కొండా సురేఖకు పొన్నం ప్రభాకర్ సపోర్ట్.. ఆ వార్తలన్నీ తుస్సేనా..!
కొండా సురేఖ విషయంలో సినిమా వాళ్లు ఇక సైలెంట్ అవ్వాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఆయన స్పందన అనేక ప్రశ్నలకు జవాబు అయిందా..
సమంత, నాగచైతన్య విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారి తీశాయి. ఈ అంశంలో ఆమె వ్యాఖ్యలను సినీ ప్రముఖుల, రాజకీయ పెద్దలు కూడా తీవ్రంగా ఖండించారు. అసలు సంబంధంలేని వ్యక్తిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగాల్సిన అవసరం ఏముందని మంత్రిని తప్పుబట్టారు. కాగా ఈ విషయంపై మూవీ ఇండస్ట్రీ తీవ్రంగా స్పందించింది. దాదాపు ప్రతి స్టార్ హీరోగా కూడా మంత్రిని వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు. దీంతో కొండా సురేఖ కూడా సమంతకు క్షమాపణ చెప్పారు. కానీ నాగార్జున కుటుంబానికి మాత్రం ఎటువంటి క్షమాపణ చెప్పలేదు. పైగా తాను ఏం తప్పు మాట్లాడలేదని, తనకున్న సమాచారం మేరకు తానా వ్యాఖ్యలు చేశానని మరుసటి రోజు మరోసారి పునరుద్ఘాటించారు. అంతేకాకుండా రానున్న కాలంలో కూడా ఏ అంశమైనా ఉన్న సమాచారం మేరకు నిర్భయంగా చెప్తానని, ఎవరికీ భయపడేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ రచ్చ మరింత అధికం అయింది. ఇప్పటికే ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించి కొండా సురేఖను వెనకేసుకొచ్చారు. ఆమె క్షమాపణ చెప్పారు కదా.. సినిమా వాళ్లు దీనిని ఇంతటితో వదిలేయాలని విజ్ఞప్తి చేస్తున్నాని కోరారు. తాజాగా ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. సినిమా వాళ్లు ఇక సైలెంట్ అవ్వాలంటూ కస్సుబుస్సులాడారు.
సినిమాళ్ల తీరు సరికాదు
‘‘కొండా సురేఖ తన వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాల్సింది. ఏది ఏమైనా ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ సమస్య ముగిసినట్టే. అయినా ఇంకా సినిమా వాళ్లు ఈ అంశంపై స్పందించడం సరికాదు. బలహీనవర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదు’’ అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక దెబ్బ కొట్టో, తిట్టో తర్వాత సారీ అంటే సరిపోతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు కించపరిచిన వ్యక్తికి, కుటుంబానికి ఆమె క్షమాపణ చెప్పలేదని, తన వ్యాఖ్యల్లో ధైర్యంగా అందరినీ ఎదిరించి విడాకులు సైతం తీసుకున్నారు అన్న సమంతకు మాత్రమే క్షమాపణ చెప్పారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఒకరిని కొట్టి మరొకరికి సారీ చెప్తే ఎలా కుదురుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు.
రాజీనామా వార్తలు తుస్సేనా..
హర్యానా ఎన్నికల ప్రచారంలో బీజేపీ గనుక సమంతపై సురేఖ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తే పరిస్ధితులు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలున్నాయని అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలను తమంతట తాముగానే చెడగొట్టుకోవటం ఎందుకని ప్రియాంక గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని ప్రియాంక సోదరుడు రాహుల్‌తో చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. సురేఖ టార్గెట్ కేటీఆరే అయినా రోడ్డునపడింది మాత్రం అక్కినేని ఫ్యామిలి, సమంతలే. సురేఖ ఆరోపణలు, దాని పర్యవసానాలను రాహుల్ ఇప్పటికే రేవంత్‌తో చర్చించారట. మంత్రితో వెంటనే రాజీనామా చేయించాలని ఆదేశించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ ప్రచారాల నడుమ ఈరోజు ‘బలహీన వర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదు’ అంటూ కొండా సురేఖను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ అంతా ఆమెకు అండగా ఉంటుదన్న భావనను బలోపేతం చేస్తున్నాయి. దీంతో ఆమె రాజీనామా, ఆమెపై వేటు అంటూ వచ్చిన వార్తలన్నీ తుస్సే అని తల్చేశాయని విశ్లేషకులు చెప్తున్నారు.
టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..
‘‘సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదాన్ని ఇక ముగించండి. సినిమా పెద్దలందరికి నా విన్నపం.. సినీ ప్రముఖుల మనసు నొచ్చుకున్నది. మంత్రి తన వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి. ఇరు వైపులా మహిళలు ఉన్నారు.. కావునా ఈ విషయాన్ని ఇంతటితో వదలండి. మహిళల మనోభావాలను కించపరచాలనేది ఆమె ఉద్దేశం కాదు. కొండా సురేఖ తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో సమంత హిరోయిన్‌గా ఎదిగిన తీరు అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు తనకు ఆదర్శం అని కూడా వివరించారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి’’ అని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.