‘వారిపై ఆటం బాంబులు పేలతాయి’.. మంత్రి పొంగులేటి విసుర్లు
తెలంగాణలో అతి త్వరలోనే బాంబులు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి డోస్ మరింత పెంచారు.
తెలంగాణలో అతి త్వరలోనే బాంబులు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఈసారి మామూలు బాంబులు కావని ఆటం బాంబులు పేలతాయని డోస్‌ను మరింత పెంచారు ఈ మంత్రి. ‘‘గతంలో దీపావళికి బాంబులు పేలతాయని నేను అంటే కొందరు విమర్శలు చేశారు. నీ బాంబులు తుస్సయ్యాయా అంటూ సెటైర్లు వేశారు. వాళ్లే ఇప్పుడు జైలుకెళ్తే యోగా చేస్తానని, బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానంటూ మాట్లాడుతున్నారు’’ అని కేటీఆర్(KTR) టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు పొంగులేటి.
రాష్ట్రానికి మేలు చేయకుండా తప్పులు చేసిన వారందరిపై కూడా అతి త్వరలోనే ఆటం బాంబులు పేలతాయని మరోసారి జోస్యం చెప్పారు. ఆయన జోస్యం మళ్ళీ తెగ వైరల్ అవుతోంది. ఈసారి ఎవరిపై బాంబులు పేలుస్తారో అన్న చర్చ జోరుగా మొదలైంది. ఇంతకీ ఈసారి పేలే ఆ ఆటం బాబులు ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మంత్రి ఇంతలా చెప్తున్నారంటే పెద్ద అంశమేనని ప్రజలు అనుకుంటున్నారు. ఫార్ములా-ఇ రేసు(Formula-e Race)లో కుంభకోణం జరిగిందన్న అంశంలో ఏసీబీ(ACB) అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తునస్న క్రమంలో.. పొంగులేటి చెప్పిన ఆటంబాబు కచ్ఛితంగా కేటీఆర్ అరెస్టేనేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఆ మాట మేము ఏరోజూ చెప్పలేదు: పొంగులేటి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ల పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫలానా పార్టీకి చెందిన వారిని, ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తామని మేము ఏనాడూ చెప్పలేదు. ఏమైనా తప్పు చేసిన భయం మీకుంటే, చేసిన తప్పుకు శిక్షార్హులమే అని మీకు అనిపిస్తే.. సరెండర్ అవండి. కోర్టు ముందు తప్పును అంగీకరించండి. న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారం ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోండి. అంతేకానీ అనవసర ఉలికిపాటు ఎందుకు?’’ అని హితవు పలికారు.
నేనెవరి కాళ్లు పట్టుకోలేదు
‘‘నేను అదానీ(Adani) కాళ్లు మొక్కానని అంటున్నారు కదా.. దానికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఎవరి కాళ్లు పట్టుకోలేదు. పట్టుకోను కూడా. ఒకే ఒక్కసారి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నాను. అది కూడా వేల మంది ప్రజల సమక్షంలో బీఆర్ఎస్(BRS) చేరుతున్నప్పుడు నా తండ్రిలా భావించే మీ నాయన కాళ్లు పట్టుకున్నా. దానికి తడిగుడ్డతో నా గొంతు, కార్యకర్తల గొంతు కోయాలని కేసీఆర్ ప్రయత్నించారు’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు పొంగులేటి. ఈ సందర్భంగా కేటీఆర్ చేస్తానన్న పాదయాత్రపై కూడా పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేస్తానన్న పాదయాత్రను తమ పార్టీ స్వాగతిస్తుందని అన్నారాయన.
‘‘కేటీఆర్ పాదయాత్ర చేస్తానని అంటున్నారు. దానిని కాంగ్రెస్(Congress) స్వాగతిస్తుంది. కానీ పాదయాత్రలో భాగంగా వెళ్లిన ప్రతి గ్రామానికి రూ.1-2 కోట్లు ఇచ్చి మీ తప్పులను శుద్ధి చేసుకోండి. అలా చేస్తేనైనా రానున్న కాలంలో ఎప్పుడైనా మీకు మళ్ళీ అధికారం ఇవ్వడానికి ప్రజలు ఆలోచిస్తారేమో. అప్పటి వరకు వేచి చూడండి. మీరు చేసిన తప్పుల చిట్టా ప్రజల దగ్గరే ఉంది’’ అంటూ విమర్శలు గుప్పించారు.
పాదయాత్ర గురించి కేటీఆర్ ఏమన్నారంటే..
అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తప్పకుండా చేస్తానని, కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనని ఆయన వెల్లడించారు. అతి త్వరలో తన పాదయాత్రపై అప్‌డేట్ ఇస్తానని వివరించారు. ‘‘పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కోరుతున్నట్లుగానే అతి త్వరలో పాదయాత్ర చేస్తాను. రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటా. వారి సమస్య పరిష్కారం కోసం గళమెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా మా స్టాన్స్ అనేది మారదని స్పష్టం చేస్తా’’ అని వెల్లడించారు కేటీఆర్.