
బీజేపీ అంటేనే దాడులు.. మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తుండడంతో బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతోంది. తట్టుకోలేకనే మా అధినాయకత్వాన్ని వేధిస్తోందని దుయ్యబట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను మోదీ అస్త్రాలుగా వినియోగించుకుంటున్నారంటూ ఆరోపించారు. అందుకు కాంగ్రెస్‌పై ఉన్న ‘ఇండియా హెరాల్డ్’ కేసు నిదర్శనమన్నారు. భీమదేవర పల్లిలో ఇందిరా మహిళా శక్తి సంచార చేపల విక్రయ వాహనాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రధాని మోదీ, బీజేపీపై విమర్శలు చేశారు.
‘‘కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడి వేధింపులు. బీజేపీ అంటేనే ఈడి,మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుంది. దేశంలో గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ బలం పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తుండడంతో బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతోంది. తట్టుకోలేకనే మా అధినాయకత్వాన్ని నేషనల్ హెరాల్డ్ లో ఈడి పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పై ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చు’’ అని అన్నారు.
‘‘కానీ వేధింపుల కోసమే ప్రభుత్వ విధానం నడుస్తుంది. నరేంద్ర మోదీ...ఇది మంచిది కాదు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీకి బీజేపీ జవాబు చెప్పలేకపోయింది. మా పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ వైఫల్యాలపై పోరాటాలు చేస్తుంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంట దేశం మొత్తం ఉంది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని వేధిస్తే మంచిది కాదు. అంబేద్కరిజంకి వారసులు కాంగ్రెస్ పార్టీ.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రక్షించేది కాంగ్రెస్ పార్టీ. మేము రాజ్యాంగ రక్షణ కోసం మాట్లాడుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.