ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వలంటీర్లు ప్రజలకు సేవలందించడంలో ముందున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల విషయంలో వారికి అత్యంత ప్రాధాన్యతిచ్చింది. వలంటీర్ల పాత్ర గ్రామ సచివాలయాల్లో ప్రముఖంగా ఉంటోంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి వారికి సహాయం అందే వరకు వాలంటీర్లు ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఎవరు లబ్ధిదారులు.. ఎవరు కాదనే వివరాలు వారి అర చేతిలో ఉంటాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రభుత్వం వారికి ఒక ట్యాబ్.. స్మార్ట్ ఫోన్, బయోమెట్రిక్ డివైజ్ అందజేసింది. అంటే ఆయా కుటుంబంలోని వివరాలన్నీ వాళ్ల అరచేతిలో ఉన్నట్లు. వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర అంగవైకల్యం ఉన్న వారి వివరాలతో పాటు ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునే వారి వివరాలు కూడా వారి చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఏ ఇంట్లో ఎంత మందికి సంక్షేమ పథకాల ద్వారా సాయం అందుతుందో ఆ వివరాలు కూడా వారికి తెలుసు. అందుకే ప్రతిపక్షం వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వీళ్లకిచ్చే జీతం అయిదు వేల మించకపోయినా, నిరుద్యోగులుగా ఉన్న తమకు సొంతవూర్లోనే ఒక ఉపాధి చూపించాడని వీళ్లంతా ముఖ్యమంత్రి జగన్ విధేయులై పోయారు. నిజానికి వీధుల్లో చాలా పవర్ ఫుల్ అయ్యారు. ఇక గ్రామాల్లో వీళ్లు ఎన్నికల్లో గెల్చిన సర్పంచులకంటే పలుకుబడి ఉన్న వాళ్లు. వాలంటీర్లు పంచాయతీ కార్యాలయం అక్రమించుకోవడం, దానితో జనం సర్పంచులను వదిలేసి వలంటీర్లు చుట్టూ తిరగడం మొదలయిందని సర్పంచులు వాపోతున్నాను. వీళ్లని ఓట్ల సైన్యంగా జగన్ వాడుకుని దెబ్బతీస్తాడేమోననేది టిడిపి భయం.
విధుల నుంచి దూరం చేసే వరకు పోరాటం
వాలంటీర్లను.. తమ విధులకు ఎన్నికల సమయంలో దూరంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపీ కూటమి మొదటి నుంచి చెబుతూ వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వీరి సేవలను తీవ్రంగా ఎన్డీఏ కూటమి వ్యతిరేకించింది. ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ నుంచి తగిన ఆదేశాలు వచ్చే వరకు వారి సేవలను కొనసాగిస్తూనే వచ్చింది.
అధికార పార్టీలో కార్యకర్తలుగా కొందరు వాలంటీర్లు నిజానికి వాలంటీర్లు అధికార పార్టీకి కార్యకర్తలుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం రూ. 5వేలు గౌరవ వేతనం తీసుకుంటూ ఎమ్మెల్యేల నోటి మాటతో నియమించబడిన వారు. అటువంటిప్పుడు అధికార పార్టీకి కార్యకర్తలుగా కాక ఎలా పని చేస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి కూడా తమ ఎన్నికల హామీల్లో వాలంటీర్ల కొనసాగింపు ఒకటి. ప్రస్తుతం ఇస్తున్న జీతం కంటే మరి కొంత జీతం పెంచి ఇచ్చి కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అంటే వారు కూడా ఈ వ్యవస్థను అధికారంలోకి వస్తే కోరుకుంటున్నారు. అయినా రానున్న ఎన్నికల్లో వీరిని పక్కన ఉంచితే తప్ప మేము నెగ్గలేమనే భయం కూడా ప్రతిపక్షంలో ఉంది. ఆ మేరకు వీరిని విధులకు దూరంగా ఉంచాలంటూ సిటిజన్ ఫర్ డెమోక్రెసీ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల సంఘం న్యాయ స్థానంలో ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఎందుకు ఉండకూడదో వివరిస్తూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఏప్రిల్ మాసంలో పంపిణీ చేయాల్సిన సామాజిక పించన్ల కార్యక్రమం సకాలంలో ముందుకు సాగ లేదు. పించన్ దారులు అధికార ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు చదువుకున్న వారైతే నేరుగా సిటిజన్ ఫర్ డెమోక్రెసీ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కూడా వదిలిపెట్ట లేదు.
