్లో పోలీసులు ఎలా సోదాలు చేస్తారని రవీందర్ పోలీసులపై ఫైర్ అయిపోయారు. అయితే పోలీసులు రవీందర్ అభ్యంతరాలను లెక్కచేయలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రవీందర్ వాదన ఒకరకంగా కరెక్టే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతం కాబట్టే రవీందర్ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు డబ్బులు ఉంచకూడదని ఏమీలేదు కదా ? అన్న అనుమానంతోనే పోలీసులు సోదాలు చేస్తున్నారు.
తమ నేతల ఇళ్ళల్లో సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున రెండిళ్ళ దగరకు చేరుకున్నారు. తమను పోలీసులు బెదిరిస్తున్నారని, సోదాలపేరుతో వేధిస్తున్నారంటు కారుపార్టీ నేతలు గోలచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటు మండిపడుతున్నారు. మరి సోదాల్లో ఏమి దొరికాయో పోలీసులే చెప్పాలి.

