
భారీగా చైనా మాంజా పట్టివేత
సంక్రాంతి వేళ చైనా మాంజా క్రయవిక్రయాలపై పోలీస్ స్పెషల్ ఫోకస్.
సంక్రాంతి దగ్గర పడుతుంటే ఆనంద పడాలో, భయపడాలో అర్థం కావట్లేదు. ఒకవైపు పండగ వాతావరణం కనిపిస్తున్నా మరోవైపు ప్రయాణికుల్లో, ప్రజల్లో చైనా మాంజా భయం కూడా కనిపిస్తోంది. ఇంకా సంక్రాంతి రాలేదు కానీ.. చైనా మాంజా ప్రమాదాలయితే షురూ అయిపోయాయి. పలు ప్రాంతాల్లో చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరిగాయి. పలువురు వాహనదారులు తమ కుత్తుక్కలు కట్ కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా చైనా మాంజా క్రయవిక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ చర్యల్లో భాగంగానే పలు ప్రాంతాల్లో సోదాలు కూడా చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా చైనా మాంజా లభ్యమైంది. దాని విలువ దాదాపు రూ.2కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
చైనా మంజా విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసు బృందాలు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన చైనా మంజాను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఈ దాడులు నిర్వహించారు.
ప్రాథమిక విచారణలో ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఆర్డర్ ఆధారంగా కొంతమంది దుకాణదారులు అక్రమంగా చైనా మంజాను తెప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇండస్ట్రియల్ అవసరాల కోసం తయారు చేసే గట్టి ప్రత్యేక దారాన్ని మంజాగా ఉపయోగిస్తూ యువకులు గాలిపటాలు ఎగురవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ మంజాతో పోలిస్తే తక్కువ ధరకు లభించడమే చైనా మంజా వినియోగం పెరగడానికి ప్రధాన కారణమని వెల్లడించారు.
చైనా మంజా వల్ల పక్షులు జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు పాదచారులు కూడా తీవ్ర ప్రమాదానికి గురవుతున్నారని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించే బైక్ రైడర్లు మెడ ముఖ భాగాలకు గాయాలు పాలవుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా చైనా మంజా విక్రయాలు కొనసాగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా చైనా మంజా నిల్వ చేయడం విక్రయించడం వినియోగించడం నేరమని స్పష్టం చేశారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కఠిన చట్టాలు కూడా అమలు చేస్తామని తెలిపారు.
చైనా మంజా వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని యువత ప్రమాదకర మంజాకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమంగా చైనా మంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు నిరంతరం కొనసాగుతాయని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

