‘అంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దాం’.. పిలుపిచ్చిన పొన్నం ప్రభాకర్
దసరా పండగకు ఇంకా రెండు రోజులే ఉన్న క్రమంలో రాష్ట్రంలో వాహదారులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ పిలుపునిచ్చారు.
దసరా పండగకు ఇంకా రెండు రోజులే ఉన్న క్రమంలో రాష్ట్రంలో వాహదారులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ పిలుపునిచ్చారు. దసరా పండగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం.. పండగ వేడుకల్లో భాగంగా ఆయుధ భూజ చేసిన సమయంలో అంతా కలిసి ఓ ప్రతిజ్ఞ చేద్దామంటూ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అందరం పాటుపడాలని కోరారు. అందులో భాగంగా.. ‘‘ప్రతి ఒక్కరం తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. సీటు బెల్టు, హెల్మెట్ తప్పకుండా దరిద్దాం. మద్యం సేవించి వాహనాలు నడపము అని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని చెప్పారు మంత్రి. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు 1.60 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, తెలంగాణలో తీసుకున్నా రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాలకు అసువులు బాస్తున్నారని చెప్పారు. వాటిని తగ్గించడానికి, మనతో పాటు ఇతరుల ప్రాణాలకు భద్రత కల్పించేలా వాహనాలను నడుపుదామని, అన్ని నిబంధనలు పాటిద్దామని చెప్పారు. అందుకోసం అతి త్వరలోనే జీవో28ను త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై పలు చర్చలు చేశామని, మరిన్ని చర్చలు చేసి ఒక నిర్ణయానికి వచ్చి సరికొత్త ట్రాన్స్‌పోర్ట్ చట్టాలను తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. చింత చచ్చినా పులుపు చావ లేదన్నట్లు.. అధికారం పోయినా బీఆర్ఎన్ నేతలకు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
కేటీఆర్ చెప్పాలి
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా కలిసి వాళ్లని సున్నా సీట్లకే పరిమితం చేసినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని, అలా కాకుండా ప్రభుత్వం ఏం చేసినా తప్పుబట్టడం సబబు కాదని అన్నారాయన. గాంధీభవన్‌లో నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ఆయన బీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో పడిపోతుందంటూ కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారు ఆ పద్దతి మానుకుంటే మంచిదని హెచ్చరించారు. అనంతరం పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని కూడా ప్రశ్నించారు.
అప్పుడేం చేశావ్ జగదీష్ రెడ్డి..
కాంగ్రెస్ పదినెలలపై చర్చకు సిద్ధమంటున్న జగదీష్ రెడ్డి.. అధికారంలో ఉన్న పదేళ్లు ఏం చేశారో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ‘‘బీజేపీ తానా అంటే బీఆర్ఎస్ తందానా అనడం తప్ప పదేళ్లు ఏమైనా జరిగిందా? ఇప్పటికీ అదే జరుగుతుంది. ఎవరు ఎన్ని సెటైర్లు, పంచులు వేసినా కాంగ్రెస్ సర్కార్ కచ్ఛితంగా ఉద్యోగ నియామకాలు చేపడతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో తాను చెప్పిందే వేదవాక్కు అన్న రీతిలో కాంగ్రెస్ నడుచుకోవడం లేదు. అధికారుల నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం అభిప్రాయాలు తీసుకునే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.