
తెలంగాణలో మొదలైన ఎలక్షన్ రైడ్స్..
ఒక్కోక్కరి క్యాష్ లిమిట్ రూ.50వేలే
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమలైంది. దీంతో మంగళవారం నుంచి అధికారులు విస్తృత్వంగా సోదాలు చేపట్టారు. రహదారుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. జాతీయ రహదారులపై సోమవారం నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర రహదారులు, ప్రధాన మార్గాల్లో కూడా సోదాలు ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక్కో వ్యక్తి రూ.50వేల నగదు మాత్రమే క్యారీ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మొత్తంలో వెళ్లాలంటే సరైన పత్రాలు చూపాలి. లేనిపక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. నగదు తక్కువ మొత్తంలో దొరికితే దానిని రెవెన్యూ అధికారుల దగ్గర జమ చేస్తారు. అదే పెద్దమొత్తంలో ఉంటే ఆదాయపన్ను జీఎస్టీ అధికారులకు సమాచారం అందించా ఆ నగదును కోర్టులో జమ చేస్తారు.
ఆధారాలు ఉంటే సరే..
అత్యవసర వైద్యం, కాలేజీ ఫీజులు, వ్యాపారం, పెళ్ళిళ్లు వంటి అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకుని వెళ్లేవారు తమతో సరైన ఆధారాలు ఉంచుకోవాలి. ఆధారాలు ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ తనిఖీల సమయంలో ఆధారాలు చూపించకలేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సంబంధిత అధికారులకు తమ పత్రాలను సమర్పిస్తే వారు జప్తు చేసిన నగదును తిరిగి ఇస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలంతా కూడా నగదు రవాణాపై నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.