కోర్టు తీర్పు కీలకం
వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచడంలో కోర్టు ఇచ్చిన తీర్పును ఎవరు తప్పు పట్టలేరు. అయితే ఆ తీర్పు కీలకంగా మారింది. ఎందుకంటే అది రాజ్యాంగం నిబంధనల ప్రకారం మాత్రమే ఉంటుంది. ఎన్నికల సమయంలో విగ్రగహాలకు ముసుగులు వేయడం, ఎక్కడైనా వాల్ రైటింగ్స్ రాస్తే తుడిపేయడం, ఓటర్లను ప్రభావితం చేయగలిగే ఏ వస్తువునైనా పక్కన పెట్టడం అనేది సాధారణమైన అంశం. అలా వచ్చిందే వాలంటర్లీను ఎన్నికల విధుల నుంచి తప్పించాలనే డిమాండ్ .
అయితే దీనిని అధికార పార్టీ సొమ్ము చేసుకుంటుందని చెప్పొచ్చు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయాలని సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అమల్లో సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకొని పర్యవేక్షించి సకాలంలో పించన్లు అందించేందుకు సరైన చర్యలు చేపట్టలేదు. కనీసం 10 రోజులపైనా పంపిణీ సమయం పడుతుందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వాలంటీర్ల వద్ద ఏ పరికరాలైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు స్వాధీనంచేసుకున్నారు. ప్రస్తుతం వాలంటీర్లకు ప్రభుత్వ కార్యక్రమాలతో ఎలాంటి సంబంధం లేదు. గౌరవ వేతనం మీద మాత్రమే పని చేస్తోన్న వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలని చెప్పినప్పుడు ప్రభుత్వ విధులను వదిలేసినట్లే. వారికి ప్రభుత్వ విధులకు ఎలాంటి సంబంధం లేదు. వారిప్పుడు స్వేచ్ఛా జీవులు. వారికి ఇష్టం వచ్చిన వారితో తిరగొచ్చు.. మాట్లాడొచ్చు.. పని చేయొచ్చు. వారికి ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వోద్దని ప్రతిపక్షం పట్టుబడుతోందంటే వాలంటీర్లపై కంప్లీట్‌గా నిర్భంధం విధించాలని కోరినట్లే. సాధారణ వ్యక్తిగా తిరుగుతున్నప్పడు వారిని నిర్బంధించే అధికారం ఎవరికీ లేదు. ఈ విషయం ప్రతిపక్షానికి కూడా తెలుసు. అయితే వాలంటీర్లు కుటుంబ స్థాయి వ్యవస్థలో పాతుకునిపోయి ఉన్నారనే అనుమానంతో వారి ఉనికినే దెబ్బతీయాలని ప్రయత్నించడం కూడా మంచిది కాదనే వాదన ఉంది.
ఏదేమైనా వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుత రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు తెరతీసింది. ఈ వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకొపోసుకుంటుంటే కొందరు అధికార పక్ష ఎమ్మెల్యేలు వాలంటీర్లను విధుల నుంచి తప్పించిన తర్వాత వారు స్వేచ్ఛగా ఎవరితోనైనా మాట్లాడటం చేయొచ్చు. దానిని కూడా తప్పు పడితే ఎలాగనే వాదన కూడా వాలంటీర్ల నుంచి వ్యక్తమవుతోంది.
జరగాల్సింది చూడాలి కానీ వాలంటీర్లను కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందించకుండా ఆలస్యం చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యులు రావులపల్లి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. వెంటనే పించన్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను గతంలో ఎలా కుటుంబాలకు చేరువ చేస్తున్నారో అలాగే చేరువ చేయాలని విజ్ఞప్తి చేశారు.